గంటలోపే స్వైన్‌ఫ్లూ నిర్ధారణ | Swine Flu Diagnosis Test Within An Hour | Sakshi
Sakshi News home page

గంటలోపే స్వైన్‌ఫ్లూ నిర్ధారణ

Published Sun, Mar 1 2020 3:18 PM | Last Updated on Sun, Mar 1 2020 3:25 PM

Swine Flu Diagnosis Test Within An Hour - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు తీసుకున్న చర్యలు బాగానే ఉన్నాయని, అయితే కరోనా (కోవిడ్‌) వైరస్‌ వ్యాప్తి కాకుండా తీసుకున్న ముందస్తు ప్రణాళికలను కూడా తెలియచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. స్వైన్‌ఫ్లూ, డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి వ్యాధుల బారిన పడిన రోగులకు ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్య సహాయం అందడం లేదని నగరానికి చెందిన డాక్టర్‌ కరుణ, మరొకరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంతో పాటు, న్యాయవాది రాపోలు భాస్కర్‌ రాసిన లేఖను కూడా పిల్‌గా పరిగణించిన ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. 

స్వైన్‌ఫ్లూ (హెచ్‌1ఎన్‌1) వ్యాధి నిర్ధారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టుకు అఫిడవిట్‌ దాఖలు చేశారు. స్వైన్‌ఫ్లూ పరీక్షా కేంద్రాలు మూడు మాత్రమే ఉన్నాయని, మరో 14 చోట్ల ఏర్పాటు చేసేందుకు యంత్రాలను కొనుగోలు చేస్తున్నట్తు వివరించారు. మార్చి నెలాఖరులోగా ఈ యంత్రాలు వినియోగంలోకి వస్తాయని, ఇవి వస్తే ఒక చిప్‌ ద్వారా అనుమానితుడిని పరీక్షించి ఒక్క గంట వ్యవధిలోనే వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలు వెలువరించ వచ్చునని తెలిపారు. ప్రస్తుతం స్వైన్‌ఫ్లూ పరీక్షలు నిర్వహించే యం త్రాలు నారాయణ గూడలోని ఐపీఎం, నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రుల్లోనే ఉన్నాయని చెప్పారు. కొత్తగా కొనుగోలు చేయ బోయే యంత్రాలను కింగ్‌ కోఠి, ఖమ్మం, గద్వాల, సంగారెడ్డి జిల్లా ఆస్పత్రులు, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి, భువనగిరి ఏరియా ఆస్పత్రులు, బార్కాస్, హుజూరాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, శామీర్‌పేట, పెద్దపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  

187 స్వైన్‌ఫ్లూ కేసులు నిర్ధారణ
ప్రభుత్వాసుపత్రుల్లో 253 స్వైన్‌ఫ్లూ నమూనాలను పరీక్షిస్తే 26 మందికి, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 1,200 నమూనాలను పరీక్షిస్తే 161 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్వైన్‌ఫ్లూ రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహనా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పారు. స్వైన్‌ఫ్లూ సాంకేతిక కమిటీ గత జనవరి 2న సమావేశమైందని, జిల్లా స్థాయిలో అవగాహనా సమావేశాల నిర్వహణ, నమూనాల సేకరణ, ఇతర అంశాలపై శిక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. రెండు లక్షల పోస్టర్లు, 15 లక్షల కరపత్రాలను ముద్రించామని, ర్యాలీ నిర్వహించామని తెలిపారు. విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని డీఈవోలను ఆదేశించామన్నారు. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. వాదనల అనంతరం కోవిడ్‌పై తీసుకున్న జాగ్రత్తలపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ మార్చి 6కి వాయిదా వేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement