మా ఇంటి మనీ ప్లాంట్‌! | Money plant in our house | Sakshi
Sakshi News home page

మా ఇంటి మనీ ప్లాంట్‌!

Published Sat, Feb 11 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

మా ఇంటి మనీ ప్లాంట్‌!

మా ఇంటి మనీ ప్లాంట్‌!

‘‘నాన్నా... కుండీలో మొక్క అయినా, అడవిలో చెట్టయినా అలా కదలిక లేకుండా ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. మొలకెత్తి అలా పెరుగుతూ ఉండటం తప్ప... పాపం.... దానికి మరో పనేమీ ఉండదు కదా. మొక్కలకు బోర్‌ కొట్టదా నాన్నా.  వాటికి టైంపాస్‌ ఎలాగో ఏమిటో?’’ అంటూ జాలిపడ్డాడు మా బుజ్జిగాడు. నాకు ఆ ఆలోచన ఎప్పుడూ రాలేదు గానీ... వాడు చెప్పగానే ‘పాపం... నిజమే కదా’ అనిపించింది. సరిగ్గా మా బుజ్జిగాడు పై మాటలు చెబుతున్న టైమ్‌లోనే ఇంట్లోకి  ఎంటరయ్యాడు మా రాంబాబుగాడు. వాడి మాటలు తానూ విన్నాడు. ‘‘ఒరేయ్‌ బుజ్జిగా... చెట్లూ, మొక్కలూ అలా నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తాయిగానీ... మనుషులు చేసే పనులు చాలా చేస్తుంటాయవి. అంతెందుకు పొద్దున్నే వాకింగ్‌ చేయడం, బిజినెస్సులు చేయడం, ప్రలోభ పెట్టడం, మోసాలు చేయడం లాంటి ఎన్నో పనులు చేస్తాయవి. ఈ విషయాలేమీ మీ నాన్నకే  తెలియదు. ఇంక నీకేం చెబుతాడు?’’ అన్నాడు రాంబాబుగాడు. ‘‘ఏమిటీ... మొక్కలు వాకింగ్‌ చేస్తాయా?’’ ఆశ్చర్యంగా అడిగాను నేను. అంతే! మా బుజ్జిగాణ్ణి వదిలేసి నన్ను తగులుకున్నాడు.  ‘‘యా... పొద్దున్నే ఆకులో మరో ఆకు వేసుకుంటూ సూర్యుడి వైపు వాకింగ్‌ చేస్తాయవి. మనం అడుగు పక్కన అడుగు వేయడాన్ని వాకింగ్‌ అంటాం కదా. అలా అవి ఆకు నుంచి ఆకు పెంచుకుంటూ... అనగా మారాకు వేసుకుంటూ పోయే ప్రక్రియను ‘ఆకింగ్‌’ అనుకోవచ్చు కదా. ఇప్పుడు చెప్పు... సదరు ‘ఆకింగ్‌’ అన్నది మన ‘వాకింగ్‌’ లాంటి ఎక్సర్‌సైజు ప్రక్రియ అని నీకు అనిపించడం లేదూ’’ ఎక్స్‌ప్లెయిన్‌ చేశాడు రాంబాబు గాడు.

‘‘మరి అవి బిజినెస్‌ కూడా చేస్తాయంటున్నావ్‌. అదెలా?’’ అడిగాను నేను. ‘‘అదీ చెబుతా విను. పూలు పూసే సమయానికి వాటికి వింత రంగులూ, మంచి వాసనలు వెలువడేలా చూసుకుంటాయి. అంటే ఇది తమ బిజినెస్‌ షోరూమ్‌నూ కాదంటే బ్యాలెన్స్‌షీటునూ అలంకరించుకోవడం అన్నమాట. ఇలా ఎందుకూ అంటే... కీటకాలను తమ వైపునకు ఆకర్షించడానికి అన్నమాట. అలా ఆకర్షించాక పుప్పొడి కీటకాల కాళ్లకు అంటేలా చేసి పండ్లు అయ్యేలా చూసి, వాటికి రుచి కూడా అద్ది... పక్షులు తినేలా జాగ్రత్తలు తీసుకొని... తమ సంతతిని బాగా విస్తరించుకునేలా చేస్తాయి. అంటే ఇవన్నీ చెట్ల తాలుకు బిజినెస్‌ ఎక్స్‌పాన్షన్‌ కార్యకలాపాలన్నమాట. ఒక రహస్యం చెప్పనా... పుప్పొడిని వ్యాపింపజేసేందుకు కీటకాలకు తేనెనీ, మకరందాన్నీ లంచంగా సమర్పిస్తాయి. అంతేనా... తమ గింజలను వ్యాప్తి చేయడానికి రుచిగల పండులోని గుజ్జును ఆమ్యామ్యాగా ఇస్తాయి. అలా ఈ బిజినెస్‌లో ‘ఫార్మాలిటీ’గా చేయాల్సిన ‘పేమెంట్స్‌’ అనీ అలా ఆ రూపంలో చేసేస్తుంటాయవి. కాస్త లోతుగా చూడు. తమ ప్రజాతిని ఒక ‘బ్రాండు’ అనుకుంటే... ఆ ‘బ్రాండ్‌’ను ‘గ్రౌండ్‌’ మీద విస్తరింపజేసుకోడానికి కావాల్సినంత ‘గ్రౌండు’వర్కు చేస్తాయి చెట్లు. ఇప్పుడు చెప్పు... చెట్లు బిజినెస్‌ చేసుకోవడం లేదంటావా?’’ వివరించాడు మా రాంబాబుగాడు.

‘‘చెప్పురా... చెప్పు... నోటికి ఎంత మాట వస్తే అంత మాటా కూసెయ్‌. ఇక లేటెందుకూ చెట్లు కూడా పెద్ద నోట్ల రద్దు... డీమానిటైజేషన్‌ వంటి కార్యకలాపాలు  చేస్తాయని చెప్పెయ్‌’’ అంటూ కోపంగా అరిచాను నేను.‘‘ఆ... ఎందుకు చెయ్యవ్‌. నీళ్లు తక్కువగా దొరికే సీజన్‌ వచ్చిందనుకో. ఆకులన్నింటినీ ఉపసంహరించుకుంటాయి కొన్ని చెట్లు. తమలోంచి నీరు ఆవిరి కాకుండా  రక్షించుకోవడం కోసం తమ కరెన్సీలాంటి ఆకులను ఉపసంహరించుకుని, ఆ స్థానంలో ముళ్లను మొలిపించుకుంటాయి. అలా లిక్విడ్‌ కరెన్సీ లాంటి ఆకును రాల్చేసుకుని లిక్విడ్‌ను సేవ్‌ చేసుకుంటాయి. ఈ ప్రక్రియ మొక్కల తాలూకు డీమానిటైజేషన్‌ లాంటిది కాదంటావా చెప్పు. ఈ ఆకు రాల్చే ‘డెసిడ్యువస్‌’ వనాలన్నీ ఆకు రద్దు కార్యక్రమం చేపట్టి... మళ్లీ వర్షాలవీ పుష్కలంగా కురవగానే కొత్త కరెన్సీ లాంటి ఆకులను ప్రింట్‌ చేసుకుంటాయి. చెట్లు ఇలా బిజీగా హెవీగా బిజినేస్సు చేస్తాయి. అన్నట్టు కార్పొరేటు అనే మాట ఎలా పుట్టిందనుకుంటున్నావ్‌? చెట్లు కలపను... అంటే... కర్రను ప్రొడ్యూస్‌ చేస్తాయి. వాటికి రేటు బాగా పలుకుతుంది. ఆ కలప తాలుకు పర్యాయ పదమైన కర్ర ప్లస్‌ రేటు కలిసి కర్రపరేటు... కార్పొరేటు అనే మాట పుట్టిందన్నమాట’’ అంటూ వివరించాడు వాడు.

‘‘అయినా సరే... నీదంతా వితండ వాదం. నీ మాటలను నేను నమ్మను. అంత  అమాయకమైన మొక్కలు మోసాలూ చేస్తాయనే మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా’’ అంటూ వాణ్ణి గట్టిగా నిలదీశా. దానికి వాడు చిద్విలాసంగా నవ్వాడు. ‘‘ఒరే నాయనా. నీకు తెలియదూ... ఒకరు చెబితే వినవు. ఫ్లై ఆర్కిడు అనే మొక్క తాలూకు పువ్వు ఎలా ఉంటుందో తెలుసా? కాస్త బుజ్జిగాడు వినకుండా ఉండటానికి ఆ చెవి ఇటు పడేయ్‌. ఆ పువ్వులు అచ్చం మేటింగ్‌ కోసం రెడీగా ఉన్న ఆడ కీటకంలా ఉంటాయి. అంతేకాదు... వాటి వాసన కూడా మగకీటకాన్ని ఆకర్షించడానికి ఆడ ఆడకీటకం వెలువరించే ఫెరోమోన్‌ అనే సెంట్‌లా ఉంటుంది. ఇది మోసం కాదంటావా. ఒరేయ్‌... బిజినెస్‌లో కాస్త మోసం ఉంటుంది. విస్తరణ అనే తమ స్వలాభం కోసం  కీటకాల తాలుకూ శ్రమదోపిడీ ఉంటుంది. కారల్‌ మార్క్స్‌ కూడా కనిపెట్టని రహస్యాలతో ‘ప్లాంట్‌ క్యాపిటల్‌’ అనే పుస్తకం రాసి నీలాంటి అమాయకులకెందరికో కనువిప్పు కలిగిద్దామని నా ఉద్దేశం రా’’ అంటూ రాంబాబు గాడు తన కొత్త ప్రాజెక్టు గురించి చెప్పగానే... నేను చేష్టలుడిగిపోయి అచ్చం చెట్టులా కొయ్యబారిపోయా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement