Dussehra: నవదుర్గా అవతార రహస్యాలు.. ఏమిటీ దసరా? ఆరోగ్యానికి ఔషధంలా జమ్మి | Dussehra 2022: Significance OF Navratri Vijayadashami Jammi All Need To Know | Sakshi
Sakshi News home page

Dussehra 2022: నవదుర్గా అవతార రహస్యాలు.. ఏమిటీ దసరా? ఆరోగ్యానికి ఔషధంలా జమ్మి!

Published Sun, Oct 2 2022 11:48 AM | Last Updated on Tue, Oct 4 2022 4:57 PM

Dussehra 2022: Significance OF Navratri Vijayadashami Jammi All Need To Know - Sakshi

‘అమ్మ’ అంటే ఆత్మీయతకు ఆలవాలం. ఎందుకంటే, 
తనలోంచి మరొక ప్రాణిని సృజించగల శక్తి అమ్మకే ఉంది. 
‘జగన్మాత’ అంటే జగత్తుకే తల్లి. 
‘మా అమ్మ’ అంటే మనకు జన్మనిచ్చిన తల్లి. 
జగజ్జనని అంటే అన్ని లోకాలకూ అమ్మ. 
అందుకే భారతీయ ఆధ్యాత్మికత అమ్మకు ఎంతో విశేష ప్రాధాన్యాన్ని ఇచ్చింది. అమ్మకు తన బిడ్డలంటే ఎంతో వాత్సల్యం. 

అంతటి వాత్సల్యమూర్తి అయిన అమ్మ కూడా తన బిడ్డలు చెడ్డవారిగా తయారవడాన్ని, లోక కంటకులుగా మారడాన్ని సహించలేదు. వారిలోని దానవత్వాన్ని దునుమాడటానికి ఏమాత్రం వెనుకాడదు. ముందు మంచిగా చెబుతుంది. వినకపోతే ఆయుధాన్ని ధరిస్తుంది, బెదిరిస్తుంది. అప్పటికీ తీరు మార్చుకోక పోతే రౌద్రమూర్తిగా మారి సంహరిస్తుంది.

వేల ఏళ్ల కిందట జరిగింది అదే. లోక కంటకులుగా మారిన దుష్టరాక్షసులను అమ్మ వెంటాడి, వేటాడి మరీ సంహరించింది. అందుకు  ప్రతీకగా జరుపుకుంటున్న ఉత్సవాలే దసరా మహోత్సవాలు. 

ఈ సృష్టి యావత్తూ మంచి–చెడు శక్తులతో నిండి ఉంది. మానవాళిని పీడించే చెడు శక్తులను లోకరక్షణ చేసే దైవశక్తులు నిర్మూలిస్తాయి. అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు అమ్మ నుంచే లభిస్తాయి. అయితే తాను అందించిన శక్తి సరిపోకపోతే తానే శక్తి స్వరూపిణిగా మారి, దానవత్వాన్ని దునుమాడుతుంది.

ఉగ్రరూపిణిగా ఉన్న అమ్మను ప్రసన్నం చేసుకునేందుకు బిడ్డలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. గడ్డం పట్టుకుని బతిమాలుతారు. అప్పటికీ దిగిరాకపోతే పాదాల మీద పడి పూజిస్తారు. అమ్మకు ఇష్టమైనవన్నీ ఆమె పాదాల ముందు ఉంచి అమ్మ ప్రేమను, అనుగ్రహాన్ని అందుకుంటారు. 

‘అమ్మ’ అనే శబ్దం తరతమ భేదాలతో దాదాపు అన్ని భాషల్లోనూ గొప్పగా ధ్వనిస్తుంది. బిడ్డలోని లోపాలను పట్టించుకోకుండా అక్కున చేర్చుకునే అమృతమూర్తి అమ్మ. లోకంలో తమ బిడ్డలను ఎంతో ప్రేమగా చూస్తారు తల్లులు. అయితే, తల్లి లేని వారిక్కూడా జగజ్జనని ఆ ప్రేమను అందిస్తుంది.

అమ్మవారిది దివ్యానుగ్రహం. అది అందుకోగలిగిన వారిదే అదృష్టం. భారతీయుల గొప్పదనం తల్లిని దేవతగా ఆరాధించడం. తల్లి ఆరాధన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా జరగడం సర్వసాధారణం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జగన్మాతను ‘బతుకమ్మ’ పేరుతో ఆరాధిస్తారు. బతుకమ్మ పండుగను చాలా శ్రద్ధాసక్తులతో నిర్వహించుకుంటారు. ఈ వేడుకల్లో మహిళల పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది. బతుకమ్మ పండుగలో ఆటపాటలతోపాటు నైవేద్యాలది కూడా పెద్దపీట. 

ఆ అలంకరణలలోని ఆంతర్యం
మాయావులైన రాక్షసులు అమ్మవారి కళ్లు కప్పేటందుకు రకరకాల వేషాలు వేశారు. వారి ఆట కట్టించేందుకు అమ్మవారు కూడా రోజుకో వేషం ధరించి తొమ్మిది రోజులు– రేయింబవళ్లూ మహాసంగ్రామం చేసింది. అందుకు ప్రతీకగానే నేటికీ భక్తులు అమ్మవారిని తొమ్మిది రోజులు ప్రత్యేక శ్రద్ధాసక్తులతో రోజుకో రూపంలో అలంకరించి, భక్తిశ్రద్ధలతో పూజించుకుని పరవశిస్తారు.

పదోరోజున విజయోత్సాహ వేడుకలు జరుపుకుంటారు. విశిష్ట ఆరాధకులు తొమ్మిది మంది బాలికలను పూజించి, నూతన వస్త్రాలు సమర్పిస్తారు. పూజలు, ఆరాధనలు జరుగుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కోల్‌కతా, కర్ణాటక వంటి ప్రదేశాల్లో దసరా మహోత్సవాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మైసూరు కూడా దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి.

ఏమిటీ దసరా? 
‘దశహరా’అనే సంస్కృత పదం వికృత రూపంలోకి మారి ‘దసరా’ అయ్యింది. దశహరా అంటే పది జన్మల పాపాలను, పదిరకాలైన పాపాలను పోగొట్టేది అని అర్థం. దుర్గాదేవి కూడా తన భక్తుల జన్మజన్మల పాపాలను తొలగిస్తుంది కాబట్టి ఈ దేవిని స్మరిస్తూ చేసే ఉత్సవాలు దసరా ఉత్సవాలయ్యాయి.

ఇక శబ్దార్థపరంగా చూస్తే ‘ద’ అంటే దానవులను, ‘సరా’ అంటే దూరం చేయునది–రాక్షసులను సంహరించి, ప్రజలకు సుఖశాంతులు అందించింది కాబట్టి ఆ ఆనందంతో దసరా వేడుకలు జరుపుకుంటున్నాం. 

నవరాత్రి వైశిష్ట్యం
దసరా ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. అందుకనే వీటిని నవరాత్రులు అంటారు.  ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవ కాలమే నవరాత్రులు. నవరాత్ర వ్రతం ద్వారా తనను ఆరాధించిన వారిని దుర్గాదేవి అనుగ్రహిస్తుంది.

రాత్రి శబ్దానికి పరమేశ్వరి అని, నవ అనే శబ్దానికి పరమేశ్వరుడనే అర్థాలు ఉన్నాయి. ఈ ప్రకారం చూస్తే పార్వతీపరమేశ్వరుల ఆరాధనమే నవరాత్ర వ్రతం.

నవదుర్గా అవతార రహస్యాలు
నవరాత్రి ఉత్సవాల్లో అందరినీ సమ్మోహితులను చేసే అంశం – అమ్మ వారి అలంకారాలు. రాక్షస సంహార క్రమంలో దుర్గాదేవి ధరించిన రూపాలకు ప్రతిగా రోజుకు ఒక్క అలంకారం చొప్పున నవరాత్రులు జరిగే రోజుల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అసుర సంహారం చేసి సాధించిన విజయానికి చిహ్నంగా పదో రోజున విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటారు.

మధుకైటభాది రాక్షస సంహారం కోసం అమ్మ ధరించిన ఈ రూపాలనే ‘నవదుర్గ’ రూపాలుగా దేవీ, మార్కండేయ, భవిష్య పురాణాలు చెబుతున్నాయి. దేవీ భాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిద అనేవి నవదుర్గా రూపాలు. ప్రతి అవతారానికి ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక, ఉపాసనా రహస్యాలు ఉన్నాయి.

