సాక్షి, ముంబై/కోల్‌కతా/ఐజ్వాల్: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల విషయంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనాను మించిపోయింది. చైనాలో సోమవారం వరకు 83,040 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో కేసుల సంఖ్య 85,975కు చేరింది. చైనాలో 78,341 మంది కరోనా బాధితులు కోలుకోగా, మహారాష్ట్రలో 39,314 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 43,601. చైనాలో కేవలం 65 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చైనాలో 4,634 మంది కరోనాతో మరణించగా, మహారాష్ట్రలో 3,060 మంది చనిపోయారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే ఏకంగా 3,007 మందికి కరోనా సోకింది. ముంబైలో కరోనా కేసుల సంఖ్య ఆదివారం నాటికి 48,774కు చేరింది. ఇందులో 21,190 మంది చికిత్సతో కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం నగరంలో యాక్టివ్ కేసులు 25,940 ఉన్నాయి. ఈ సమయంలో మహారాష్ట్రలో ‘మిషన్ బిగిన్ అగైన్’ పేరుతో సోమ వారం నుంచి లాక్‌డౌన్ అంక్షలను పెద్ద ఎత్తున సడలించడం గమనార్హం. ముఖ్యంగా ముంబై లో బెస్టు బస్సులతోపాటు ట్యాక్సీలు, ఆటోలను అనుమతిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. నగరంలో భౌతిక దూరం పెద్దగా కనిపించడం లేదు.
బెంగాల్, మిజోరంలలో లాక్‌డౌన్
బెంగాల్‌లో జూన్ 30 వరకు, మిజోరాంలో మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. లాక్‌డౌన్ విషయంలో ఇప్పుడున్న మినహాయింపులు కొనసాగుతాయని తెలి పాయి. ఈ లాక్‌డౌన్ నిబంధనలను ప్రజలంతా కచ్చితంగా పాటించాలని కోరాయి. వలస కూలీలు సొంతూళ్లకు తిరిగి వస్తుండడంతో ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment