Navratri 9 Avatars
-
బెజవాడ కనక దుర్గమ్మ దసరా అలంకారాలు... నైవేద్యాలు
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు శక్తి ఆలయాలన్నింటా అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి అంగరంగవైభవంగా, అత్యంత సంప్రదాయబద్ధంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆ చల్లని తల్లి భక్తులకు రోజుకో అలంకారంలో దర్శనం ఇస్తుంది. వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడినుంచో విచ్చేస్తారు. అయితే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అవతరించిన దుర్గాదేవికి చేసే అలంకారాలకే ఎనలేని ప్రాధాన్యం ఉంది. అందుకే విజయవాడ కనకదుర్గమ్మ దసరా అలంకారాలను అందిస్తున్నాం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో బెజవాడ కనక దుర్గమ్మ రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. మొదటి రోజు: స్వర్ణకవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవి (ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి, సోమవారం) శరన్నవరాత్రి మహోత్సవాల్లో తొలిరోజు శ్రీ అమ్మవారిని స్వర్ణకవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవిగా అలంకరిస్తారు. ఈ అలంకారంలో అమ్మ బంగారు రంగు చీరలో దర్శనమిస్తుంది. ఈ రూపంలో అమ్మను దర్శించుకుంటే సకల దారిద్య్రాలూ తొలగుతాయని ప్రతీతి. నైవేద్యం: చక్కెరపొంగలి. రెండవ రోజు: శ్రీబాలాత్రిపుర సుందరీదేవి(ఆశ్వయుజ శుద్ధ విదియ, మంగళవారం) దసరా ఉత్సవాల్లో రెండవ రోజు శ్రీ దుర్గమ్మను లేత గులాబీ రంగు చీరలో శ్రీ బాలాత్రిపురసుందరీదేవిగా అలంకరిస్తారు. బాలామంత్రం సమస్త దేవీమంత్రాల్లోకి గొప్పది. అందుకే శ్రీ విద్యోపాసకులకి మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యంకొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత ఈ బాలాదేవి. బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. నివేదన: కట్టెపొంగలి మూడవరోజు: శ్రీగాయత్రి దేవి (ఆశ్వయుజ శుద్ధ తదియ, బుధవారం ) దసరా మహోత్సవాల్లో మూడవరోజున అమ్మవారు శ్రీ గాయత్రిగా దర్శనం ఇస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ గాయత్రీదేవిని నారింజ రంగు చీరలో అలంకరిస్తారు. పంచముఖాలతో, వరదాభయహస్తాలను ధరించిన శ్రీ గాయత్రి అలంకారంలోని అమ్మవారిని దర్శించుకుంటే సర్వపాప హరణం జరుగుతుంది. నివేదన: పులిహోర నాలుగవ రోజు: శ్రీ అన్నపూర్ణాదేవి (ఆశ్వీయుజ శుద్ధ చవితి, గురువారం) సకల జీవరాశులకు అహారాన్ని అందించే దేవత అన్నపూర్ణాదేవి. గంధం రంగు లేదా పసుపు రంగు చీరను ధరించి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో అమృతాన్నాన్ని, వజ్రాలు పొదిగిన గరిటెతో తన భర్తౖయెన ఆదిభిక్షువు పరమ శివుడికి అన్నం పెడుతున్న అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే క్షుద్బాధలు ఉండవని భక్తుల నమ్మకం. నివేదన: దద్ధ్యోదనం, క్షీరాన్నం, అల్లం గారెలు. ఐదవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి (ఆశ్వీయుజ శుద్ధ పంచమి, శుక్రవారం ) త్రిమూర్తులకన్నా పూర్వం నుంచి ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలుస్తారు. లలితా త్రిపుర సుందరీ దేవియే శ్రీ చక్ర అధిష్ఠానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా తనను కొలిచే భక్తులను అనుగ్రహిస్తోంది. లక్ష్మి, సరస్వతి ఇరువైపులా వింజామర లు వీస్తుండగా, చిరు దరహాసంతో చెరుకుగడను చేతపట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చున్న శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిని దర్శించుకున్న భక్తులకు కోరిన కోరికలు నెరవేరతాయని ప్రతీతి. నివేదన: అల్లం గారెలు ఆరవ రోజు: శ్రీ మహాలక్ష్మీదేవి (ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి, శనివారం) మంగళప్రదమైన