కరోనా..మరో ప్రపంచ రికార్డు | India adds record high 4,14,188 COVID-19 cases, 3,915 Deaths | Sakshi
Sakshi News home page

కరోనా..మరో ప్రపంచ రికార్డు

Published Sat, May 8 2021 3:29 AM | Last Updated on Sat, May 8 2021 8:22 AM

India adds record high 4,14,188 COVID-19 cases, 3,915 Deaths - Sakshi

మహారాష్ట్రలోని షోలాపూర్‌లో మార్కెట్‌లో కరోనా నిబంధనలను పట్టించుకోని జనం

సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా భారత్‌లో భారీగా నమోదవుతున్న కేసులు ప్రపంచ రికార్డులను తిరగరాస్తున్నాయి. వరుసగా మూడో రోజు 4 లక్షల మందికిపైగా కరోనా సోకినట్లు నిర్ధారణయింది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో 4,14,188 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,14,91,598కి చేరుకుంది. దీంతోపాటు, ఒక్క రోజులో 3,915 మంది కరోనాతో మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 2,34,083కి పెరిగింది.

మహారాష్ట్రలో అత్యధికంగా 853 మంది మరణించారు. పది రోజులుగా రోజుకు మూడు వేలకు పైగా కరోనా బాధితులు మరణిస్తున్నారు. పది రోజుల్లో మొత్తం 36,110 మంది మరణించారు. అంటే ప్రతి గంటకు 150 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం అమెరికాలో 10 రోజుల్లో 34,798 మంది, బ్రెజిల్‌లో 32,692 మంది మృతి చెందారు. దేశంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం యాక్టివ్‌ కేసులు 36,45,164కు చేరుకున్నాయి. కేవలం 10 నగరాల్లోనే 25% యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అందులో అత్యధికంగా బెంగళూరు అర్బన్‌లో 9.13%, పుణేలో 3.16%, ఢిల్లీలో 2.49%, అహ్మదాబా§ద్‌లో 1.82%, చికిత్స పొందుతున్న రోగులున్నారు.

గత 24 గంటల్లో 81.95% రికవరీ రేటుతో 3,31,507మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి సంఖ్య 1,76,12,351కు చేరుకుంది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 24 గంటల్లో 23,70,298 వ్యాక్సిన్‌ డోస్‌లు వేశారు. దీంతో ఇప్పటివరకు దేశంలో 16,49,73,058 వ్యాక్సిన్‌ డోస్‌లను ప్రజలకు అందించారు. మరోవైపు కరోనా సంక్రమణను గుర్తించేందుకు గురువారం ఒక్కరోజులోనే 18,26,490 శాంపిల్స్‌ను పరీక్షించారని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది.  దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 17,35,07,770 కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లను ఉచితంగా అందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement