
రాబోయేది చలికాలం. వర్షాలు తగ్గిపోయాక ఇంటికి కొత్తగా పెయింట్ వేసే కాలం. ఇప్పటి నుంచి వేసవి కాలం ముందు వరకు కాస్త కాంతిమంతమైన రంగులతో ఇంటిని కళాత్మకంగా తీర్చిదిద్దుకుంటే డల్ వాతావరణాన్ని మరింత వర్ణమయంగా మార్చుకోవచ్చు. అందుకు ఎక్కువ డబ్బు కేటాయించక్కర్లేదు. వాడని డ్రెస్సులు, దుపట్టాలు, చీరలు, షర్ట్‌లనూ ఇంటి అలంకరణలో ఉపయోగించవచ్చు.
ఈ మాసంలో పూజలు, నోములు, వ్రతాలు, పెళ్లి వంటి వేడుకలతో లోగిళ్లు సందడి చేస్తుంటాయి. ఇలాంటప్పుడు లివింగ్ రూమ్‌కి కళ తెచ్చేలా చిన్న చిన్న చిట్కాలు పాటించవచ్చు.
డ్రెస్ కుషన్ కవర్స్
కొన్ని డ్రెస్సులు పాతవైనా వాటిలోని ప్రింట్లు, జరీ బాగుండటంతో పడేయాలనిపించదు. ఇలాంటప్పుడు అంతమేరకు డ్రెస్ క్లాత్ తీసుకొని, ప్యాచ్ వర్క్ లేదా చిన్న–పెద్ద కుషన్స్‌కి కవర్స్‌లా డిజైన్ చే సుకోవచ్చు.
సెంటర్ టేబుల్ దుపట్టా
మన చేనేతలను ధరించినా, ఇంటి అలంకరణలో ఉపయోగించినా కొంగొత్త కళను మోసుకువస్తాయి. సెంటర్ టేబుల్‌ని డ్రెస్ దుపట్టాతో అలంకరించవచ్చు. దానిపైన ఉపయోగించే షో పీసులు ఇత్తడి లేదా వింటేజ్ లుక్ ఉన్నవి ఎంచుకుంటే ఇంటి అలంకరణ ముఖ్యంగా లివింగ్ రూమ్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ప్రింటెడ్ శారీ కర్టెన్స్
చాలా సందర్భాలలో ఈ ట్రిక్ కొన్ని ఇళ్లలో గమనిస్తుంటాం. అయితే, ఇంట్లో అన్ని కిటికీలకు, డోర్లకు శారీ కర్టెన్స్ వాడితే భిన్నమైన లుక్‌తో ఆకట్టుకుంటుంది.
సప్తవర్ణాల శోభ
ఏడు రంగుల కాంబినేషన్ క్లాత్ మెటీరియల్‌తో కుషన్ కవర్స్‌ని డిజైన్ చేసి, అలంకరించుకోవచ్చు. దీని వల్ల ఇంద్రధనుస్సు నట్టింట్లో ఉన్న అనుభూతి కలగకమానదు. ఇలా రంగుల కాంబినేషన్‌తో చేసుకున్న డిజైన్ల వల్ల డల్‌గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా కాంతిమంతంగా మారిపోతుంది.
పాత షర్ట్‌లతో కొత్త మెరుపు
కుషన్ కవర్స్‌కి పాత డ్రెస్సులు, శారీస్ మాత్రమే కాదు షర్ట్స్ కూడా ఉపయోగించవచ్చు. కొత్తవాటితోనే ఈ తరహా డిజైన్స్‌కు సృజనాత్మకంగా ఆలోచన చేసి, వాటిని అమలులో పెడుతున్నారు. పొట్టిగా అయినవి, నప్పనివి, వాడనివి.. షర్ట్స్ ఏవి ఉన్నా ఇలా విన్నూతంగా కుషన్ కవర్స్‌కి వాడేయొచ్చు.
ఇంటికి సున్నాలు, రంగులు వేసి కొత్త కాంతి తీసుకురావడానికి కష్టపడుతున్నట్టే... రీ యూజ్ ఆలోచనతో వాడిన డ్రెస్సులను ఇలా వినూత్న డిజైన్లతో ఇంటి అలంకరణలో వాడేయొచ్చు. కొత్త కళను ఇంటికి తీసుకురావచ్చు.
చదవండి: హృదయవిదారక మిస్టరీ..! కన్న బిడ్డలు బతికున్నారోలేదో తెలియక..
Comments
Please login to add a commentAdd a comment