దేవత శ్రీమహాలక్ష్మీదేవి. లోక స్థితికారిణిగా ధన, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి, సమష్టిరూపమైన అమృతస్వరూపిణిగా గులాబీ రంగు చీరను ధరించి, సర్వాభరణ భూషితురాలై ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే అషై్టశ్వర్యాలకు కొదవ ఉండదని ప్రతీతి. నివేదన: రవ్వకేసరి ఏడవ రోజు: శ్రీ సరస్వతీదేవి (ఆశ్వీయుజ శుద్ధ సప్తమి, ఆదివారం) మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణిమైన దుర్గాదేవి తన అంశలోని నిజరూపాన్ని సాక్షాత్కరింప చేయడమే మూలా నక్షత్రం నాడు చేసే సరస్వతీ అలంకారం ప్రత్యేకత. తెల్లని పట్టుచీర ధరించి, చేతిలో వీణతో సరస్వతీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మవారి జన్మనక్షత్రం రోజున దర్శించుకుంటే భక్తుల కష్టాలు తీరతాయని, కోరిన విద్యలు వస్తాయనీ నమ్మకం. విద్యను, బుద్ధిని ప్రసాదించే సరస్వతీదేవి అలంకారంలోని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. నివేదన: పెరుగన్నం ఎనిమిదవ రోజు: శ్రీ దుర్గాదేవి (ఆశ్వీయుజ శుద్ధ అష్టమి, సోమవారం) దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించింది అష్టమి రోజునే. అందుకే అమ్మవార్ని దుర్గాదేవిగా కీర్తిస్తారు. అందుకే ఈ అష్టమిని దుర్గాష్టమి అంటారు. దేవి త్రిశూలం ధరించి సింహవాహనాన్ని అధిష్ఠించి, బంగారు కిరీటాన్ని ధరించి తన కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపెట్టి ఉంచుతున్నట్లుగా దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తుంది. దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే దుర్గతులు దూరం అవుతాయి. నివేదన: కదంబం (కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం కలిపి వండే వంట) తొమ్మిదవ రోజు: శ్రీ మహిషాసుర మర్దిని దేవి, (ఆశ్వయుజ శుద్ధ నవమి, మంగళవారం) అష్ట భుజాలతో ఒక చేత త్రిశూలాన్ని ధరించి, సింహవాహనంపై దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకానికి మేలు చేసింది. ఈ రూపంలో అమ్మ దర్శనం మానవాళికి సమస్త భయాల్ని పోగొట్టి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ప్రసాదిస్తుంది. నవమి రోజున మహిషాసురుని సంహరించింది కాబట్టి ఈ పర్వదినాన్ని మహర్నవమి అని వ్యవహరిస్తారు. నివేదన: గుడాన్నం విజయదశమి: శ్రీరాజరాజేశ్వరీ దేవి (ఆశ్వీయుజ శుద్ధ దశమి, బుధవారం ) దసరా ఉత్సవాల్లో ఆఖరు రోజున దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. షోడశ మహామంత్ర స్వరూపిణీ, మహాత్రిపురసుందరి, శ్రీ చక్ర అధిష్ఠాన దేవత శ్రీరాజరాజేశ్వరీదేవి విజయదశమి అపరాజితాదేవి పేరు మీద ఏర్పడింది. విజయాన్ని సాధించింది కాబట్టి విజయ అని అంటారు. పరమ శాంత స్వరూపంలో చిరునవ్వులు చిందిస్తూ చెరుకుగడను చేతిలో పట్టుకొని ఉన్న అమ్మవారిని విజయదశమినాడు దర్శించుకుంటే అన్నింటా విజయం సాధిస్తారని నమ్మకం. నివేదన: పరమాన్నం (పాయసం) --డీ.వీ.ఆర్ భాస్కర్ ఫొటోల సహకారం: షేక్ సుబాని, సాక్షి, ఇంద్రకీలాద్రి -
Dussehra: నవదుర్గా అవతార రహస్యాలు.. ఏమిటీ దసరా? ఆరోగ్యానికి ఔషధంలా జమ్మి
‘అమ్మ’ అంటే ఆత్మీయతకు ఆలవాలం. ఎందుకంటే, తనలోంచి మరొక ప్రాణిని సృజించగల శక్తి అమ్మకే ఉంది. ‘జగన్మాత’ అంటే జగత్తుకే తల్లి. ‘మా అమ్మ’ అంటే మనకు జన్మనిచ్చిన తల్లి. జగజ్జనని అంటే అన్ని లోకాలకూ అమ్మ. అందుకే భారతీయ ఆధ్యాత్మికత అమ్మకు ఎంతో విశేష ప్రాధాన్యాన్ని ఇచ్చింది. అమ్మకు తన బిడ్డలంటే ఎంతో వాత్సల్యం. అంతటి వాత్సల్యమూర్తి అయిన అమ్మ కూడా తన బిడ్డలు చెడ్డవారిగా తయారవడాన్ని, లోక కంటకులుగా మారడాన్ని సహించలేదు. వారిలోని దానవత్వాన్ని దునుమాడటానికి ఏమాత్రం వెనుకాడదు. ముందు మంచిగా చెబుతుంది. వినకపోతే ఆయుధాన్ని ధరిస్తుంది, బెదిరిస్తుంది. అప్పటికీ తీరు మార్చుకోక పోతే రౌద్రమూర్తిగా మారి సంహరిస్తుంది. వేల ఏళ్ల కిందట జరిగింది అదే. లోక కంటకులుగా మారిన దుష్టరాక్షసులను అమ్మ వెంటాడి, వేటాడి మరీ సంహరించింది. అందుకు ప్రతీకగా జరుపుకుంటున్న ఉత్సవాలే దసరా మహోత్సవాలు. ఈ సృష్టి యావత్తూ మంచి–చెడు శక్తులతో నిండి ఉంది. మానవాళిని పీడించే చెడు శక్తులను లోకరక్షణ చేసే దైవశక్తులు నిర్మూలిస్తాయి. అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు అమ్మ నుంచే లభిస్తాయి. అయితే తాను అందించిన శక్తి సరిపోకపోతే తానే శక్తి స్వరూపిణిగా మారి, దానవత్వాన్ని దునుమాడుతుంది. ఉగ్రరూపిణిగా ఉన్న అమ్మను ప్రసన్నం చేసుకునేందుకు బిడ్డలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. గడ్డం పట్టుకుని బతిమాలుతారు. అప్పటికీ దిగిరాకపోతే పాదాల మీద పడి పూజిస్తారు. అమ్మకు ఇష్టమైనవన్నీ ఆమె పాదాల ముందు ఉంచి అమ్మ ప్రేమను, అనుగ్రహాన్ని అందుకుంటారు. ‘అమ్మ’ అనే శబ్దం తరతమ భేదాలతో దాదాపు అన్ని భాషల్లోనూ గొప్పగా ధ్వనిస్తుంది. బిడ్డలోని లోపాలను పట్టించుకోకుండా అక్కున చేర్చుకునే అమృతమూర్తి అమ్మ. లోకంలో తమ బిడ్డలను ఎంతో ప్రేమగా చూస్తారు తల్లులు. అయితే, తల్లి లేని వారిక్కూడా జగజ్జనని ఆ ప్రేమను అందిస్తుంది. అమ్మవారిది దివ్యానుగ్రహం. అది అందుకోగలిగిన వారిదే అదృష్టం. భారతీయుల గొప్పదనం తల్లిని దేవతగా ఆరాధించడం. తల్లి ఆరాధన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా జరగడం సర్వసాధారణం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జగన్మాతను ‘బతుకమ్మ’ పేరుతో ఆరాధిస్తారు. బతుకమ్మ పండుగను చాలా శ్రద్ధాసక్తులతో నిర్వహించుకుంటారు. ఈ వేడుకల్లో మహిళల పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది. బతుకమ్మ పండుగలో ఆటపాటలతోపాటు నైవేద్యాలది కూడా పెద్దపీట. ఆ అలంకరణలలోని ఆంతర్యం మాయావులైన రాక్షసులు అమ్మవారి కళ్లు కప్పేటందుకు రకరకాల వేషాలు వేశారు. వారి ఆట కట్టించేందుకు అమ్మవారు కూడా రోజుకో వేషం ధరించి తొమ్మిది రోజులు– రేయింబవళ్లూ మహాసంగ్రామం చేసింది. అందుకు ప్రతీకగానే నేటికీ భక్తులు అమ్మవారిని తొమ్మిది రోజులు ప్రత్యేక శ్రద్ధాసక్తులతో రోజుకో రూపంలో అలంకరించి, భక్తిశ్రద్ధలతో పూజించుకుని పరవశిస్తారు. పదోరోజున విజయోత్సాహ వేడుకలు జరుపుకుంటారు. విశిష్ట ఆరాధకులు తొమ్మిది మంది బాలికలను పూజించి, నూతన వస్త్రాలు సమర్పిస్తారు. పూజలు, ఆరాధనలు జరుగుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కోల్కతా, కర్ణాటక వంటి ప్రదేశాల్లో దసరా మహోత్సవాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మైసూరు కూడా దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి. ఏమిటీ దసరా? ‘దశహరా’అనే సంస్కృత పదం వికృత రూపంలోకి మారి ‘దసరా’ అయ్యింది. దశహరా అంటే పది జన్మల పాపాలను, పదిరకాలైన పాపాలను పోగొట్టేది అని అర్థం. దుర్గాదేవి కూడా తన భక్తుల జన్మజన్మల పాపాలను తొలగిస్తుంది కాబట్టి ఈ దేవిని స్మరిస్తూ చేసే ఉత్సవాలు దసరా ఉత్సవాలయ్యాయి. ఇక శబ్దార్థపరంగా చూస్తే ‘ద’ అంటే దానవులను, ‘సరా’ అంటే దూరం చేయునది–రాక్షసులను సంహరించి, ప్రజలకు సుఖశాంతులు అందించింది కాబట్టి ఆ ఆనందంతో దసరా వేడుకలు జరుపుకుంటున్నాం. నవరాత్రి వైశిష్ట్యం దసరా ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. అందుకనే వీటిని నవరాత్రులు అంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవ కాలమే నవరాత్రులు. నవరాత్ర వ్రతం ద్వారా తనను ఆరాధించిన వారిని దుర్గాదేవి అనుగ్రహిస్తుంది. రాత్రి శబ్దానికి పరమేశ్వరి అని, నవ అనే శబ్దానికి పరమేశ్వరుడనే అర్థాలు ఉన్నాయి. ఈ ప్రకారం చూస్తే పార్వతీపరమేశ్వరుల ఆరాధనమే నవరాత్ర వ్రతం. నవదుర్గా అవతార రహస్యాలు నవరాత్రి ఉత్సవాల్లో అందరినీ సమ్మోహితులను చేసే అంశం – అమ్మ వారి అలంకారాలు. రాక్షస సంహార క్రమంలో దుర్గాదేవి ధరించిన రూపాలకు ప్రతిగా రోజుకు ఒక్క అలంకారం చొప్పున నవరాత్రులు జరిగే రోజుల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అసుర సంహారం చేసి సాధించిన విజయానికి చిహ్నంగా పదో రోజున విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటారు. మధుకైటభాది రాక్షస సంహారం కోసం అమ్మ ధరించిన ఈ రూపాలనే ‘నవదుర్గ’ రూపాలుగా దేవీ, మార్కండేయ, భవిష్య పురాణాలు చెబుతున్నాయి. దేవీ భాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిద అనేవి నవదుర్గా రూపాలు. ప్రతి అవతారానికి ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక, ఉపాసనా రహస్యాలు ఉన్నాయి. జమ్మి బంగారమే!(Jammi Chettu- Health Benefits) ఈ పండగ సమయంలో అన్నిటికన్న ముఖ్యమైంది ముళ్ళకంపలాంటి ... కొండవాలుల్లో పెరిగే శమీవృక్షపూజ. దానికి కారణం రామరావణ యుద్ధానికి ముందు రాముడు, అరణ్యవాసాన తమ ఆయుధాలను మూటకట్టి ఈ చెట్టుపై ఉంచి పాండవులు ఈ చెట్టును పూజించడం వలన ఇది విజయమిచ్చే పూజనీయ వృక్షమైంది. ఈ చెట్టుబెరడుతో చేసే కషాయం దగ్గు, ఉబ్బసం వ్యాధులను నిరోధించి ఆరోగ్యాన్ని తద్వారా శుభాల్నిస్తుంది. అధిక జీర్ణశక్తిని కలిగిస్తుంది. ఆరోగ్యానికి ఔషధంలా జమ్మి చెట్టు ఎలా పనిచేస్తుందో, ఈ చెట్టు గొప్పతనమేంటో తెలియచెప్పటానికి, తెలుసుకోవటానికి జమ్మి ఆకులను పెద్దలకిచ్చి వారికి పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకుంటారు పిల్లలు. జమ్మి ఆకును తెలంగాణ ప్రాంతంలో బంగారమని పిలుస్తారు. ఈ పండుగ నాడు పెద్దలకు, పూజ్యులకు, ఆత్మీయులకు ఈ జమ్మి బంగారాన్ని ఇచ్చి ఆశీస్సులు అందుకోవడం ఆనవాయితీ. దసరాకు ఇది మామూలే! దసరా రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్థులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటికి దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్థును మామూళ్ళు అడగటం, వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. కొత్తగా వివాహం జరిగిన ఆడపడచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికీ కూతురికీ తలంటు పోసి నూతనవస్త్రాలు, కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా అలవాటే. విజయాలకు కారకమైన దశమి విజయుడు (అర్జునుడు) విరాటరాజు కొలువులో ఉండి కౌరవ సేనలను ఓడించి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన రోజు కాబట్టి విజయ దశమి అయ్యింది. శ్రీరాముడు రావణ సంహారం చేసింది కూడా విజయ దశమినాడే. అందుకే ఈ దసరా పర్వదినాన రామ్లీలా ఆడటం ఆనవాయితీ. అదేవిధంగా షిరిడీ సాయిబాబా సమాధి చెందింది కూడా దసరా నాడే. నిజానికి దశ, హర అంటే పది చెడు లక్షణాలను తొలగించుకోవడం అని అర్థం. మనిషిలో పది దుర్గుణాలే అధర్మం వైçపు నడిపిస్తున్నాయి. ఆ చెడుగుణాలపై విజయం కోసమే దసరా పండుగ చేసుకుంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్య, స్వార్థ, అన్యాయ, అమానుష, అహంకారాది లక్షణాలు మనుషులను దారి తప్పిస్తాయి. చెడు పనులకు ప్రోత్సహిస్తాయి. అవి ఇతరులకు హానిచేస్తాయి. వీటిపై విజయం సాధించడం మన ప్రథమ కర్తవ్యం. అందుకు అవకాశం కలిగిస్తూ విజయదశమి వేడుకలు జరిపించుకుంటున్న జగజ్జననికి జయము... జయము... దసరా ఉత్సవాల్లో ఆఖరి రోజు విజయ దశమినాడు రాత్రి సమయంలో ఇంద్రకీలాద్రి అధిష్ఠాన దేవత శ్రీ కనకదుర్గాదేవి, మల్లేశ్వర స్వామి వార్లు కృష్ణానదిలో హంసవాహనంపై నదీవిహారం చేస్తారు. అమ్మవారి త్రిలోక సంచారానికి గుర్తుగా నదిలో మూడుసార్లు హంసవాహనాన్ని (తెప్పను) తిప్పుతారు. కన్నుల పండువగా సాగే ఈ తెప్పోత్సవంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. -డీవీఆర్ భాస్కర్ ఫొటోల సహకారం: షేక్ సుబాని, సాక్షి, ఇంద్రకీలాద్రి -
Kanaka Durga Temple: నేడు గాయత్రీదేవి అలంకారం
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో మూడోరోజు బుధవారం కనకదుర్గమ్మ.. గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలశక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది.. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు ఉండటంతో గాయత్రీదేవి త్రిమూర్త్యాంశగా వెలుగొందుతోంది. గాయత్రీదేవిని దర్శించుకుంటే ఆరోగ్యం, తేజస్సు, జ్ఞానం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇంద్రకీలాద్రిపై నేడు ►తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారి దర్శనం ►ఉదయం 5 గంటలకు ఖడ్గమాలార్చన ►ఉదయం 7 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన ►ఉదయం 9 గంటలకు ప్రత్యేక శ్రీచక్రనవార్చన ►ఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం ►ఉదయం 10 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన రెండో బ్యాచ్ ►సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారికి మహానివేదన, పంచహారతుల సేవ ►రాత్రి 11 గంటలకు అమ్మవారి దర్శనం నిలిపివేత మయూర వాహనంపై కొలువుదీరిన భ్రామరీ సమేత మల్లికార్జునుడు బ్రహ్మచారిణిగా భ్రమరాంబాదేవి శ్రీశైలం టెంపుల్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీశైల క్షేత్రంలో మంగళవారం భ్రమరాంబాదేవి.. బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి భ్రమరాంబాదేవి, మల్లికార్జునస్వామి మయూర వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. తొలుత ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించి ప్రధానాలయ రాజగోపురం నుంచి రథశాల వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 8 గంటల తర్వాత ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, అంకాలమ్మగుడి, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు వెళ్లి తిరిగి ఆలయ ప్రవేశం చేసింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామిఅమ్మవార్ల అలంకారమూర్తులను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు, ఈవో ఎస్.లవన్న, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. పూజలు చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి మహేశ్వరిగా రాజశ్యామల అమ్మవారు సింహాచలం: విశాఖ శ్రీశారదాపీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండోరోజు మంగళవారం శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు మహేశ్వరిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి విశేషంగా పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అంతకుముందు అమ్మవారి మూలవిరాట్కి స్వరూపానందేంద్ర సరస్వతి అభిషేకం చేశారు. దాదాపు 40 నిమిషాలు జరిగిన అభిషేకసేవలో భక్తులు అమ్మవారి నిజరూప దర్శనం చేసుకున్నారు. పీఠం ప్రాంగణంలో చండీహోమం, చతుర్వేదపారాయణ, దేవీ భాగవత పారాయణ నిర్వహించారు. శ్రీచక్రానికి నవావరణార్చన చేశారు. ఈ సందర్భంగా శంకర విజయం అనే అంశంపై ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ధూళిపాళ కృష్ణమూర్తి చేసిన ప్రవచనం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. సాయంత్రం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర చేతులమీదగా రాజశ్యామల అమ్మవారికి, చంద్రమౌళీశ్వరస్వామికి పీఠార్చన చేశారు. -
Vijayawada: బాలా త్రిపుర సుందరీదేవికి భక్తుల నీరాజనం
సాక్షి, విజయవాడ: దుర్గమ్మ కొండపై ‘శరన్నవ’ సంబరం కొనసాగుతోంది. ఒకవైపు భక్తుల కోలాహలం, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాల సందళ్లతో కృష్ణా తీరం పులకిస్తోంది. దసరా ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి విశేష అలంకారం, నిత్య పూజల అనంతరం ఆలయ అధికారులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. నాలుగు గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, చండీహోమం, శ్రీచక్రార్చనలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. ఉత్సవాల నేపథ్యంలో అనధికార వీఐపీల కట్టడికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ టి.కె. రాణా క్యూలైన్లను పలు మార్లు పరిశీలించి, దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. టికెట్లు లేకుండా దర్శనానికి ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించవద్దని ఆలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవ ఏర్పాట్లు అద్భుతం: స్పీకర్ తమ్మినేని అమ్మవారి దర్శనానికి విచ్చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాంనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఈవో భ్రమరాంబ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను బహూకరించారు. అనంతరం మీడియాతో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు. దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉత్సవాల ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేయడం అభినందనీయమన్నారు. అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్ దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తున్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లతో పాటు క్యూలైన్లు, టికెట్ల జారీ పక్రియను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. కొండపై టికెట్లు విక్రయిస్తున్న తీరును పరిశీలించడంతో పాటు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. టికెట్లు కొనుగోలు చేసేలా చూడాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉందని, రూ. 300, రూ.100 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఆయా క్యూలైన్ మార్గాలలోనే అమ్మవారి దర్శనానికి పంపాలన్నారు. మహా మండపం మీదుగా కొండపైకి ఎవరూ రాకుండా కట్టుదిట్టంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పాస్ లేకుండా కార్లను కొండపైకి ఎందుకు అనుమతిస్తున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్బంది లేకుండా దర్శనం: మంత్రి కొట్టు భక్తుల రద్దీ నేపథ్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. వినాయకుడి గుడి, రథం సెంటర్, టోల్గేట్, ఓం టర్నింగ్ వద్ద మంత్రి క్యూలైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. వినాయకుడి నుంచి కొండపైకి చేరుకునేందుకు 30 నిమిషాలు పడుతుందని పలువురు భక్తులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని టికెట్ల కౌంటర్లలో ఆన్లైన్ టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఫుట్ స్కానర్ ద్వారా భక్తుల సంఖ్యను నమోదు చేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించి, అందుకు తగిన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సోమవారం సుమారు 30 వేల మంది భక్తులు దర్శనానికి విచ్చేశారని, 60 వేల లడ్డూలను విక్రయించామన్నారు. ఈవో భ్రమరాంబ, స్పెషల్ ఆఫీసర్ రామచంద్రమోహన్ పాల్గొన్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి నయనమనోహరం నగరోత్సవం వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో భాగంగా ఆదిదంపతుల నగరోత్సవం నయనమనోహరంగా జరిగింది. గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులతో మల్లేశ్వరాలయం దిగువన ఉన్న మహామండపం సమీపంలో ప్రారంభమైన నగరోత్సవంలో అర్చకులు, వేదపండితులు, కళాకారులు, అధికారులు పాల్గొని సేవలందించారు. తొలుత ఈవో భ్రమరాంబ కొబ్బరికాయ కొట్టి నగరోత్సవాన్ని ప్రారంభించారు. పోలీసులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.