ఇంట్లో పెద్దవాళ్లు ఎవరైనా మరణిస్తే వారు వాడిన వస్తువులను జ్ఞాపకంగా భద్రపరచుకుంటాం. కొందరు ఆ వస్తువులు ఎందుకులే అని ఎవరికైనా ఇవ్వటమో.. అమ్మేయడమో చేస్తుంటారు. మీరట్‌కు చెందిన సురభి యాదవ్ మాత్రం తన అత్తగారు మరణించాక ఆమె గుర్తుగా ఉన్న వస్తువులను ఉపయోగంలోకి తెచ్చి, వాటికి తిరిగి జీవం పోయాలనుకుంది. అత్తగారి జ్ఞాపకాలుగా మిగిలిన వస్తువుల్లో 300 రకాల మొక్కలను పెంచుతూ.. ఇంటికి కొత్త కళను తీసుకొచ్చింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
‘మా అత్తగారు కోవిడ్ సెకండ్ వేవ్‌లో పోయారు. ఆవిడ లేని మా ఇల్లు కళ కోల్పోయినట్టు.. దిగులుగా అనిపించేది. ఇంట్లో మా అత్తగారు ఉపయోగించినవి, ఆమె సేకరించిన పాత్రలు చాలా ఉన్నాయి.
అవి ఆమె 30ఏళ్ల కష్టానికి ప్రతీకలు. ఆవిడ జ్ఞాపకాలు. వాటికి కొత్తరూపం ఇచ్చి రోజువారీ వాడకంలోకి తెస్తే ఆవిడ మా మధ్య తిరిగినట్టే ఉంటుంది కదా.. ఎప్పటిలాగే ఇల్లు కళకళలాడుతుంది కదా అనిపించింది. అంతేకాదు దానివల్ల ఎంతోకొంత పర్యావరణానికి మా వంతు సాయం చేసినట్టవుతుంది అనిపించింది. అందుకే మా అత్తగారి కాలంనాటి సీసాలు, పాత్రలు, లాంతర్లు, ఫ్యాన్.. వంటివాటిని అందమైన ప్లాంటర్స్‌గా మార్చాను. నాకు ఎంతో ఊరట కలిగింది. ఒక అవగాహనా వచ్చింది.
దాంతో మిగిలిన వస్తువుల్లో కొన్నిటిని అందమైన బొమ్మలుగా మార్చాను. ఇంకొన్నిట్లో మొక్కలను పెంచడం మొదలుపెట్టాను. ఇప్పుడు మా టెర్రస్ గార్డెన్‌లో పూలు, కూరగాయలు సహా 300 రకాల మొక్కలున్నాయి. నేనేం పెద్ద గార్డెనర్‌ని కాదు. నాకు తోచినట్టుగా ఓ చిన్నతోటతో మా అత్తగారి ప్రపంచాన్ని సజీవంగా మార్చేశాను!’ అని చెబుతుంది సురభి యాదవ్.
Comments
Please login to add a commentAdd a comment