గ్రీన్ ఇండోర్ (Green Indoor)
ఇపుడన్నీ ఇరుకిరుకు ఇళ్లే. ఫ్లాట్‌లు, మూడు, నాలుగు గదులున్న ఇళ్లు. అయితే మనసుండాలే కానీ ఇంట్లోనే పెరిగే ఇండోర్ ప్లాంట్స్‌కు ఇపుడు ఏ మాత్రం కొదవలేదని నిపుణులు చెప్తున్నారు. ఇండోర్ ప్లాంట్లలో వందల రకాల మొక్కలున్నాయి. రూ.150 మొదలుకుని రూ.1500 దాకా విభిన్న ధరల్లో ఉన్నాయి. ఎవరి ఇష్టాన్ని బట్టి, అభిరుచిని బట్టి వారు ఎంచుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్‌ను కొంచెం జాగ్రత్తగా ఎంచుకుంటే అటు పచ్చదనానికి మన వంతు సాయపడడం మాత్రమే కాదు... ఇటు మన పిల్లలకు అద్భుతమైన వ్యాపకాన్ని అలవాటు చేసినట్టూ అవుతుందని నగరంలోని లోతుకుంటలో నివసించే నర్సరీ నిపుణురాలు సునీత అంటున్నారు. ఇంట్లో పెంచేందుకు అవకాశం ఉన్న కొన్ని మొక్కల రకాలివి...
అగ్లోనీమా: నీడపట్టున పెరిగే ఈ మొక్కకు సరిపడా నీటిని అందిస్తే చాలు. అందంగా, రంగు రంగుల ఆకులతో పెరిగే ఈ మొక్క ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది.
రసీనా: గ్రీన్, రెడ్... ఇలా విభిన్న రకాల రంగుల్లో ఆకులు రావడం దీని ప్రత్యేకత. దీనికి ఏ మాత్రం ఎండ అవసరం లేదు.
పీస్ లిల్లీ: పెద్ద పెద్ద తెల్లని పూరేకులకు మధ్యలో జొన్న కంకి తరహాలో చారతో అందాల పత్రంలా ఉంటుందీ ఇండోర్ ప్లాంట్. వాయువుల్ని నిర్మూలించడంలో, దుమ్ముధూళిని సంహరించడంలో ఉపకరిస్తుంది.
స్పాతీఫిల్లమ్:
నాటిన కొద్ది రోజులకే పాము పడగ శైలిలో తెల్లని ఆకులతో విస్తరిస్తుంది. మొక్కలన్నీ హానికారక వాయువుల్ని, దుమ్ము, ధూళిని సంహరించి స్వచ్ఛమైన వాతావరణానికి దోహదం చేసే విషయంలో స్పాతీ ఫిల్లమ్ అద్భుతమైన ప్రభావం చూపిస్తుంది.
మనీ ప్లాంట్: చాలా మందికి పరిచయం ఉన్న మొక్క ఇది. తక్కువ వెలుతురుతో పెరిగే ఈ ఇండోర్ ప్లాంట్ రోజురోజుకూ తీగలా అల్లుకుంటూ పెరుగుతూ అందంగా గోడల మీదో, గుమ్మానికి నలువైపులానో కొలువుదీరుతుంది.
- సత్యబాబు