ముంబైలో హోలికా దహనం కోసం సిద్ధమవుతున్న కరోనా దిష్టిబొమ్మ
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తూ ఉండడంతో ఆ రాష్ట్రం లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. ఆర్థిక రంగంపై పెను భారం పడకుండా లాక్‌డౌన్ అమలు చేయడానికి పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికారుల్ని ఆదేశించినట్టు ప్రభుత్వ ప్రకటన వెల్లడించింది. ముఖ్యమంత్రి ఠాక్రే, ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపె, కోవిడ్–19 టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, ఇతర అధికారులు ఆదివారం సమావేశమై రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షించారు. రోజుకి 40 వేల కేసులు దాఖలయ్యే పరిస్థితులు తరుముకొస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదని కోవిడ్–19పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ అభిప్రాయపడింది.
దీంతో ముఖ్యమంత్రి ఆర్థిక రంగాన్ని దెబ్బతీసేలా మార్కెట్లన్నీ మూసేయకుండా కఠినమైన ఆంక్షలు విధించేలా ఒక ప్రణాళికను రూపొందించాలన్నారు. లాక్‌డౌన్ ప్రకటన చేసినప్పుడు ప్రజల్లో ఎలాంటి గందరగోళం లేకుండా ప్రణాళిక అమలులో స్పష్టత ఉండాలని చెప్పారు. మహారాష్ట్రలో ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా 40,414 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27,13,875కి చేరుకుంది. దేశవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో ప్రతీ రోజూ 60శాతానికిపైగా మహారాష్ట నుంచే వస్తున్నాయి. ఇక ఈ రాష్ట్రంలో వారంలో నమోదైన కేసుల పాజిటివ్ రేటు అ«త్యధికంగా ఉంది. జాతీయ పాజిటివిటీ రేటు 5.04గా ఉంటే మహారాష్ట్రలో ఏకంగా 22.78%గా ఉంది. కేసులు ఉధృతంగా ఉండడంతో ఇప్పటికే మహారాష్ట్రలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
దేశంలో ఒకే రోజు 300కిపైగా మరణాలు
దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 312 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు సంభవించిన మరణాల సంఖ్య 1,61,552కి చేరుకుంది. ఈ ఏడాది ఒకే రోజు మరణాల్లో ఇదే అత్యధికం. ఇక గత 18 రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. కొత్తగా 62,714 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,71,624కి చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,86,310కి చేరుకుంది. మొత్తం కేసుల్లో ఇది 4.06 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఐఐఎంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు 45 మందికి కరోనా పాజిటివ్ వస్తే, గాంధీ నగర్ ఐఐటీలో 25 మంది కరోనా బారినపడడం కలకలాన్ని రేపుతోంది.
పదేళ్లలోపు పిల్లలకీ కరోనా
బెంగళూరులో చిన్నారులకి కూడా కరోనా సోకడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటివరకు పదేళ్ల లోపు వయసున్న పిల్లలు 470 మందికిపైగా కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో 244 మంది అబ్బాయిలు ఉంటే, 228 మంది అమ్మాయిలు ఉన్నారు. ప్రతీ రోజూ సగటున తొమ్మిది మంది పిల్లలకి కరోనా పాజిటివ్‌గా తేలుతూ ఉంటే హఠాత్తుగా ఈ నెల 26న ఆ సంఖ్య 46కి చేరుకుంది. పాఠశాలలు ప్రారంభం కావడం, వివాహాలు, వేడుకలకి హాజరుకావడం, తోటి పిల్లలతో కలిసి ఆటలు ఆడడం వంటివాటితో పిల్లలకీ కరోనా సోకుతోంది. భౌతిక దూరం పాటించడం, ఎక్కువ సేపు మాస్కు ఉంచుకోవడం పిల్లలకి కష్టతరం కావడంతో వారికి తొందరగా వైరస్ సోకుతున్నట్టుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment