సాక్షి ముంబై: ముంబైలో కరోనా భారీగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య 5,000దాటింది. ప్రభుత్వ ఆరోగ్యశాఖ ప్రకటించిన వివరాల మేరకు ముంబైలో 5,190 కేసులు నమోదయ్యాయి. ముంబైలో గత కొన్ని రోజులుగా కోవిడ్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ముంబైలో మంగళవారం 3,514 కరోనా కేసులు కాగా బుధవారం ఈ సంఖ్య సుమారు రెండు వేలు పెరిగింది.
ముంబైలో లాక్‌డౌన్ ఉండదు...!
కరోనా కేంద్రంగా మారిన ముంబైలో లాక్‌డౌన్ విధించే అవకాశాలులేవని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పేర్కొంది. ఓ వైపు కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతున్నాయి. మరోవైపు బీఎంసీ అదనపు కమిషనర్ సురేష్ కాకాణి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం లాక్‌డౌన్ విధించాలని భావించడంలేదన్నారు. అయితే కరోనా విస్తరణను అడ్డుకునేందుకు నియమ నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేయనున్నట్టు చెప్పారు. అదేవిదంగా కరోనా పరీక్షలు మరింత పెంచనున్నట్టు తెలిపారు.
మహారాష్ట్ర మరోసారి కరోనా మహమ్మారికి కేంద్రంగా మారింది. కేంద్ర ఆరోగ్య శాఖ మీడియాకు అందించిన వివరాల మేరకు దేశంలో అత్యధికంగా 10 జిల్లాల్లో కరోనా యాక్టివ్ కేసులుండగా వీటిలో తొమ్మిది జిల్లాలు మహారాష్ట్రలోనివి ఉన్నాయి. మరోవైపు గడిచిన బుధవారం మహారాష్ట్రలో 31,855 కరోనా కేసులు నమోదకాగా కేవలం 15,098 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 95 మంది మృతి చెందారు. దీంతో రాష్టలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,47,299కి పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment