
న్యూఢిల్లీ: కోవిడ్–19 కేసులు పెరగడానికి 5జీ స్పెక్ట్రమ్ ట్రయల్సే కారణమంటూ వస్తున్న వదంతులపై టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవన్నీ తప్పుడు వార్తలని, వాటిని నమ్మరాదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలతో పాటు కొన్ని ప్రాంతీయ మీడియాలో కూడా కోవిడ్–19 కేసుల ఉధృతికి 5జీ స్పెక్ట్రం ట్రయల్సే కారణమంటూ వార్తలు చక్కర్లు కొడుతుండటం తమ దృష్టికి వచ్చినట్లు సీవోఏఐ శుక్రవారం తెలిపింది.
‘ఈ వదంతులన్నీ పూర్తిగా తప్పులతడకలే. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు వార్తలను విశ్వసించరాదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు 5జీ నెట్‌వర్క్‌లను ప్రారంభించాయి. ఆయా దేశాల్లోని ప్రజలు కూడా ఈ సర్వీసులను సురక్షితంగా వినియోగించుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా 5జీ టెక్నాలజీకి, కోవిడ్–19కి సంబంధం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది‘ అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్‌పీ కొచర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment