
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ రెండో వేవ్ కేసులు తగ్గుముఖం పట్టలేదనీ, ఆ తీవ్రత ఇప్పటికీ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. మొత్తమ్మీద కేసుల తీవ్రతలో తగ్గుదల 50% కంటే కొద్దిగా తక్కువగా ఉందని వివరించింది. దేశంలోని 35 జిల్లాల్లో వారం పాజిటివిటీ రేట్ 10%పైనే ఉండగా, మరో 30 జిల్లాల్లో 5–10% మధ్యన నమోదవుతోందని వెల్లడించింది. గత వారం దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 68.59% ఒక్క కేరళ నుంచే ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ గురువారం మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.
‘వినాయక చవితితో ప్రారంభం కానున్న ఈ పండుగల సీజన్‌లో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు తక్కువ సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొనాలి. అదేవిధంగా, మరీ అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదు’అని తెలిపారు. ‘దేశంలోని 58 శాతం మందికి కనీసం ఒక్క డోసు టీకా అందగా, 18% మందికి రెండో డోసు కూడా పూర్తయింది. 24 గంటల్లో వేసిన 86.51 లక్షల డోసులను కలుపుకుని, ఇప్పటి వరకు దేశంలో 72 కోట్ల డోసుల టీకా వేశారు’అని తెలిపింది. ఇప్పటి వరకు సిక్కిం, దాద్రానగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్‌ల్లో 18 ఏళ్లు నిండిన వారందరికీ కనీసం ఒక్క డోస్ కోవిడ్ టీకా వేసినట్లు తెలిపారు. కాగా, స్కూళ్లను తిరిగి తెరిచేందుకు విద్యార్థులందరికీ వ్యాక్సిన్ కచ్చితంగా ఇవ్వాలన్న నిబంధన ఏదీ లేదని వారు వివరించారు.
అయితే, ఉపాధ్యాయులు, పాఠశాలల సిబ్బంది, తల్లిదండ్రులు టీకా వేయించుకోవడం మంచిదని తెలిపారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. కోవిడ్ బాధిత చిన్నారుల్లో మరణాల రేటు తక్కువగా ఉండటం, వ్యాధి బాధితుల్లో ఎలాంటి లక్షణాలు లేని వారే ఎక్కువగా ఉండటం వంటి కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధమైన వైఖరితో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను చిన్నారులకు కూడా వినియోగించేందుకు అవసరమైన శాస్త్రతీయ పరమైన ధ్రువీకరణ దిశగా ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోంది’ అని వారన్నారు. 99% ఆరోగ్య కార్యకర్తలకు మొదటి డోసు, 84% మందికి రెండో డోసు కూడా పూర్తయిందన్నారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లందరికీ మొదటి డోసు, 80 శాతం మందికి రెండో డోసు కూడా పూర్తయిందని తెలిపారు.
రోజువారీ కేసుల్లో 14% పెరుగుదల
న్యూఢిల్లీ: దేశంలోని కరోనా కేసుల్లో గురువారం ఒక్క రోజే 14% పెరుగుదల నమోదైంది. 24 గంటల్లో 43,263 కొత్త కేసులు నిర్థారణ కావడంతో మొత్తం కేసులు 3,31,39,981కు చేరుకున్నట్లు కేంద్రం తెలిపింది. కోవిడ్ బారిన పడిన మరో 338 మంది మృతి చెందడంతో మొత్తం మరణాలు 4,41,749కు పెరిగాయని పేర్కొంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,93,614కు పెరగ్గా మొత్తం కేసుల్లో ఇవి 1.19%గా ఉన్నాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment