Indoor plants
-
ఇంట్లోని గాలిని సహజంగా శుద్ధి చేసే ఈ మొక్కలు చూశారా? (ఫొటోలు)
-
తక్కువ ఖర్చుతో ఇండోర్ గార్డెనింగ్: ఈ విషయాలు తెలుసుకోండి!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత కాలంలో మన కలలకు ప్రతిరూపమైన స్వీట్హోంను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, ఇంటిని అందంగా, ఆరోగ్యంగా తీర్చుకోవడం కూడా ఒక కళ అవసరం కూడా. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాతి నుంచి ఇంట్లో స్వచ్చమైన గాలి కోసం మొక్కలను పెంచడం పెరిగి పోయింది. దీంతో దుర్వాసనకు దూరంగా ఉండటంతో పాటు అందం, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. హోమ్ గార్డెనింగ్ మొక్కల ప్రత్యేకత ఏంటంటే.. వీటికయ్యే వ్యయం చాలా తక్కువ. నిర్వహణ కూడా తేలికే. పైగా అందంగా, అద్భుతమైన డిజైన్లతో అలంకారప్రాయంగానూ ఉంటాయి. (హైదరాబాద్‌లో గృహ విక్రయాలు జూమ్, ఏకంగా 130 శాతం జంప్) ఇండోర్ గార్డెనింగ్ మీద ఆసక్తి ఉన్న వాళ్ల తొలి ప్రాధాన్యం స్నేక్ ప్లాంట్ మొక్కే. తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా ఇది బాగా పెరుగుతుంది. దీని నిర్వహణ అత్యంత సులువు. చాలా తక్కువ నీటి అవసరం ఉంటుంది. చీకటి ప్రదేశంలో, గది మూలల్లోనూ ఇది పెరుగుతుంది. తక్కువ కాంతిలో ఈ మొక్కను ఉంచినప్పటికీ.. స్వచ్చమైన ఆక్సిజన్‌ను ఇస్తుంది. ఇది నిలువుగా పెరుగుతుంది. (యాపిల్ గుడ్‌న్యూస్: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు!) మధ్యస్థ స్థాయిలో సూర్యరశ్మి లేదా పరోక్ష పద్ధతిలో సూర్యకాంతిలోనూ పెరగడం రబ్బర్ ప్లాంట్ ప్రత్యేకత. దీనికి ఆకులు పెద్ద సైజ్‌లో ఉంటాయి. అందువల్ల గాలి నుంచి వచ్చే వ్యర్థాలు, దుమ్ము, ధూళి కణాలను చాలా సులువుగా గ్రహిస్తాయి. ఈ మొక్క ఆకులను తరుచుగా శుభ్రం చేస్తుండాలి. ప్రతి రోజూ ఒకే సమయంలో ఒకే పరిమాణంలో నీటిని పోయాలి లేకపోతే ఆకులు రాలిపోయే ప్రమాదం ఉంది. గార్డెనింగ్ ఔత్సాహికులు, అనుభవజ్ఞులకు మనీ ప్లాంట్ సరైన మొక్క. నిర్వహణ కోసం పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు. అంత త్వరగా ఎండిపోదు. ఇంటి గాలిలోని బెంజెన్లు, ఫార్మాల్డిహైడ్ వంటి విష రసాయనాలను మనీ ప్లాంట్ గ్రహిస్తుంది. వీటిని కుండీల్లో, బుట్టల్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు లేదా నీటి గిన్నెలలో కూడా పెంచుకోవచ్చు. ఇవి నిలువుగా పెరుగుతుంటాయి. ఇంటి లోపల, ఆరుబయట, ప్రవేశ ద్వారం వద్ద వీటిని ఉంచుకోవచ్చు. ఏ మొక్కకైనా సరే అతిగా నీళ్లు పోయకూడదు. ఎంత పరిమాణంలో నీటిని పోయాలో తెలుసుకోవాలంటే అది ఉండే మట్టిని పరిశీలించాలి. కాలుష్య కారకాలను తొలగించడం, కార్బన్ మోనాక్సైడ్, ఆమ్మోనియా ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరెథైలీన్లను పీల్చుకోవటంలో, ఇండోర్‌లోని గాలిని శుభ్రం చేయడంలో పీస్ లిల్లీలు అద్భుతంగా పనిచేస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఇది పుష్పించే మొక్క కాదు. ఇది ఉష్ణమండల ప్రాంతాల నుంచి వస్తుంది. ఇది పెరగాలంటే నేల, తేమ అవసరం. దీనికి తరుచుగా నీళ్లు పోస్తుండాలి. ఆకులు పడిపోతున్నాయంటే దీనికి నీటి అవసరం ఉందన్న విషయం మీరు గ్రహించాలి. ఈ మొక్కలు ఆకుపచ్చ, ఎరుపు రంగులతో పాటు అనేక రకాలుగా వస్తాయి. చైనీస్ ఎవర్గ్రీన్ లేదా ఆగ్లోనెమాస్ బహుముఖ ప్రయోజనాలు ఉండే మొక్కలు. వీటి నిర్వహణ సులువ. అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. వీటిని ఇంటీరియర్ డిజైనింగ్‌లో అలంకారప్రాయంగాను వినియోగించుకోవచ్చు. అధిక స్థాయిలో ఆక్సిజన్‌ను విడుదల చేయడంతో పాటు హానికారక రసాయనాలను పీల్చుకుంటాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా, ఇంట్లో ఎక్కడైనా ఈ మొక్కలు పెరుగుతాయి. -
Home Creations: మీ ఇంటి అందం మరింత పెంచే.. మది మెచ్చే.. సృజనాలంకరణ!
పొలంలో ఉన్న మంచె రూపం ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తే.. పాత టీ కెటిల్ పువ్వుల గుచ్ఛాన్ని అలంకరించుకుంటే, తోపుడు బండి కాస్తా మన ఇంటి టేబుల్ మీద ట్రే అయితే, తాగేసిన కొబ్బరిబోండాలు మొక్కలకు కుండీలు అయితే, ఇత్తడి జల్లెడ గోడ మీద సీనరీగా అమరితే.. ఎంత అందంగా ఉంటుందో.. కాదేదీ ఇంటి అలంకరణకు అనర్హం అన్నట్టు మీరూ ఇలా ఎన్నో రకాల ప్రయత్నించవచ్చు. వేలాడే కొబ్బరి బోండాం తియ్యని కొబ్బరినీళ్లు తాగేస్తాం. లేత కొబ్బరి తినేస్తాం. ఆ తర్వాత ఆ బోండాన్ని పడేస్తాం. ఈసారి మాత్రం అలా పడేయకుండా కొంచెం థింక్ చేయండి. పెయింట్ బ్రష్, నచ్చిన పెయింట్ తీసుకొని రంగులు అద్దేయండి. ఆ తర్వాత ఇండోర్ మొక్కలను పెంచేయండి. వాటిని తాళ్లతో హ్యాంగ్ చేయండి. ఈ ఐడియాకు ఇంకెంచెం పదును పెడితే మరెన్నో కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకురావచ్చు. మరిన్ని అలంకరణ వస్తువులు తయారుచేయవచ్చు. ఇంట్లో కుదిరిన మంచె పొలంలో ఉండాల్సింది ఇంట్లో ఎలా ఉంటుందనే నెగిటివ్ ఆలోచనలకు స్వస్తిచెప్పచ్చు ఇక. దీని తయారీని ఓ విదేశీ కంపెనీ చేపట్టింది. మన మంచె విదేశీయుల ఇంట్లో ఉంటే, మనమెందుకు ఊరుకుంటాం. ఇంకొచెం కొత్తగా ఆలోచించి వెదురుతో అందమైన విశ్రాంతి తీసుకునే మంచెను తయారుచేయించుకొని ఇంట్లో అలంకరించుకుంటాం. అతిథుల మనసు ఇట్టే మంచెకు కట్టిపడేయచ్చు. ఇంటికే వినూత్న కళ తీసుకురావచ్చు. బాల్కనీ లేదా డాబా గార్డెన్ వంటి చోట ఈ మంచె ఐడియా సూపర్బ్‌గా సెట్ అవుతుంది. టేబుల్ మీద తోపుడి బండి టీపాయ్, టేబుల్ వంటి వాటి మీద అలంకరణకు ఓ ఫ్లవర్‌వేజ్‌ను ఉంచుతారు. కానీ, తోపుడు బండిని ఉంచితే.. అదేనండి, తోపుడుబండి స్టైల్ షో పీస్ అన్నమాట. దీని మీద మరికొన్ని అలంకరణ వస్తువులు కూడా పెట్టచ్చు. చూడటానికి ప్రత్యేకంగా ఉంటుంది. రోజువారీగా వాడుకునే ట్రేగానూ ఈ బుజ్జి తోపుడుబండిని ఉపయోగించవచ్చు. ఇవి ఆన్లైన్ మార్కెట్లోనూ దర్శనమిస్తున్నాయి. ఆసక్తి ఉంటే ప్రత్యేకంగానూ తయారుచేయించుకోవచ్చు. ఓపిక ఉంటే, చెక్క, కొన్ని ఇనుప రేకులను వాడి ఈ మోడల్ పీస్‌ను స్వయంగా తయారుచేసుకోవచ్చు. గోడ మీద ఇత్తడి జల్లెడ ధాన్యాన్ని జల్లెడ పట్టడం గురించి మనకు తెలిసిందే. ఇప్పుడంటే ప్లాస్టిక్, అల్యూమినియం జల్లెడలను వాడుతున్నారు కానీ మన పెద్దలు వెదురుతో చేసినవి లేదా ఇనుము, ఇత్తడి లోహాల పెద్ద పెద్ద జల్లెడలను వాడేవారు. ఉపయోగించడం పూర్తయ్యాక గోడకు కొట్టిన మేకుకు తగిలించేవారు. గొప్పగా ఉండే ఆ పనితనాన్ని ఎక్కడో మూలన పెడితే ఎలా అనుకున్నవారు ఇలా ఇంటి గోడకు బుద్ధుడి బొమ్మతో అలంకరించి, అందంగా మార్చేశారు. ఇంటికీ వింటేజ్ అలంకరణగా ఉండే ఈ స్టైల్‌ను మీరూ ఫాలో అవ్వచ్చు. మొక్కలను నింపుకున్న టీ కెటిల్ నేటి తరానికి ప్లాస్క్‌లు బాగా తెలుసు కానీ, టీ కెటిల్ గురించి అంతగా తెలియదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్‌గా భావించే నిన్నటి తరం వస్తువులను ఇలా అందమైన గృహాలంకరణగా అమర్చుకోవచ్చు. పువ్వులతోనూ, ఇండోర్ ప్లాంట్స్ తోనూ, ఆర్షిఫియల్ ప్లాంట్స్తోనూ పాత టీ కెటిల్‌ను కొత్తగా అలంకరించవచ్చు. చదవండి: మీకు ఎడమచేతివాటం ఉందా?.. ఇవి తప్పక తెలుసుకోండి.! -
వేసవిలో మొక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే...
వేసవిలో మొక్కలను చాలా జాగ్రత్తగా కంటిపాపలా చూసుకోవాలి. కొన్ని మొక్కలు వేసవిలోనే బాగా పెరుగుతాయి. ఆకులు రాలి, కొత్తగా చిగురుస్తాయి, మరికొన్ని మొక్కలు ఎండిపోతాయి. అయితే ఎక్కువ కాలం ఉండే మొక్కలు పెరగడానికి వేసవికాలం అనువుగా ఉంటుంది. అందువల్ల వేసవిలో పెరిగే మొక్కల గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పెంచుకొనే మొక్కలు వేసవిలో వడిలిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. వీటిని సూర్యరశ్మి నేరుగా తగలని ప్రాంతాలలో ఉంచాలి. బాగా ఎండలు మొదలు కాకుండా అంటే మార్చి, ఏప్రిల్ మాసాలలో మొక్కలను ట్రిమ్ చేయాలి. ఎండిన ఆకులు, కొమ్మలను తీసేయాలి. మొక్కలకు నీళ్లు ఎంత అవసరం అన్న సంగతి కుండీలోని మట్టిని తాకగానే తెలిసిపోతుంది. తాకగానే ఎండినట్లు అనిపిస్తే వెంటనే నీళ్లు పోయాలని అర్థం. నెలకి ఒకసారి ఏదైనా ఎరువుల రసాయనాన్ని నీళ్లలో కలిపి తగు మోతాదులో మొక్కలకు పోయాలి. అలా చేయటం వల్ల మొక్కలు ఆరోగ్యంగా, పచ్చగా కనిపిస్తాయి. అలాగని మోతాదు పెరిగితే మాత్రం మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. మొక్కలు పెద్దవయ్యేకొద్దీ వేళ్లు విస్తరిస్తుంటాయి. కాబట్టి మొక్కల సైజును బట్టి చిన్న కుండీలో ఉన్న మొక్కలను పెద్ద కుండీలలోకి మార్పు చేయటానికి ఇది అనువైన కాలం. ఇండోర్ మొక్కలను సూర్యరశ్మి నేరుగా పడకుండా చూసుకోవాలి. గదిలో ఉండే ఉష్ణోగ్రత సరిపోతుంది. ఈ మొక్కలకు చెదలు పట్టవు. పురుగుల బెడద కూడా ఉండదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా రెండు చుక్కల వేప నూనెను నీళ్లలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయటం మంచిది. ఇలా చేయటం వల్ల మట్టి నుంచి సంక్రమించే తెగుళ్లు రాకుండా నివారించుకోవచ్చు. మొక్కలను ఎప్పుడూ ఒకేచోట ఉంచకూడదు. ఒకటి లేదా రెండు వారాలకు ఒకసారి స్థలం మారుస్తూ ఉండాలి. -
ఇంటింటికీ మొక్కలు
సాక్షి, హైదరాబాద్: తులసి, కరివేపాకు, కలబంద, బంతి, చామంతి, క్రోటన్స్, మందార, ఫౌంటెన్ గ్రాస్, సైకస్, ఫైకస్, గన్నేరు, జామ.. ఇలా ఇళ్లలో పెంచుకునే మొక్కలు ఈసారి హరితహారం కార్యక్రమంలో పంపిణీకి సిద్ధమయ్యాయి. నగర వ్యాప్తంగా బుధవారం హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. గత సంవత్సరం రహదారుల వెంట.. ఖాళీ స్థలాల్లో.. నీడనిచ్చే వృక్షాల మొక్కలను అధిక సంఖ్యలో నాటినప్పటికీ, వాటిని సంరక్షించే వారు కరువైన నేపథ్యంలో ఈసారి ఇళ్లలో పెంచే మొక్కలకే అధిక ప్రాధాన్యతనిచ్చారు. గ్రేటర్‌లోని కోటి మొక్కల్లో 93.72 లక్షల మొక్కలు ఇళ్లకే పంపిణీ చేసేందుకు నిర్ణయించిన జీహెచ్ఎంసీ అందుకు అనుగుణంగా ఇళ్లలో పెంచే మొక్కలనే భారీ సంఖ్యలో అందుబాటులో ఉంచింది. ఎవరింట్లో మొక్కను వారు శ్రద్ధగా కాపాడతారనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకుంది. మొక్కల పంపిణీకి అన్ని డివిజన్లలో ముఖ్య ప్రదేశాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కోరిన వారందరికీ లేదనకుండా మొక్కలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతిఇంట్లో మొక్కలు నాటాలనేదే లక్ష్యమన్నారు. మొక్కలు ఇచ్చిన వారి పేర్లు, ఆధార్ వివరాలు కూడా సేకరించనున్నట్లు తెలిపారు. తద్వారా మొక్కలు దుబారా కాకుండా ఉంటాయన్నారు. గోడలపై పెరిగే గ్రీన్కర్టెన్స్కు కూడా ఈసారి ప్రాధాన్యమిచ్చారు. తొలిరోజే 1.99 లక్షల మొక్కలు .. హరితహారం ప్రారంభం రోజునే గ్రేటర్‌లోని 141 ప్రధాన ప్రాంతాల్లో 1,95,700 లక్షల మొక్కలు నాటడంతోపాటు పలువురికి ఉచితంగా పంపిణీ చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. పలు స్వచ్చంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలు, యువజన సంఘాలు, జీహెచ్ఎంసీ వార్డు కమిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. పలు కాలనీలలో నాటిన మొక్కల పరిరక్షణకు ట్రీగార్డ్‌లను స్వచ్ఛందంగా అందజేశారని పేర్కొన్నారు. దేశమంతా 50 కోట్ల మొక్కలు.. ఒక్క రాష్ట్రంలోనే 47 కోట్లు: కేటీఆర్ నగరంలోని వెస్ట్‌జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో మొక్కలు నాటిన మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ.. దేశంలోని 28 రాష్ట్రాల్లో వెరసి 50 కోట్ల మొక్కలు నాటుతుండగా, ఒక్క తెలంగాణలోనే ఈ సంవత్సరం 47 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పచ్చదనం శాతాన్ని పెంపొందించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్ నగరంలో ఎస్సార్ఎస్పీ ప్రాజెక్టులో భాగంగా ఆయా ప్రాంతాల్లో తొలగించే చెట్టను వేరే ప్రాంతాల్లో తిరిగి ట్రాన్స్‌లొకేట్ చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
నెలకు ఒకసారే మొక్కలకు నీళ్లు!
న్యూఢిల్లీ: ఇంట్లో మొక్కల పెంపకం పట్ల మక్కువ ఎక్కువగానే ఉన్నా.. ఎప్పటికప్పుడు మట్టి తొలుస్తూ నీటిని పోస్తూ, అవసరమైనప్పుడు ఎరువులు చల్లుతూ చాకిరీ చేయాలా ? అంటూ వళ్లు విరుచుకునే బద్దకస్తుల కోసం మంచి జెల్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. శ్రమ పడకుండానే ఇండోర్ ప్లాంట్లను ఏపుగా పెంచేందుకు తోడ్పడే అద్భుతమైన ఓ జెల్‌ను కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ కింద పని చేస్తున్న విఠల్ మాల్యా సైంటిఫిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ‘ఈకో వండర్ జెల్’ను సృష్టించింది. పర్యావరణ పరిస్థితులను పరిరక్షిస్తూ ఇండోర్ ఆర్నమెంటల్ ప్లాంట్లను మన ఇష్టమైన రీతిలో సృజనాత్మకంగా పెంచుకునేందుకు ఈ జెల్ తోడ్పడుతోందని, దీన్ని ఉపయోగిస్తే నెలకు ఒకసారి మాత్రమే తగినంత నీరు మొక్కలు పోయాల్సి వస్తుందని ఫౌండేషన్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ అనిల్ కుష్ తెలిపారు. ‘నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్’ స్ఫూర్తితో ప్రయోగాలు నిర్వహించి కనిపెట్టిన ఈ జెల్ మార్కెట్లో అన్ని రంగుల్లో లభిస్తుందని ఆయన తెలిపారు. మొక్కల పెంపకానికి అవసరమైన అన్ని పోషక విలువలు ఈ జెల్లో ఉన్నాయని, ఇవి నేరుగా మొక్కల వేర్లలోకి వెళ్లి అవి త్వరగా ఎదగడానికి తోడ్పడతాయని ఆయన వివరించారు. ఈ జెల్‌ను ఉపయోగించడం వల్ల మొక్కలకు తరచు నీళ్లు పోయాల్సిన అవసరం లేదని, ఎండాకాలంలో నెలకు ఒకసారి, ఇతర కాలాల్లో నెలన్నరకోసారి నీళ్లు పోస్తే సరిపోతుందని, మొక్కలను మనకు ఇష్టమైన ఆకృతిలో కత్తిరించుకోవచ్చని డాక్టర్ అనిల్ కుష్ తెలిపారు. -
గ్రీన్ ఇండోర్ (Green Indoor)
ఇపుడన్నీ ఇరుకిరుకు ఇళ్లే. ఫ్లాట్లు, మూడు, నాలుగు గదులున్న ఇళ్లు. అయితే మనసుండాలే కానీ ఇంట్లోనే పెరిగే ఇండోర్ ప్లాంట్స్‌కు ఇపుడు ఏ మాత్రం కొదవలేదని నిపుణులు చెప్తున్నారు. ఇండోర్ ప్లాంట్లలో వందల రకాల మొక్కలున్నాయి. రూ.150 మొదలుకుని రూ.1500 దాకా విభిన్న ధరల్లో ఉన్నాయి. ఎవరి ఇష్టాన్ని బట్టి, అభిరుచిని బట్టి వారు ఎంచుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్‌ను కొంచెం జాగ్రత్తగా ఎంచుకుంటే అటు పచ్చదనానికి మన వంతు సాయపడడం మాత్రమే కాదు... ఇటు మన పిల్లలకు అద్భుతమైన వ్యాపకాన్ని అలవాటు చేసినట్టూ అవుతుందని నగరంలోని లోతుకుంటలో నివసించే నర్సరీ నిపుణురాలు సునీత అంటున్నారు. ఇంట్లో పెంచేందుకు అవకాశం ఉన్న కొన్ని మొక్కల రకాలివి... అగ్లోనీమా: నీడపట్టున పెరిగే ఈ మొక్కకు సరిపడా నీటిని అందిస్తే చాలు. అందంగా, రంగు రంగుల ఆకులతో పెరిగే ఈ మొక్క ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది. రసీనా: గ్రీన్, రెడ్... ఇలా విభిన్న రకాల రంగుల్లో ఆకులు రావడం దీని ప్రత్యేకత. దీనికి ఏ మాత్రం ఎండ అవసరం లేదు. పీస్ లిల్లీ: పెద్ద పెద్ద తెల్లని పూరేకులకు మధ్యలో జొన్న కంకి తరహాలో చారతో అందాల పత్రంలా ఉంటుందీ ఇండోర్ ప్లాంట్. వాయువుల్ని నిర్మూలించడంలో, దుమ్ముధూళిని సంహరించడంలో ఉపకరిస్తుంది. స్పాతీఫిల్లమ్: నాటిన కొద్ది రోజులకే పాము పడగ శైలిలో తెల్లని ఆకులతో విస్తరిస్తుంది. మొక్కలన్నీ హానికారక వాయువుల్ని, దుమ్ము, ధూళిని సంహరించి స్వచ్ఛమైన వాతావరణానికి దోహదం చేసే విషయంలో స్పాతీ ఫిల్లమ్ అద్భుతమైన ప్రభావం చూపిస్తుంది. మనీ ప్లాంట్: చాలా మందికి పరిచయం ఉన్న మొక్క ఇది. తక్కువ వెలుతురుతో పెరిగే ఈ ఇండోర్ ప్లాంట్ రోజురోజుకూ తీగలా అల్లుకుంటూ పెరుగుతూ అందంగా గోడల మీదో, గుమ్మానికి నలువైపులానో కొలువుదీరుతుంది. - సత్యబాబు