జమ్మి బంగారమే!(Jammi Chettu- Health Benefits)
ఈ పండగ సమయంలో అన్నిటికన్న ముఖ్యమైంది ముళ్ళకంపలాంటి ... కొండవాలుల్లో పెరిగే శమీవృక్షపూజ. దానికి కారణం రామరావణ యుద్ధానికి ముందు రాముడు, అరణ్యవాసాన తమ ఆయుధాలను మూటకట్టి ఈ చెట్టుపై ఉంచి పాండవులు ఈ చెట్టును పూజించడం వలన ఇది విజయమిచ్చే పూజనీయ వృక్షమైంది.

ఈ చెట్టుబెరడుతో చేసే కషాయం దగ్గు, ఉబ్బసం వ్యాధులను నిరోధించి ఆరోగ్యాన్ని తద్వారా శుభాల్నిస్తుంది. అధిక జీర్ణశక్తిని కలిగిస్తుంది. ఆరోగ్యానికి ఔషధంలా జమ్మి చెట్టు ఎలా పనిచేస్తుందో, ఈ చెట్టు గొప్పతనమేంటో తెలియచెప్పటానికి, తెలుసుకోవటానికి జమ్మి ఆకులను పెద్దలకిచ్చి వారికి పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకుంటారు పిల్లలు.

జమ్మి ఆకును తెలంగాణ ప్రాంతంలో బంగారమని పిలుస్తారు. ఈ పండుగ నాడు పెద్దలకు, పూజ్యులకు, ఆత్మీయులకు ఈ జమ్మి బంగారాన్ని ఇచ్చి ఆశీస్సులు అందుకోవడం ఆనవాయితీ. 

దసరాకు ఇది మామూలే!
దసరా రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్థులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటికి దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్థును మామూళ్ళు అడగటం, వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే.

దీనిని దసరా మామూలు అంటారు. కొత్తగా వివాహం జరిగిన ఆడపడచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికీ కూతురికీ తలంటు పోసి నూతనవస్త్రాలు, కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా అలవాటే.

విజయాలకు కారకమైన దశమి 
విజయుడు (అర్జునుడు) విరాటరాజు కొలువులో ఉండి కౌరవ సేనలను ఓడించి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన రోజు కాబట్టి విజయ దశమి అయ్యింది. శ్రీరాముడు రావణ సంహారం చేసింది కూడా విజయ దశమినాడే. అందుకే ఈ దసరా పర్వదినాన రామ్‌లీలా ఆడటం ఆనవాయితీ.

అదేవిధంగా షిరిడీ సాయిబాబా సమాధి చెందింది కూడా దసరా నాడే. నిజానికి దశ, హర అంటే పది చెడు లక్షణాలను తొలగించుకోవడం అని అర్థం. మనిషిలో పది దుర్గుణాలే అధర్మం వైçపు నడిపిస్తున్నాయి.

ఆ చెడుగుణాలపై విజయం కోసమే దసరా పండుగ చేసుకుంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్య, స్వార్థ, అన్యాయ, అమానుష, అహంకారాది లక్షణాలు మనుషులను దారి తప్పిస్తాయి. చెడు పనులకు ప్రోత్సహిస్తాయి. అవి ఇతరులకు హానిచేస్తాయి. వీటిపై విజయం సాధించడం మన ప్రథమ కర్తవ్యం. అందుకు అవకాశం కలిగిస్తూ విజయదశమి వేడుకలు జరిపించుకుంటున్న జగజ్జననికి జయము... జయము...

దసరా ఉత్సవాల్లో ఆఖరి రోజు విజయ దశమినాడు రాత్రి సమయంలో ఇంద్రకీలాద్రి అధిష్ఠాన దేవత శ్రీ కనకదుర్గాదేవి, మల్లేశ్వర స్వామి వార్లు కృష్ణానదిలో హంసవాహనంపై నదీవిహారం చేస్తారు. అమ్మవారి త్రిలోక సంచారానికి గుర్తుగా నదిలో మూడుసార్లు  హంసవాహనాన్ని (తెప్పను) తిప్పుతారు. కన్నుల పండువగా సాగే ఈ తెప్పోత్సవంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. 
-డీవీఆర్‌ భాస్కర్‌
ఫొటోల సహకారం: షేక్‌ సుబాని, సాక్షి, ఇంద్రకీలాద్రి


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement