నెలకు ఒకసారే మొక్కలకు నీళ్లు!
న్యూఢిల్లీ: ఇంట్లో మొక్కల పెంపకం పట్ల మక్కువ ఎక్కువగానే ఉన్నా.. ఎప్పటికప్పుడు మట్టి తొలుస్తూ నీటిని పోస్తూ, అవసరమైనప్పుడు ఎరువులు చల్లుతూ చాకిరీ చేయాలా ? అంటూ వళ్లు విరుచుకునే బద్దకస్తుల కోసం మంచి జెల్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. శ్రమ పడకుండానే ఇండోర్ ప్లాంట్లను ఏపుగా పెంచేందుకు తోడ్పడే అద్భుతమైన ఓ జెల్‌ను కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్ కింద పని చేస్తున్న విఠల్ మాల్యా సైంటిఫిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ‘ఈకో వండర్ జెల్’ను సృష్టించింది. పర్యావరణ పరిస్థితులను పరిరక్షిస్తూ ఇండోర్ ఆర్నమెంటల్ ప్లాంట్లను మన ఇష్టమైన రీతిలో సృజనాత్మకంగా పెంచుకునేందుకు ఈ జెల్ తోడ్పడుతోందని, దీన్ని ఉపయోగిస్తే నెలకు ఒకసారి మాత్రమే తగినంత నీరు మొక్కలు పోయాల్సి వస్తుందని ఫౌండేషన్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ అనిల్ కుష్ తెలిపారు.
‘నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్’ స్ఫూర్తితో ప్రయోగాలు నిర్వహించి కనిపెట్టిన ఈ జెల్ మార్కెట్లో అన్ని రంగుల్లో లభిస్తుందని ఆయన తెలిపారు. మొక్కల పెంపకానికి అవసరమైన అన్ని పోషక విలువలు ఈ జెల్‌లో ఉన్నాయని, ఇవి నేరుగా మొక్కల వేర్లలోకి వెళ్లి అవి త్వరగా ఎదగడానికి తోడ్పడతాయని ఆయన వివరించారు.
ఈ జెల్‌ను ఉపయోగించడం వల్ల మొక్కలకు తరచు నీళ్లు పోయాల్సిన అవసరం లేదని, ఎండాకాలంలో నెలకు ఒకసారి, ఇతర కాలాల్లో నెలన్నరకోసారి నీళ్లు పోస్తే సరిపోతుందని, మొక్కలను మనకు ఇష్టమైన ఆకృతిలో కత్తిరించుకోవచ్చని డాక్టర్ అనిల్ కుష్ తెలిపారు.