స్పెయిన్‌లోని బార్సిలోనాలో భౌతికదూరం పాటించని జనం
జెనీవా: కరోనా తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఆదివారమే సుమారు 1.83 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించడమే ఇందుకు సూచిక. కేవలం 24 గంటల్లో బ్రెజిల్‌లో 54,771 కేసులు, అమెరికాలో 36,617కేసులు బయటపడటంతో వైరస్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. అన్ని దేశాలూ పరీక్షల సంఖ్యను పెంచడం వల్ల ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని, అదే సమయంలో వైరస్ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు కూడా తెలుస్తోందని తెలిపింది.
తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడ్డ వారి సంఖ్య 91లక్షలకు చేరుకోగా, మొత్తం దాదాపు 4లక్షల 70వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాఫ్రికాలో శనివారం ఐదువేల కొత్త కేసులు నమోదు కాగా, 46 మంది వైరస్‌కు బలయ్యారు. ఇదే సమయంలో లాక్‌డౌన్ నిబంధనలు కొన్నింటిని సడలిస్తూ అధ్యక్షుడు సిరిన్ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. జర్మనీలోని మాంసం ప్యాకేజీ ఫ్యాక్టరీలో మొత్తంగా వేయికిపైగా కేసులు నమోదు కావడంతో 6500 మంది ఉద్యోగులు, వారి కుటుంబీకులనుక్వారంటైన్‌లో ఉండాల్సిందిగా స్థానిక ప్రభుత్వం ఆదేశించింది.
స్పెయిన్‌లో ఎమర్జెన్సీ ఎత్తివేత
కోవిడ్ కారణంగా మూడు నెలల క్రితం విధించిన ఎమర్జెన్సీను స్పెయిన్ ఎత్తివేసింది. దీంతో మార్చి 14 తరువాత సుమారు 4.7 కోట్ల మంది స్పెయిన్ వాసులు ఎలాంటి నిర్బంధాలు లేకుండా ప్రయాణాలు చేసే వీలేర్పడింది. బ్రిటన్‌తోపాటు 26 ఇతర యూరోపియన్ దేశాల నుంచి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్ నిబంధనను రద్దు చేసింది. వైరస్ మరోసారి వచ్చిపడే అవకాశం లేకపోలేదని ప్రధాని శాంచెజ్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment