సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత కాలంలో మన కలలకు ప్రతిరూపమైన స్వీట్‌హోంను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, ఇంటిని అందంగా, ఆరోగ్యంగా తీర్చుకోవడం కూడా ఒక కళ అవసరం కూడా. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాతి నుంచి ఇంట్లో స్వచ్చమైన గాలి కోసం మొక్కలను పెంచడం పెరిగి పోయింది. దీంతో దుర్వాసనకు దూరంగా ఉండటంతో పాటు అందం, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. హోమ్ గార్డెనింగ్ మొక్కల ప్రత్యేకత ఏంటంటే.. వీటికయ్యే వ్యయం చాలా తక్కువ. నిర్వహణ కూడా తేలికే. పైగా అందంగా, అద్భుతమైన డిజైన్లతో అలంకారప్రాయంగానూ ఉంటాయి. (హైదరాబాద్‌లో గృహ విక్రయాలు జూమ్, ఏకంగా 130 శాతం జంప్)
ఇండోర్ గార్డెనింగ్ మీద ఆసక్తి ఉన్న వాళ్ల తొలి ప్రాధాన్యం స్నేక్ ప్లాంట్ మొక్కే. తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా ఇది బాగా పెరుగుతుంది. దీని నిర్వహణ అత్యంత సులువు. చాలా తక్కువ నీటి అవసరం ఉంటుంది. చీకటి ప్రదేశంలో, గది మూలల్లోనూ ఇది పెరుగుతుంది. తక్కువ కాంతిలో ఈ మొక్కను ఉంచినప్పటికీ.. స్వచ్చమైన ఆక్సిజన్‌ను ఇస్తుంది. ఇది నిలువుగా పెరుగుతుంది. (యాపిల్ గుడ్‌న్యూస్: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు!)
మధ్యస్థ స్థాయిలో సూర్యరశ్మి లేదా పరోక్ష పద్ధతిలో సూర్యకాంతిలోనూ పెరగడం రబ్బర్ ప్లాంట్ ప్రత్యేకత. దీనికి ఆకులు పెద్ద సైజ్‌లో ఉంటాయి. అందువల్ల గాలి నుంచి వచ్చే వ్యర్థాలు, దుమ్ము, ధూళి కణాలను చాలా సులువుగా గ్రహిస్తాయి. ఈ మొక్క ఆకులను తరుచుగా శుభ్రం చేస్తుండాలి. ప్రతి రోజూ ఒకే సమయంలో ఒకే పరిమాణంలో నీటిని పోయాలి లేకపోతే ఆకులు రాలిపోయే ప్రమాదం ఉంది.
గార్డెనింగ్ ఔత్సాహికులు, అనుభవజ్ఞులకు మనీ ప్లాంట్ సరైన మొక్క. నిర్వహణ కోసం పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు. అంత త్వరగా ఎండిపోదు. ఇంటి గాలిలోని బెంజెన్లు, ఫార్మాల్డిహైడ్ వంటి విష రసాయనాలను మనీ ప్లాంట్ గ్రహిస్తుంది. వీటిని కుండీల్లో, బుట్టల్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు లేదా నీటి గిన్నెలలో కూడా పెంచుకోవచ్చు. ఇవి నిలువుగా పెరుగుతుంటాయి. ఇంటి లోపల, ఆరుబయట, ప్రవేశ ద్వారం వద్ద వీటిని ఉంచుకోవచ్చు. ఏ మొక్కకైనా సరే అతిగా నీళ్లు పోయకూడదు.
ఎంత పరిమాణంలో నీటిని పోయాలో తెలుసుకోవాలంటే అది ఉండే మట్టిని పరిశీలించాలి. కాలుష్య కారకాలను తొలగించడం, కార్బన్ మోనాక్సైడ్, ఆమ్మోనియా ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరెథైలీన్‌లను పీల్చుకోవటంలో, ఇండోర్‌లోని గాలిని శుభ్రం చేయడంలో పీస్ లిల్లీలు అద్భుతంగా పనిచేస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఇది పుష్పించే మొక్క కాదు. ఇది ఉష్ణమండల ప్రాంతాల నుంచి వస్తుంది. ఇది పెరగాలంటే నేల, తేమ అవసరం. దీనికి తరుచుగా నీళ్లు పోస్తుండాలి. ఆకులు పడిపోతున్నాయంటే దీనికి నీటి అవసరం ఉందన్న విషయం మీరు గ్రహించాలి.
ఈ మొక్కలు ఆకుపచ్చ, ఎరుపు రంగులతో పాటు అనేక రకాలుగా వస్తాయి. చైనీస్ ఎవర్‌గ్రీన్ లేదా ఆగ్లోనెమాస్ బహుముఖ ప్రయోజనాలు ఉండే మొక్కలు. వీటి నిర్వహణ సులువ. అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. వీటిని ఇంటీరియర్ డిజైనింగ్‌లో అలంకారప్రాయంగాను వినియోగించుకోవచ్చు. అధిక స్థాయిలో ఆక్సిజన్‌ను విడుదల చేయడంతో పాటు హానికారక రసాయనాలను పీల్చుకుంటాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా, ఇంట్లో ఎక్కడైనా ఈ మొక్కలు పెరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment