మహమ్మారి కారణంగా పండగల సమయాలను కుటుంబసభ్యులు మరింత సన్నిహితంగా జరుపుకోవడం పెరిగింది. అందుకు తగినట్టుగా తక్కువ ఖర్చుతో ఎక్కువ కళ ఉట్టిపడేలా ఇంటి అలంకరణ పట్ల శ్రద్ధ తీసుకోవడమూ పెరిగింది. సాధారణ జీవనశైలి పట్ల సానుకూలంగా వ్యవహరించడం ఎలాగో అందరికీ అనుభవంలోకి వచ్చింది. అయినప్పటికీ ఈ కొత్త జీవనశైలిలో కొత్త ఉత్సాహాన్ని, హుషారును నింపడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. అతి అర్భాటాలకు పోకుండా ఆనందాల ప్యాకేజీతో ఇంటిని ఎలా అలంకరించాలో చూద్దాం..
కొత్త–పాతల సమతుల్యత
సంప్రదాయ వేడుకల సమయాల్లో ఇల్లు నిన్న–నేడులను సమతుల్యం చేసేదిగా ఉండాలి. నిన్నటి తరం హుందాతనం, నేటి తరపు ఆలోచనలను కళ్లకు కట్టినట్టుగా ఉండాలి. దూరంగా ఉన్నవారికి వీడియోలు, ఫొటోల ద్వారా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. ఇలాంటప్పుడు మీరు ఉన్న బ్యాక్‌గ్రౌండ్ అలంకరణ అంతే వేడుకగా ఉండాలి. అందుకు, ఇంటి లోపల ఏదైనా ఒక గోడ లేదా తలుపు భాగాన్ని పూలతో, దీప కాంతుల వెలుగులతో అలంకరించుకోవాలి.
అలంకరణలో శిల్పకళా స్పర్శ
మండపాలు, తోరణాలు పూజా అలంకరణలో ప్రధానంగా ఉంటాయి కాబట్టి పండగలు తమదైన సౌందర్యంతో వెలిగిపోతాయి. వాటికి జతగా మనవైన పసుపు, ఎరుపు ఇంద్రధనుస్సు రంగుల టేబుల్ క్లాత్‌లు, పాతవైన చెక్క, రాతి శిల్పాలు, సంప్రదాయ వాల్ ఆర్ట్, మనవైన అల్లికలు అలంకరణలో మరింత అందాన్ని తీసుకువస్తాయి.
మనదైన కళ
అలంకరణలో ఒక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. ఆ అభిరుచి తెలియజేసేలా స్టేట్‌మెంట్ యాక్సెసరీస్ పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఇండోర్ ప్లాంట్లు, రాగి, ఇత్తడి వంటి మెటాలిక్ వస్తువుల ఎంపిక, అలంకరణలో ఈ స్పష్టత సులువుగా తెలిసిపోతుంది.
ఫ్లవర్ పవర్
ఇత్తడి చెంబులు, బిందెలు వంటి నిన్నటి తరం వాడుకున్న వస్తువులను తాజా పూలతో అలంకరించి, ఒక చెక్క ట్రే లేదా టేబుల్ మీద ఉంచండి. ఈ అలంకరణ ఆ గది అందాన్ని రెట్టింపు చేస్తుంది. పూల మొక్కలతో అలంకరించాలనుకుంటే మిగతా ఫర్నిషింగ్ రంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అన్నీ గాఢమైన రంగులవి కాకుండా లేత రంగులు ఉండేలా ఎంపిక చేయాలి. మొత్తం పూలతో కాకుండా తీగలు, ఆకుల మేళవింపుతోనూ అందాన్ని తీసుకురావచ్చు.
సువాసనలతో నింపేయచ్చు
గంధం, మల్లె లేదా ఇతర సువాసనలు నింపేలా గదుల అలంకరణలో జాగ్రత్త తీసుకోవాలి. తాజా పువ్వులతో పాటు తమ ప్రత్యేకత తెలిసేలా లైటింగ్, ఫ్లోర్ ల్యాంప్స్, హ్యాంగింగ్ లైట్స్, సువాసన గల కొవ్వొత్తుల కలయికతోనూ ఇంటికి, కంటికీ కళను తీసుకురావచ్చు.
హస్తకళాకృతులు
గృహాలంకరణలో ఎన్ని ఖరీదైన వస్తువులను తెచ్చినా, మరెన్ని హంగులు అమర్చినా మన చేత్తో తయారుచేసిన కొన్ని వస్తువులనైనా అలంకరణలో ఉపయోగిస్తే ఆ ఆనందమే వేరు. ప్రమిదల కూర్పు, గంటల సంఖ్య, పువ్వుల మాలలు, చెక్క ఫ్రేమ్స్.. పండగల సౌందర్యాన్ని మరింతగా పెంచుతాయి.
శానిటైజింగ్ పాయింట్లు
మహమ్మారి కాలం కాబట్టి మనవైన జాగ్రత్తలు తప్పనిసరి అనేది ఇంటిల్లిపాదికి గుర్తుచేయాలి. అందుకు, శానిటైజర్లు, మాస్కులు ఉన్న సెటప్‌ను తప్పక ఓ వైపు చేసి ఉంచాలి. ఈ జాగ్రత్తలు మీకు మాత్రమే కాదు, మీ ఇంట్లో అందరి పట్ల తీసుకున్న శ్రద్ధ స్పష్టమవుతుంది.
ఇంటి అలంకరణతో పాటు పండగల వేళ మిమ్మల్ని మీరు అలంకరించుకుంటేనే సంబరం మరింత కళగా వెలిగిపోతుందనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు.
Comments
Please login to add a commentAdd a comment