Money Plant
-
ఇచట చెట్లకు డబ్బులు కాయబడును!
ఈ వైరల్ వీడియోను చూసిన వాళ్లు ‘చెట్లకు డబ్బులు కాస్తాయా!’ అనే సామెతకు ‘భేషుగ్గా’ అని జవాబు చెప్పవచ్చు. 2.8 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ వీడియోలో రాయితో కొట్టి చెట్టు నుంచి ప్రజలు కాయిన్స్ తీసుకోవడం కనిపిస్తుంది. ‘సీయింగ్ ఈజ్ బిలీవింగ్’ అనే మాట నిజమేగానీ ‘ఇదెలా సాధ్యం?’ అనే ఒక ప్రశ్న మన ముందు నిటారుగా నిలబడుతుంది. ఇక అసలు విషయానికి వస్తే బిహార్‌లోని రాజ్‌గిర్ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్టు ఇది. ఈ చెట్టు బెరడు తీసి అందులో నాణెం పెడితే శుభం జరుగుతుందనే సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ పుణ్యమా అని చెట్టులో ఎటు చూసినా డబ్బులే డబ్బులు! అదృష్టం కోసం ఇంట్లో ‘మనీ ప్లాంట్’ పెట్టుకోవడం మనకు తెలిసిందే. ఈ వీడియోను చూసిన తరువాత మాత్రం ‘ఇదే అసలు సిసలు మనీప్లాంట్’ అంటున్నారు నెటిజనులు. -
తక్కువ ఖర్చుతో ఇండోర్ గార్డెనింగ్: ఈ విషయాలు తెలుసుకోండి!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత కాలంలో మన కలలకు ప్రతిరూపమైన స్వీట్హోంను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, ఇంటిని అందంగా, ఆరోగ్యంగా తీర్చుకోవడం కూడా ఒక కళ అవసరం కూడా. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాతి నుంచి ఇంట్లో స్వచ్చమైన గాలి కోసం మొక్కలను పెంచడం పెరిగి పోయింది. దీంతో దుర్వాసనకు దూరంగా ఉండటంతో పాటు అందం, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. హోమ్ గార్డెనింగ్ మొక్కల ప్రత్యేకత ఏంటంటే.. వీటికయ్యే వ్యయం చాలా తక్కువ. నిర్వహణ కూడా తేలికే. పైగా అందంగా, అద్భుతమైన డిజైన్లతో అలంకారప్రాయంగానూ ఉంటాయి. (హైదరాబాద్‌లో గృహ విక్రయాలు జూమ్, ఏకంగా 130 శాతం జంప్) ఇండోర్ గార్డెనింగ్ మీద ఆసక్తి ఉన్న వాళ్ల తొలి ప్రాధాన్యం స్నేక్ ప్లాంట్ మొక్కే. తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా ఇది బాగా పెరుగుతుంది. దీని నిర్వహణ అత్యంత సులువు. చాలా తక్కువ నీటి అవసరం ఉంటుంది. చీకటి ప్రదేశంలో, గది మూలల్లోనూ ఇది పెరుగుతుంది. తక్కువ కాంతిలో ఈ మొక్కను ఉంచినప్పటికీ.. స్వచ్చమైన ఆక్సిజన్‌ను ఇస్తుంది. ఇది నిలువుగా పెరుగుతుంది. (యాపిల్ గుడ్‌న్యూస్: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు!) మధ్యస్థ స్థాయిలో సూర్యరశ్మి లేదా పరోక్ష పద్ధతిలో సూర్యకాంతిలోనూ పెరగడం రబ్బర్ ప్లాంట్ ప్రత్యేకత. దీనికి ఆకులు పెద్ద సైజ్‌లో ఉంటాయి. అందువల్ల గాలి నుంచి వచ్చే వ్యర్థాలు, దుమ్ము, ధూళి కణాలను చాలా సులువుగా గ్రహిస్తాయి. ఈ మొక్క ఆకులను తరుచుగా శుభ్రం చేస్తుండాలి. ప్రతి రోజూ ఒకే సమయంలో ఒకే పరిమాణంలో నీటిని పోయాలి లేకపోతే ఆకులు రాలిపోయే ప్రమాదం ఉంది. గార్డెనింగ్ ఔత్సాహికులు, అనుభవజ్ఞులకు మనీ ప్లాంట్ సరైన మొక్క. నిర్వహణ కోసం పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు. అంత త్వరగా ఎండిపోదు. ఇంటి గాలిలోని బెంజెన్లు, ఫార్మాల్డిహైడ్ వంటి విష రసాయనాలను మనీ ప్లాంట్ గ్రహిస్తుంది. వీటిని కుండీల్లో, బుట్టల్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు లేదా నీటి గిన్నెలలో కూడా పెంచుకోవచ్చు. ఇవి నిలువుగా పెరుగుతుంటాయి. ఇంటి లోపల, ఆరుబయట, ప్రవేశ ద్వారం వద్ద వీటిని ఉంచుకోవచ్చు. ఏ మొక్కకైనా సరే అతిగా నీళ్లు పోయకూడదు. ఎంత పరిమాణంలో నీటిని పోయాలో తెలుసుకోవాలంటే అది ఉండే మట్టిని పరిశీలించాలి. కాలుష్య కారకాలను తొలగించడం, కార్బన్ మోనాక్సైడ్, ఆమ్మోనియా ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరెథైలీన్లను పీల్చుకోవటంలో, ఇండోర్‌లోని గాలిని శుభ్రం చేయడంలో పీస్ లిల్లీలు అద్భుతంగా పనిచేస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఇది పుష్పించే మొక్క కాదు. ఇది ఉష్ణమండల ప్రాంతాల నుంచి వస్తుంది. ఇది పెరగాలంటే నేల, తేమ అవసరం. దీనికి తరుచుగా నీళ్లు పోస్తుండాలి. ఆకులు పడిపోతున్నాయంటే దీనికి నీటి అవసరం ఉందన్న విషయం మీరు గ్రహించాలి. ఈ మొక్కలు ఆకుపచ్చ, ఎరుపు రంగులతో పాటు అనేక రకాలుగా వస్తాయి. చైనీస్ ఎవర్గ్రీన్ లేదా ఆగ్లోనెమాస్ బహుముఖ ప్రయోజనాలు ఉండే మొక్కలు. వీటి నిర్వహణ సులువ. అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. వీటిని ఇంటీరియర్ డిజైనింగ్‌లో అలంకారప్రాయంగాను వినియోగించుకోవచ్చు. అధిక స్థాయిలో ఆక్సిజన్‌ను విడుదల చేయడంతో పాటు హానికారక రసాయనాలను పీల్చుకుంటాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా, ఇంట్లో ఎక్కడైనా ఈ మొక్కలు పెరుగుతాయి. -
మా ఇంటి మనీ ప్లాంట్!
‘‘నాన్నా... కుండీలో మొక్క అయినా, అడవిలో చెట్టయినా అలా కదలిక లేకుండా ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. మొలకెత్తి అలా పెరుగుతూ ఉండటం తప్ప... పాపం.... దానికి మరో పనేమీ ఉండదు కదా. మొక్కలకు బోర్ కొట్టదా నాన్నా. వాటికి టైంపాస్ ఎలాగో ఏమిటో?’’ అంటూ జాలిపడ్డాడు మా బుజ్జిగాడు. నాకు ఆ ఆలోచన ఎప్పుడూ రాలేదు గానీ... వాడు చెప్పగానే ‘పాపం... నిజమే కదా’ అనిపించింది. సరిగ్గా మా బుజ్జిగాడు పై మాటలు చెబుతున్న టైమ్‌లోనే ఇంట్లోకి ఎంటరయ్యాడు మా రాంబాబుగాడు. వాడి మాటలు తానూ విన్నాడు. ‘‘ఒరేయ్ బుజ్జిగా... చెట్లూ, మొక్కలూ అలా నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తాయిగానీ... మనుషులు చేసే పనులు చాలా చేస్తుంటాయవి. అంతెందుకు పొద్దున్నే వాకింగ్ చేయడం, బిజినెస్సులు చేయడం, ప్రలోభ పెట్టడం, మోసాలు చేయడం లాంటి ఎన్నో పనులు చేస్తాయవి. ఈ విషయాలేమీ మీ నాన్నకే తెలియదు. ఇంక నీకేం చెబుతాడు?’’ అన్నాడు రాంబాబుగాడు. ‘‘ఏమిటీ... మొక్కలు వాకింగ్ చేస్తాయా?’’ ఆశ్చర్యంగా అడిగాను నేను. అంతే! మా బుజ్జిగాణ్ణి వదిలేసి నన్ను తగులుకున్నాడు. ‘‘యా... పొద్దున్నే ఆకులో మరో ఆకు వేసుకుంటూ సూర్యుడి వైపు వాకింగ్ చేస్తాయవి. మనం అడుగు పక్కన అడుగు వేయడాన్ని వాకింగ్ అంటాం కదా. అలా అవి ఆకు నుంచి ఆకు పెంచుకుంటూ... అనగా మారాకు వేసుకుంటూ పోయే ప్రక్రియను ‘ఆకింగ్’ అనుకోవచ్చు కదా. ఇప్పుడు చెప్పు... సదరు ‘ఆకింగ్’ అన్నది మన ‘వాకింగ్’ లాంటి ఎక్సర్సైజు ప్రక్రియ అని నీకు అనిపించడం లేదూ’’ ఎక్స్ప్లెయిన్ చేశాడు రాంబాబు గాడు. ‘‘మరి అవి బిజినెస్ కూడా చేస్తాయంటున్నావ్. అదెలా?’’ అడిగాను నేను. ‘‘అదీ చెబుతా విను. పూలు పూసే సమయానికి వాటికి వింత రంగులూ, మంచి వాసనలు వెలువడేలా చూసుకుంటాయి. అంటే ఇది తమ బిజినెస్ షోరూమ్‌నూ కాదంటే బ్యాలెన్స్షీటునూ అలంకరించుకోవడం అన్నమాట. ఇలా ఎందుకూ అంటే... కీటకాలను తమ వైపునకు ఆకర్షించడానికి అన్నమాట. అలా ఆకర్షించాక పుప్పొడి కీటకాల కాళ్లకు అంటేలా చేసి పండ్లు అయ్యేలా చూసి, వాటికి రుచి కూడా అద్ది... పక్షులు తినేలా జాగ్రత్తలు తీసుకొని... తమ సంతతిని బాగా విస్తరించుకునేలా చేస్తాయి. అంటే ఇవన్నీ చెట్ల తాలుకు బిజినెస్ ఎక్స్పాన్షన్ కార్యకలాపాలన్నమాట. ఒక రహస్యం చెప్పనా... పుప్పొడిని వ్యాపింపజేసేందుకు కీటకాలకు తేనెనీ, మకరందాన్నీ లంచంగా సమర్పిస్తాయి. అంతేనా... తమ గింజలను వ్యాప్తి చేయడానికి రుచిగల పండులోని గుజ్జును ఆమ్యామ్యాగా ఇస్తాయి. అలా ఈ బిజినెస్‌లో ‘ఫార్మాలిటీ’గా చేయాల్సిన ‘పేమెంట్స్’ అనీ అలా ఆ రూపంలో చేసేస్తుంటాయవి. కాస్త లోతుగా చూడు. తమ ప్రజాతిని ఒక ‘బ్రాండు’ అనుకుంటే... ఆ ‘బ్రాండ్’ను ‘గ్రౌండ్’ మీద విస్తరింపజేసుకోడానికి కావాల్సినంత ‘గ్రౌండు’వర్కు చేస్తాయి చెట్లు. ఇప్పుడు చెప్పు... చెట్లు బిజినెస్ చేసుకోవడం లేదంటావా?’’ వివరించాడు మా రాంబాబుగాడు. ‘‘చెప్పురా... చెప్పు... నోటికి ఎంత మాట వస్తే అంత మాటా కూసెయ్. ఇక లేటెందుకూ చెట్లు కూడా పెద్ద నోట్ల రద్దు... డీమానిటైజేషన్ వంటి కార్యకలాపాలు చేస్తాయని చెప్పెయ్’’ అంటూ కోపంగా అరిచాను నేను.‘‘ఆ... ఎందుకు చెయ్యవ్. నీళ్లు తక్కువగా దొరికే సీజన్ వచ్చిందనుకో. ఆకులన్నింటినీ ఉపసంహరించుకుంటాయి కొన్ని చెట్లు. తమలోంచి నీరు ఆవిరి కాకుండా రక్షించుకోవడం కోసం తమ కరెన్సీలాంటి ఆకులను ఉపసంహరించుకుని, ఆ స్థానంలో ముళ్లను మొలిపించుకుంటాయి. అలా లిక్విడ్ కరెన్సీ లాంటి ఆకును రాల్చేసుకుని లిక్విడ్‌ను సేవ్ చేసుకుంటాయి. ఈ ప్రక్రియ మొక్కల తాలూకు డీమానిటైజేషన్ లాంటిది కాదంటావా చెప్పు. ఈ ఆకు రాల్చే ‘డెసిడ్యువస్’ వనాలన్నీ ఆకు రద్దు కార్యక్రమం చేపట్టి... మళ్లీ వర్షాలవీ పుష్కలంగా కురవగానే కొత్త కరెన్సీ లాంటి ఆకులను ప్రింట్ చేసుకుంటాయి. చెట్లు ఇలా బిజీగా హెవీగా బిజినేస్సు చేస్తాయి. అన్నట్టు కార్పొరేటు అనే మాట ఎలా పుట్టిందనుకుంటున్నావ్? చెట్లు కలపను... అంటే... కర్రను ప్రొడ్యూస్ చేస్తాయి. వాటికి రేటు బాగా పలుకుతుంది. ఆ కలప తాలుకు పర్యాయ పదమైన కర్ర ప్లస్ రేటు కలిసి కర్రపరేటు... కార్పొరేటు అనే మాట పుట్టిందన్నమాట’’ అంటూ వివరించాడు వాడు. ‘‘అయినా సరే... నీదంతా వితండ వాదం. నీ మాటలను నేను నమ్మను. అంత అమాయకమైన మొక్కలు మోసాలూ చేస్తాయనే మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా’’ అంటూ వాణ్ణి గట్టిగా నిలదీశా. దానికి వాడు చిద్విలాసంగా నవ్వాడు. ‘‘ఒరే నాయనా. నీకు తెలియదూ... ఒకరు చెబితే వినవు. ఫ్లై ఆర్కిడు అనే మొక్క తాలూకు పువ్వు ఎలా ఉంటుందో తెలుసా? కాస్త బుజ్జిగాడు వినకుండా ఉండటానికి ఆ చెవి ఇటు పడేయ్. ఆ పువ్వులు అచ్చం మేటింగ్ కోసం రెడీగా ఉన్న ఆడ కీటకంలా ఉంటాయి. అంతేకాదు... వాటి వాసన కూడా మగకీటకాన్ని ఆకర్షించడానికి ఆడ ఆడకీటకం వెలువరించే ఫెరోమోన్ అనే సెంట్లా ఉంటుంది. ఇది మోసం కాదంటావా. ఒరేయ్... బిజినెస్‌లో కాస్త మోసం ఉంటుంది. విస్తరణ అనే తమ స్వలాభం కోసం కీటకాల తాలుకూ శ్రమదోపిడీ ఉంటుంది. కారల్ మార్క్స్ కూడా కనిపెట్టని రహస్యాలతో ‘ప్లాంట్ క్యాపిటల్’ అనే పుస్తకం రాసి నీలాంటి అమాయకులకెందరికో కనువిప్పు కలిగిద్దామని నా ఉద్దేశం రా’’ అంటూ రాంబాబు గాడు తన కొత్త ప్రాజెక్టు గురించి చెప్పగానే... నేను చేష్టలుడిగిపోయి అచ్చం చెట్టులా కొయ్యబారిపోయా. -
‘ఈగ’ స్ఫూర్తితో...
రాజమౌళి ‘ఈగ’ సినిమా స్ఫూర్తితో లైవ్ విత్ కంప్యూటర్ గ్రాఫిక్స్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘మనీ ప్లాంట్’. వెంకట్ గోపు దర్శకత్వంలో గణేశ్ కొల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువత, రక్తచరిత్ర, బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ చిత్రాల్లో నటించిన రుద్రాక్ష్ఇందులో కథానాయకుడు. ముహూర్తపు దృశ్యానికి నటుడు కృష్ణుడు కెమెరా స్విచాన్ చేయగా, దర్శక నిర్మాత ‘మధుర’ శ్రీధర్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత రాజ్ కందుకూరి గౌరవ దర్శకత్వం వహించారు. లవ్, కామెడీ కలగలిసిన సైన్స్ ఫిక్షన్ మర్డర్ థ్రిల్లర్ ఇదని దర్శకుడు పేర్కొన్నారు. జనవరి మూడోవారంలో చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హనుమాన్, కెమెరా: ప్రసాద్ జి.కె.