Home Creations: మీ ఇంటి అందం మరింత పెంచే.. మది మెచ్చే.. సృజనాలంకరణ! | Home Creations With Recycled Materials | Sakshi
Sakshi News home page

మీ ఇంటి అందం మరింత పెంచే.. మది మెచ్చే.. సృజనాలంకరణ!

Published Sun, Oct 24 2021 1:23 PM | Last Updated on Sun, Oct 24 2021 2:09 PM

Home Creations With Recycled Materials - Sakshi

పొలంలో ఉన్న మంచె రూపం ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తే.. పాత టీ కెటిల్‌ పువ్వుల గుచ్ఛాన్ని అలంకరించుకుంటే, తోపుడు బండి కాస్తా మన ఇంటి టేబుల్‌ మీద ట్రే అయితే, తాగేసిన కొబ్బరిబోండాలు మొక్కలకు కుండీలు అయితే, ఇత్తడి జల్లెడ గోడ మీద సీనరీగా అమరితే.. ఎంత అందంగా ఉంటుందో.. కాదేదీ ఇంటి అలంకరణకు అనర్హం అన్నట్టు మీరూ ఇలా ఎన్నో రకాల ప్రయత్నించవచ్చు. 

వేలాడే కొబ్బరి బోండాం
తియ్యని కొబ్బరినీళ్లు తాగేస్తాం. లేత కొబ్బరి తినేస్తాం. ఆ తర్వాత ఆ బోండాన్ని పడేస్తాం. ఈసారి మాత్రం అలా పడేయకుండా కొంచెం థింక్‌ చేయండి. పెయింట్‌ బ్రష్, నచ్చిన పెయింట్‌ తీసుకొని రంగులు అద్దేయండి. ఆ తర్వాత ఇండోర్‌ మొక్కలను పెంచేయండి. వాటిని తాళ్లతో హ్యాంగ్‌ చేయండి. ఈ ఐడియాకు ఇంకెంచెం పదును పెడితే మరెన్నో కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకురావచ్చు. మరిన్ని అలంకరణ వస్తువులు తయారుచేయవచ్చు. 

ఇంట్లో కుదిరిన మంచె
పొలంలో ఉండాల్సింది ఇంట్లో ఎలా ఉంటుందనే నెగిటివ్‌ ఆలోచనలకు స్వస్తిచెప్పచ్చు ఇక. దీని తయారీని ఓ విదేశీ కంపెనీ చేపట్టింది. మన మంచె విదేశీయుల ఇంట్లో ఉంటే, మనమెందుకు ఊరుకుంటాం. ఇంకొచెం కొత్తగా ఆలోచించి వెదురుతో అందమైన విశ్రాంతి తీసుకునే మంచెను తయారుచేయించుకొని ఇంట్లో అలంకరించుకుంటాం. అతిథుల మనసు ఇట్టే మంచెకు కట్టిపడేయచ్చు. ఇంటికే వినూత్న కళ తీసుకురావచ్చు. బాల్కనీ లేదా డాబా గార్డెన్‌ వంటి చోట ఈ మంచె ఐడియా సూపర్బ్‌గా సెట్‌ అవుతుంది.

టేబుల్‌ మీద తోపుడి బండి 
టీపాయ్, టేబుల్‌ వంటి వాటి మీద అలంకరణకు ఓ ఫ్లవర్‌వేజ్‌ను ఉంచుతారు. కానీ, తోపుడు బండిని ఉంచితే.. అదేనండి, తోపుడుబండి స్టైల్‌ షో పీస్‌ అన్నమాట. దీని మీద మరికొన్ని అలంకరణ వస్తువులు కూడా పెట్టచ్చు. చూడటానికి ప్రత్యేకంగా ఉంటుంది. రోజువారీగా వాడుకునే ట్రేగానూ ఈ బుజ్జి తోపుడుబండిని ఉపయోగించవచ్చు. ఇవి ఆన్‌లైన్‌ మార్కెట్లోనూ దర్శనమిస్తున్నాయి. ఆసక్తి ఉంటే ప్రత్యేకంగానూ తయారుచేయించుకోవచ్చు. ఓపిక ఉంటే, చెక్క, కొన్ని ఇనుప రేకులను వాడి  ఈ మోడల్‌ పీస్‌ను స్వయంగా తయారుచేసుకోవచ్చు. 

గోడ మీద ఇత్తడి జల్లెడ
ధాన్యాన్ని జల్లెడ పట్టడం గురించి మనకు తెలిసిందే. ఇప్పుడంటే ప్లాస్టిక్, అల్యూమినియం జల్లెడలను వాడుతున్నారు కానీ మన పెద్దలు వెదురుతో చేసినవి లేదా ఇనుము, ఇత్తడి లోహాల పెద్ద పెద్ద జల్లెడలను వాడేవారు. ఉపయోగించడం పూర్తయ్యాక గోడకు కొట్టిన మేకుకు తగిలించేవారు. గొప్పగా ఉండే ఆ పనితనాన్ని ఎక్కడో మూలన పెడితే ఎలా అనుకున్నవారు ఇలా ఇంటి గోడకు బుద్ధుడి బొమ్మతో అలంకరించి, అందంగా మార్చేశారు. ఇంటికీ వింటేజ్‌ అలంకరణగా ఉండే ఈ స్టైల్‌ను మీరూ ఫాలో అవ్వచ్చు. 

మొక్కలను నింపుకున్న టీ కెటిల్‌ 
నేటి తరానికి ప్లాస్క్‌లు బాగా తెలుసు కానీ, టీ కెటిల్‌ గురించి అంతగా తెలియదు. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌గా భావించే నిన్నటి తరం వస్తువులను ఇలా అందమైన గృహాలంకరణగా అమర్చుకోవచ్చు. పువ్వులతోనూ, ఇండోర్‌ ప్లాంట్స్‌ తోనూ, ఆర్షిఫియల్‌ ప్లాంట్స్‌తోనూ పాత టీ కెటిల్‌ను కొత్తగా అలంకరించవచ్చు. 

చదవండి: మీకు ఎడమచేతివాటం ఉందా?.. ఇవి తప్పక తెలుసుకోండి.!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement