గుజరాత్‌లో రెండు, పుదుచ్చేరి, అస్సాంల్లో ఒక్కొక్కటి
బాధితులకు ఎలాంటి ప్రమాదం లేదన్న అధికారులు
అహ్మదాబాద్/డిబ్రూగఢ్/పుదుచ్చేరి: దేశంలో మరో నాలుగు హ్యూమన్ మెటాన్యూమోవైరస్(హెచ్‌ఎంపీవీ) కేసులు బయటపడ్డాయి. గుజరాత్‌లో రెండు, పుదుచ్చేరి, అస్సాంలలో ఒక్కోటి చొప్పున గుర్తించారు. బాధితుల్లో ముగ్గురు చిన్నారులు కాగా ఒకరు 59 ఏళ్ల వ్యక్తి. తాజాగా నిర్ధారౖణెన కేసులతో కలిపితే గుజరాత్‌లో వారం వ్యవధిలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఐదుకు చేరినట్లయింది. అహ్మదాబాద్‌కు చెందిన 9 నెలల మగ శిశువుకు జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో ఈ నెల 6న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు.
ఎలాంటి ప్రయాణ చరిత్ర లేని అతడికి హెచ్‌ఎంపీవీ సోకినట్లు నిర్ధారణైందని మున్సిపల్ అధికారులు తెలిపారు. అదేవిధంగా, కచ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి హెచ్‌ఎంపీవీ సోకినట్లు గుర్తించారు. ఈ బాధితుడికి కూడా ఎలాంటి ప్రయాణ చరిత్రా లేదని చెప్పారు. గుజరాత్‌లో ఈ నెల 6న మొదటి హెచ్‌ఎంపీవీ కేసు వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా, అస్సాంలోని డిబ్రూగఢ్‌కు చెందిన 10 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ వైరస్ సోకినట్లు తేలింది.
జలుబు సంబంధిత లక్షణాలతో నాలుగు రోజులుగా డిబ్రూగఢ్‌లోని అస్సాం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. ఇంకా, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న మూడేళ్ల చిన్నారికి హెచ్‌ఎంపీవీ సోకినట్లు వెల్లడైంది. ఆరోగ్యం మెరుగవడంతో ఇతడిని శనివారం డిశ్చార్జి చేశారని అధికారులు చెప్పారు. హెచ్‌ఎంపీవీ బాధితుల కోసం ప్రత్యేకంగా గొరిమేడులోని ప్రభుత్వ ఆస్పత్రిలో 10 పడకలతో కూడిన ప్రత్యేక ఐసీయూ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment