సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో మూడోరోజు బుధవారం కనకదుర్గమ్మ.. గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలశక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది.. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు ఉండటంతో గాయత్రీదేవి త్రిమూర్త్యాంశగా వెలుగొందుతోంది. గాయత్రీదేవిని దర్శించుకుంటే ఆరోగ్యం, తేజస్సు, జ్ఞానం కలుగుతాయని భక్తుల విశ్వాసం.
ఇంద్రకీలాద్రిపై నేడు
►తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారి దర్శనం
►ఉదయం 5 గంటలకు ఖడ్గమాలార్చన
►ఉదయం 7 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన
►ఉదయం 9 గంటలకు ప్రత్యేక శ్రీచక్రనవార్చన
►ఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం
►ఉదయం 10 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన రెండో బ్యాచ్
►సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారికి మహానివేదన, పంచహారతుల సేవ
►రాత్రి 11 గంటలకు అమ్మవారి దర్శనం నిలిపివేత
మయూర వాహనంపై కొలువుదీరిన భ్రామరీ సమేత మల్లికార్జునుడు
బ్రహ్మచారిణిగా భ్రమరాంబాదేవి
శ్రీశైలం టెంపుల్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీశైల క్షేత్రంలో మంగళవారం భ్రమరాంబాదేవి.. బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి భ్రమరాంబాదేవి, మల్లికార్జునస్వామి మయూర వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. తొలుత ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించి ప్రధానాలయ రాజగోపురం నుంచి రథశాల వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 8 గంటల తర్వాత ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, అంకాలమ్మగుడి, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు వెళ్లి తిరిగి ఆలయ ప్రవేశం చేసింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామిఅమ్మవార్ల అలంకారమూర్తులను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు, ఈవో ఎస్.లవన్న, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
పూజలు చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి
మహేశ్వరిగా రాజశ్యామల అమ్మవారు
సింహాచలం: విశాఖ శ్రీశారదాపీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండోరోజు మంగళవారం శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు మహేశ్వరిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి విశేషంగా పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అంతకుముందు అమ్మవారి మూలవిరాట్‌కి స్వరూపానందేంద్ర సరస్వతి అభిషేకం చేశారు. దాదాపు 40 నిమిషాలు జరిగిన అభిషేకసేవలో భక్తులు అమ్మవారి నిజరూప దర్శనం చేసుకున్నారు.
పీఠం ప్రాంగణంలో చండీహోమం, చతుర్వేదపారాయణ, దేవీ భాగవత పారాయణ నిర్వహించారు. శ్రీచక్రానికి నవావరణార్చన చేశారు. ఈ సందర్భంగా శంకర విజయం అనే అంశంపై ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ధూళిపాళ కృష్ణమూర్తి చేసిన ప్రవచనం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. సాయంత్రం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర చేతులమీదగా రాజశ్యామల అమ్మవారికి, చంద్రమౌళీశ్వరస్వామికి పీఠార్చన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment