Vijayawada: బాలా త్రిపుర సుందరీదేవికి భక్తుల నీరాజనం  | Bala Tripura Sundari Devi: Second Day Of Dasara Festival At Kanaga Durga Temple | Sakshi
Sakshi News home page

Vijayawada: బాలా త్రిపుర సుందరీదేవికి భక్తుల నీరాజనం 

Published Wed, Sep 28 2022 9:25 AM | Last Updated on Wed, Sep 28 2022 10:32 AM

Bala Tripura Sundari Devi: Second Day Of Dasara Festival At Kanaga Durga Temple - Sakshi

సాక్షి, విజయవాడ: దుర్గమ్మ కొండపై ‘శరన్నవ’ సంబరం కొనసాగుతోంది. ఒకవైపు భక్తుల కోలాహలం, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాల సందళ్లతో కృష్ణా తీరం పులకిస్తోంది. దసరా ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి విశేష అలంకారం, నిత్య పూజల అనంతరం ఆలయ అధికారులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. నాలుగు గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు.

స్పీకర్‌ తమ్మినేని సీతారాం దంపతులు, ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, వెస్ట్‌ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, చండీహోమం, శ్రీచక్రార్చనలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. ఉత్సవాల నేపథ్యంలో అనధికార వీఐపీల కట్టడికి ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు, సీపీ టి.కె. రాణా క్యూలైన్లను పలు మార్లు పరిశీలించి, దేవస్థాన ఇంజినీరింగ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. టికెట్లు లేకుండా దర్శనానికి ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించవద్దని ఆలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.  

ఉత్సవ ఏర్పాట్లు అద్భుతం: స్పీకర్‌ తమ్మినేని 
అమ్మవారి దర్శనానికి విచ్చేసిన స్పీకర్‌ తమ్మినేని సీతారాంనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఈవో భ్రమరాంబ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను బహూకరించారు. అనంతరం మీడియాతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడారు. దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉత్సవాల ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేయడం అభినందనీయమన్నారు.  

అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్‌ 
దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తున్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఢిల్లీరావు ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లతో పాటు క్యూలైన్లు, టికెట్ల జారీ పక్రియను కలెక్టర్‌ మంగళవారం పరిశీలించారు. కొండపై టికెట్లు విక్రయిస్తున్న తీరును పరిశీలించడంతో పాటు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. టికెట్లు కొనుగోలు చేసేలా చూడాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉందని, రూ. 300, రూ.100 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఆయా క్యూలైన్‌ మార్గాలలోనే అమ్మవారి దర్శనానికి పంపాలన్నారు. మహా మండపం మీదుగా కొండపైకి ఎవరూ రాకుండా కట్టుదిట్టంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పాస్‌ లేకుండా కార్లను కొండపైకి ఎందుకు అనుమతిస్తున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఇబ్బంది లేకుండా దర్శనం: మంత్రి కొట్టు
భక్తుల రద్దీ నేపథ్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. వినాయకుడి గుడి, రథం సెంటర్, టోల్‌గేట్, ఓం టర్నింగ్‌ వద్ద మంత్రి క్యూలైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. వినాయకుడి నుంచి కొండపైకి చేరుకునేందుకు 30 నిమిషాలు పడుతుందని పలువురు భక్తులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

అన్ని టికెట్ల కౌంటర్లలో ఆన్‌లైన్‌ టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఫుట్‌ స్కానర్‌ ద్వారా భక్తుల సంఖ్యను నమోదు చేస్తామన్నారు.  అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించి, అందుకు తగిన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సోమవారం సుమారు 30 వేల మంది భక్తులు దర్శనానికి విచ్చేశారని, 60 వేల లడ్డూలను విక్రయించామన్నారు. ఈవో భ్రమరాంబ, స్పెషల్‌ ఆఫీసర్‌ రామచంద్రమోహన్‌ పాల్గొన్నారు.  

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నయనమనోహరం నగరోత్సవం
వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో భాగంగా ఆదిదంపతుల నగరోత్సవం నయనమనోహరంగా జరిగింది. గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులతో మల్లేశ్వరాలయం దిగువన ఉన్న మహామండపం సమీపంలో ప్రారంభమైన నగరోత్సవంలో అర్చకులు, వేదపండితులు, కళాకారులు, అధికారులు పాల్గొని సేవలందించారు. తొలుత ఈవో భ్రమరాంబ కొబ్బరికాయ కొట్టి నగరోత్సవాన్ని ప్రారంభించారు. పోలీసులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement