మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజైన శనివారం అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 వరకు దాదాపు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహాలక్ష్మి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తాయని భక్తుల నమ్మకం. శనివారం సాయంత్రం నగరోత్సవం కనుల పండువగా సాగింది.
ఆదివారం అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి 2.5 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఆదివారం రాత్రి 11 గంటల వరకు భక్తులందరికీ ఉచితంగా అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు.
వీఐపీలకు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలుండవని అధికారులు చెప్పారు. కొండపైకి వాహనాలను అనుమతించేది లేదన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా నగరంలోకి వాహనాలు రాకుండా వెలుపల నుంచే మళ్లిస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి వినాయక టెంపుల్ వరకు, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు, కుమ్మరిపాలెం నుంచి మోడల్ గెస్ట్‌హౌస్ వరకు వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కాగా, శనివారం అమ్మవారిని మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ దర్శించుకున్నారు.
నేటి అలంకారం శ్రీ సరస్వతిదేవి
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ మూలా నక్షత్రం రోజైన ఆదివారం సరస్వతిదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. సరస్వతిదేవిని దర్శించుకోవడం వల్ల సర్వ విద్యలలో విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం.
Comments
Please login to add a commentAdd a comment