Idol Immersion Incident West Bengal Several Dead, Several Still Missing - Sakshi
Sakshi News home page

Idol Immersion: నదిలో ఒక్కసారిగా భారీ ప్రవాహం.. కళ్లముందే చాలామంది కొట్టుకుపోయారు..

Published Thu, Oct 6 2022 8:09 AM | Last Updated on Thu, Oct 6 2022 10:09 AM

Idol Immersion Incident West Bengal Several Dead Several Still Missing - Sakshi

కోల్‌కత: విజయదశమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా 8 మంది మృతి చెందారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు మాల్‌ నదిలోకి దిగారు. అయితే, ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో పలువురు కొట్టుకుపోయారు. వారిలో 8 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. 

ఈ ఘటన బుధవారం రాత్రి 8.30 ప్రాంతంలో జరిగిందని జల్పైగురి జిల్లా కలెక్టర్‌ మౌమితా గోదర తెలిపారు. వందలాది మంది విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు మాల్‌ నది ఒడ్డున పోగయ్యారని, అంతలోనే భారీ ఎత్తున వరద ప్రవాహం పెరగడంతో కొందరు కొట్టుకుపోయారని వెల్లడించారు. 50 మంది స్థానికుల సాయంతో బయటపడ్డారని, కొందరు గల్లంతయ్యారని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడ్డ 13 మందిని ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, పోలీసులు, స్థానిక యంతాంగంతో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగున్నాయని అన్నారు.

మాల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ వెల్ఫేర్‌ మంత్రి బులు చిక్‌ బరైక్‌ మాట్లాడుతూ.. మృతుల సంఖ్య పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నట్టు తెలిపారు. బలమైన వరద కారణంగా కళ్లముందే చాలామంది నదిలో కొట్టుకుపోయారని అన్నారు. కాగా, మంత్రి బులు, మరికొంతమంది తృణమూల్‌ నేతలు సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. సహాయకచర్యలను ముమ్మరం చేయాలని ప్రతిపక్షనేత సువేంధు అధికారి పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఆయన ట్వీట్‌ చేశారు. జల్పైగురి దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement