ఆంక్షల్ని సైతం లెక్కచేయకుండా ఆదివారం ముంబై జుహూ బీచ్‌లో చేరిన జనం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 1,59,632 కేసులు నమోదయ్యాయి. దీంతో క్రియాశీలక కేసులు భారీగా పెరిగి 6 లక్షల సమీపానికి చేరుకున్నాయి. కరోనా కేసుల రికవరీ రేటు 96.98 శాతానికి తగ్గడం కూడా యాక్టివ్ కేసుల్ని పెంచేసింది. ప్రస్తుతం 5,90,611 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శనివారం 4,72,169 ఉన్న యాక్టివ్ కేసులు ఒక్క రోజులోనే 1,18, 442లు పెరిగిపోవడం ఆందోళనకరంగా మారింది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.21 శాతానికి చేరుకుంది. ఇక సాంకేతికంగా ఒమిక్రాన్ కేసులు 3,623 ఉన్నప్పటికీ మొత్తం కేసుల్లో అగ్రభాగం అవే ఉండవచ్చునని అంచనాలున్నాయి.
► పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముందున్న వేళ లోక్‌సభ, రాజ్యసభ సిబ్బంది 400 మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. జనవరి 4–8 మధ్య వరకు పార్లమెంటు సిబ్బందికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఏకంగా 400 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది.
► కరోనా కేసులు పెరిగిపోతూ ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో గర్భిణులు, దివ్యాంగులు కార్యాలయానికి హాజరు నుంచి మినహాయింపునిచ్చినట్టుగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. వారు ఇంటి నుంచి పని చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నట్టుగా వెల్లడించారు.
► ఢిల్లీలో రోజుకి 20వేలకు పైగా కేసులు వస్తున్నప్పటికీ లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చెప్పారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరిస్తే లాక్‌డౌన్ అవసరం ఉండదన్నారు.
► మహారాష్ట్రలో అత్యధికంగా 41 వేలకు పైగా కేసులు నమోదైనప్పటికీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రభుత్వం కోవిడ్ ఆంక్షల్ని సవరించింది. జిమ్స్, బ్యూటీ సెలూన్లను 50% సామర్థ్యంతో జనవరి 10 అర్ధరాత్రి నుంచి నడుపుకోవచ్చునని ఉత్తర్వులు జారీ చేసింది.
► పంజాబ్‌లో ఆక్సిజన్ అవసరం ఉన్న కరోనా రోగుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన పెంచుతోంది. శుక్రవారం నాడు 62 మందికి కృత్రిమ శ్వాస అందిస్తే, శనివారానికి వారి సంఖ్య 226కి చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ వెల్లడించింది.
నలుగురు సుప్రీం జడ్జీలకు కరోనా
అత్యున్నత న్యాయస్థానంలో కూడా కరోనా కలవరం రేపుతోంది. సుప్రీంకోర్టుకి చెందిన నలుగురు న్యాయమూర్తులు, 5% సిబ్బందికి కరోనా సోకినట్టుగా కోర్టు అధికారులు వెల్లడించారు. సుప్రీంలోని 32 మంది న్యాయమూర్తులకు గాను నలుగురికి, 3 వేల మంది సిబ్బందిలో 150 మందికి కరోనా సోకినట్టుగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment