జబల్పూర్‌లో మాస్క్ ధరించని వ్యక్తిని ఆపిన పోలీసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఏకంగా 27,126 కొత్త కేసులు బయటపడటంతో, దేశవ్యాప్తంగా ఈ రోజు నమోదైన కొత్త కేసుల సంఖ్య 40 వేలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 40,953 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. గత 111 రోజుల్లో ఒక రోజులో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,15,55,284కు చేరుకుందని కేంద్రఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కారణంగా 188 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,59,558కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,11,07,332కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 96.12 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,88,394గా ఉంది.
క్రమంగా పెరుగుదల
ఇటీవల దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. ప్రత్యేకించి 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పెరుగుదల కనిపిస్తోందని తెలిపింది. వాటిలోనూ మహారాష్ట్ర, కేరళ పంజాబ్ రాష్ట్రాల్లోనే 76.22 శాతం యాక్టివ్ కేసులు కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. మహారాష్ట్రలోని పుణే, నాగ్‌పూర్, ముంబై, థానే, నాసిక్ జిల్లాల్లో కోవిడ్ ప్రబలం ఎక్కువగా ఉండగా, కేరళలోని ఎర్నాకులం, పథానంతిట్ట, కన్నూర్, పాలక్కడ్, త్రిస్సూర్ జిల్లాల్లో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది.
మరోవైపు పంజాబ్‌లోని జలంధర్, ఎస్‌ఏఎస్ నగర్, పటియాలా, లూధియానా, హొషిర్‌పూర్‌లలో కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో వీటితో పాటు తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హరియాణాలు ఉన్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తనయుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేకు కరోనా సోకింది.
నాగ్‌పూర్‌లో నిబంధనలు
మహారాష్ట్రలో కోవిడ్ విస్తరిస్తున్న వేళ నాగ్‌పూర్ జిల్లాలో లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకూ పొడిగిస్తున్నట్లు మంత్రి నితిన్ రౌత్ చెప్పారు. ఇటీవల మార్చి 15 నుంచి 21 వరకూ కోవిడ్ ఆంక్షలను విధిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. నేటితో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో లాక్‌డౌన పొడిగిస్తున్నట్లు చెప్పారు. అయితే కొద్దిమేర నిబంధనలను సడలిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
అత్యవసర వస్తువులను సాయంత్రం 4 గంటల వరకు అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని, సాయంత్రం 7 వరకూ రెస్టారెంట్లను తెరచి ఉంచేలా నిబంధనలు సడలించినట్లు చెప్పారు. రాత్రి 11 వరకూ ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. నాగపూర్ జిల్లాలో శనివారం 3,679 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.
(చదవండి: వ్యాక్సిన్ వేయించుకోండి.. వివాహానికి రండి!)
Comments
Please login to add a commentAdd a comment