saraswathi devi
-
నేడు వసంత పంచమి: దేశంలోని ప్రముఖ సరస్వతి ఆలయాలివే!
ఈరోజు (ఫిబ్రవరి 14).. వసంత పంచమి.. అంటే చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినోత్సవం. దేశవ్యాప్తంగా ఈరోజు సరస్వతీమాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ రోజున చిన్నారులకు అక్షరాభ్యసాలు కూడా చేయిస్తుంటారు. అయితే దేశంలోని సరస్వతి ఆలయాల విషయానికొస్తే తక్కువగానే ఉన్నాయి. దేశంలోని ప్రముఖ సరస్వతీ దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భీమపుల్ సరస్వతి ఆలయం (ఉత్తరాఖండ్) ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో భీమపుల్ సరస్వతి ఆలయం ఉంది . ఇక్కడ సరస్వతీ మాత స్వయంగా వెలిశారని చెబుతారు. ఇక్కడ సరస్వతీమాత భీమా నది సమీపంలో ఉద్భవించారు. బాసర సరస్వతి ఆలయం (తెలంగాణ) బాసర గ్రామం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ముధోల్ పరిధిలో ఉంది. ఇక్కడ గోదావరి ఒడ్డున సరస్వతీమాత ఆలయం ఉంది. దీనిని మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలో వాల్మీకి సమాధి స్థలం కూడా ఉంది. ఆలయంలో లక్ష్మీదేవి కూడా దర్శనమిస్తుంది. ఆలయంలో సరస్వతీమాత విగ్రహం పద్మాసన భంగిమలో నాలుగు అడుగుల ఎత్తుతో కూడి ఉంటుంది. ఆలయానికి తూర్పున మహంకాళి ఆలయం కూడా ఉంది. పుష్కర్ సరస్వతి ఆలయం (రాజస్థాన్) రాజస్థాన్‌లోని పుష్కర్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బ్రహ్మదేవుని ఆలయం, జ్ఞాన సరస్వతి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ సావిత్రిమాత ఆలయం కూడా ఉంది. సరస్వతీ మాత ఇక్కడ నది రూపంలో కొలువుదీరిందని విశ్వసిస్తారు. శృంగేరి శారదా ఆలయం(కర్నాటక) జగద్గురు శంకరాచార్యులు నెలకొల్పిన నాలుగు పీఠాలలో కర్నాటకలోని శృంగేరి పీఠం ఒకటి. శృంగేరిలో శారదాంబ ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ శారదాంబ ఆలయాన్ని, దక్షిణామ్నాయ పీఠాన్ని ఏడవ శతాబ్దంలో ఆచార్య శ్రీ శంకర్ భగవత్పాదులవారు నిర్మించారు. మూకాంబిక ఆలయం(కేరళ) కేరళలోని ఎర్నాకులం జిల్లాలో మూకాంబిక ఆలయంగా పేరొందిన సరస్వతి మాత ఆలయం ఉంది. చరిత్రలోని వివరాల ప్రకారం ఇక్కడి రాజులు మూకాంబిక దేవిని పూజించేవారు. ప్రతి సంవత్సరం మంగళూరులో ఉత్సవాలు నిర్వహించేవారు. అయితే భక్తులు అక్కడికి వచ్చేందుకు పలు ఇబ్బందులు పడేవారట. ఒకరోజు అక్కడి రాజుకు కలలో అమ్మవారు కనిపించి, తనకు ఆలయాన్ని నిర్మించాలని కోరారట. ఇక్కడ కొలువైన సరస్వతీ దేవి విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. మైహార్ శారదా ఆలయం (మధ్యప్రదేశ్) మైహార్ శారదా ఆలయం.. మాతా కాళికా ఆలయంగానూ, సరస్వతీ ఆలయంగానూ పేరొందింది. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని సత్నా నగరానికి సమీపంలో త్రికూట కొండపై ఉంది. సరస్వతీమాత.. శారదాదేవి రూపంలో ఇక్కడ దర్శనమిస్తుంది. భోజశాల (మధ్యప్రదేశ్) మధ్యప్రదేశ్‌లోని ధార్ నగరంలో భోజశాల ఆలయం ఉంది. ఇక్కడ ప్రతీ సంవత్సరం వసంత పంచమి నాడు సరస్వతీ దేవి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ రోజున సరస్వతి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. భోజరాజు సరస్వతీ దేవి భక్తుడు. ఆయనే ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. విద్యా సరస్వతీ ఆలయం (తెలంగాణ) విద్యా సరస్వతి ఆలయం తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో ఉంది. కంచి శంకర మఠం ఈ ఆలయాన్ని పర్యవేక్షిస్తుంటుంది. ఈ ఆలయంలో లక్ష్మీ గణపతి ఆలయం, శనీశ్వరుని ఆలయం, శివాలయం ఇతర దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. -
బాసరలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
-
బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తుల తాకిడి
-
బాసర సరస్వతీ అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజైన శనివారం అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 వరకు దాదాపు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహాలక్ష్మి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తాయని భక్తుల నమ్మకం. శనివారం సాయంత్రం నగరోత్సవం కనుల పండువగా సాగింది. ఆదివారం అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి 2.5 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఆదివారం రాత్రి 11 గంటల వరకు భక్తులందరికీ ఉచితంగా అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. వీఐపీలకు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలుండవని అధికారులు చెప్పారు. కొండపైకి వాహనాలను అనుమతించేది లేదన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా నగరంలోకి వాహనాలు రాకుండా వెలుపల నుంచే మళ్లిస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి వినాయక టెంపుల్ వరకు, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు, కుమ్మరిపాలెం నుంచి మోడల్ గెస్ట్‌హౌస్ వరకు వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కాగా, శనివారం అమ్మవారిని మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ దర్శించుకున్నారు. నేటి అలంకారం శ్రీ సరస్వతిదేవి ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ మూలా నక్షత్రం రోజైన ఆదివారం సరస్వతిదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. సరస్వతిదేవిని దర్శించుకోవడం వల్ల సర్వ విద్యలలో విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం. -
కనకదుర్గమ్మ సరస్వతీదేవిగా దర్శనం
-
సరస్వతీదేవిగా దుర్గమ్మ దర్శనం
సాక్షి, ఇంద్రకీలాద్రి: శరన్నవరాత్రి అలంకరణల్లో ఐదవ రోజైన పంచమి తిథినాడు నేడు బెజవాడ కనకదుర్గమ్మ సరస్వతీదేవిగా దర్శనమిస్తే శ్రీశైల భ్రమరాంబ స్కందమాతగా దర్శనమిస్తుంది. సకల విద్యలకు, కళలకు, సకల ఙ్ఞానానికి సరస్వతీ మాత చిహ్నం. హంసవాహినిగా, వీణాపాణిగా ఈమెను కొలుస్తుంటారు. ఇక స్కందుడు అంటే కుమారస్వామి తల్లిగా పద్మాసనంలో విరాజిల్లే రూపంగా దర్శనమిచ్చే అవతారం స్కందమాత. ఈ తల్లి కమలాసనంపై శ్వేతపద్మంతో విరాజ్లిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా కాపాడు తుంది. చేతులలో చెరకు గడ, విల్లు, పాశాంకుశాలు ధరించి, కుడి, ఎడమ వైపులలో లక్ష్మీ, సరస్వతీ దేవిలను కలిగి ఉండి సకల లోకాలకు మాతృస్వరూపం తో దర్శనమిచ్చే రూపం స్కందమాతది. స్కందమాతను నీలం రంగు వస్త్రంతో అలంకరించి గోధుమ రవ్వతో చేసిన కేసరి, మిరియాల పొంగలి నివేదన చేయాలి. సరస్వతీదేవికి తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలు సమర్పించి, బెల్లం అన్నం, ముద్దపప్పు నైవేద్యంగా సమర్పించాలి. స్కందమాత శ్లోకం: సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కర్వయా! శుభదాస్తు సదాదేవి స్కందమాతా యశస్వినీ !! దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలలో ఐదో రోజున అమ్మవారిని శ్రీ సరస్వతీ దేవిగా అలంకరిస్తారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతీ శక్తి స్వరూపాలలో దుష్టసంహారం చేసిన శ్రీదుర్గాదేవి, తన నిజ స్వరూపంతో సాక్షాత్కరింపచేయడమే మూలా నక్షత్రం విశిష్టత. విద్యార్థిని, విద్యార్థులకు సరస్వతి అమ్మవారంటే అమితమైన ఇష్టం. అమ్మవారి అనుగ్రహం కోరుతున్న వారికి నిర్మలమైన దరహాసంతో సద్విద్యను శ్రీ సరస్వతీ దేవి ప్రసాదిస్తుంది. మూలా నక్షత్రం నాటి నుంచి విజయదశమి విశేష పర్వదినాలుగా భావించి శ్రీ దుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల ఆజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయినీ శ్రీ సరస్వతీదేవి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసరవర్ణినీ నిత్యం పద్మాలయాందేవి సామాం పాతు సరస్వతీ శ్రీసరస్వతీ స్తోత్రం సరస్వతీ త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణీ హంస వాహన సమాయుక్తా విద్యాదాన కరీమమ సర్వసిద్ధి కరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ సామేవసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ -
వారం పర్వం
విద్యాధిదేవత ఉద్భవించిన వేళ... విద్య, బుద్ధి, జ్ఞానం, వాక్కులకు అధినేత్రి సరస్వతీదేవి ఆవిర్భవించిన పర్వదినం మాఘపంచమి లేదా శ్రీపంచమి. ఈ దినాన ఆమెను పుస్తకాది రూపాలలో, విగ్రహంలో ఆవాహన చేసి విశేష అర్చన, పూజ, వ్రతోత్సవాలు చేస్తే ఆమె అనుగ్రహం కలుగుతుంది. సరస్వతీ దేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమెను తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రంతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్లనువ్వుల ఉండలు, చెరకు రసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగుపండు వంటి వాటిని నివేదిస్తే ఆమె ప్రసన్నురాలవుతుందని శాస్త్రోక్తి. (రేపు శ్రీపంచమి) లోకబాంధవుని పుట్టినరోజు ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుని జన్మతిథి మాఘశుద్ధ సప్తమి. దీనికే రథసప్తమి అని పేరు. రథసప్తమినాటి బ్రాహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని తారకలన్నీ రథాకారం దాల్చి, సూర్యరథాన్ని తలపింప చేస్తాయని ప్రతీతి. ఈవేళ్టి నుంచి భానుడి కిరణాలు భూమికి పుష్కలంగా అందడం ఆరంభమవుతుంది. నేత్రవ్యాధులు, శత్రుబాధలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శుచిగా ఉండి, మండలం రోజులపాటు నిష్ఠగా ఆదిత్యహృదయాన్ని పారాయణ చేస్తే ఆయా బాధలు పటాపంచలవుతాయని ప్రతీతి. రథసప్తమినాడు ఏమి చేయాలి? స్నానం చేసేటప్పుడు సూర్యభగవానుని మనసారా స్మరిస్తూ తలపై జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతోంది. గురువు నుంచి మంత్రదీక్ష తీసుకోవడానికి, నోములు పట్టడానికి అనుకూలమైన రోజు రథసప్తమి. ఉపదేశం ఉన్న మంత్రాలను ఈ వేళ జపం చేయడం సత్ఫలితాలను ప్రాప్తింప చేస్తుంది. రథసప్తమినాడు సూర్యాష్టకం లేదా ఆదిత్యహృదయాన్ని 9 మార్లు పఠించి, ఆవుపేడ పిడకలను కాల్చిన నిప్పు సెగపై ఆవుపాలతో పరమాన్నం వండి, దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదించాలి. అదేవిధంగా జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనం కలిపిన నీటిని లేదా పాలను రాగిపాత్రలో ఉంచి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఇహలోకంలో సకల సంపదలు, పరంలో మోక్షప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. (24, బుధవారం రథసప్తమి) పితృరుణ విముక్తికి మంచి మార్గం మాఘశుక్ల అష్టమినాడు భీష్మునికి తర్పణ, జలదానాలు చేసిన వారి పాపాలు నశించడంతోపాటు సంతాన ప్రాప్తి కలుగుతుంది. మాఘ శుద్ధ అష్టమినాడు భీష్ముడు అంపశయ్యపై దేహాన్ని చాలించాడు కనుక ఆనాడు ఆయనను తల్చుకొని తర్పణాలు ఇవ్వాలి. ఎన్నో ధర్మాలను, విధులను, జీవన మార్గాలను, విష్ణు సహస్రనామాల వంటి వాటిని అందించిన భీష్ముడు బ్రహ్మచారి కనుక ఆయన మరణించిన తిథినాడు తర్పణాలు ఇవ్వవలసిన బాధ్యత అందరిదీ. దీనికి పురుషులు, స్త్రీలు, తల్లిదండ్రులు ఉన్నవారు, లేనివారు అందరూ అర్హులే. భీష్మునికి తర్పణాలు విడిచిన వారికి ఆ సంవత్సరంలో చేసిన పాపాలు నశిస్తాయి. తిలోదకాలు, అన్నశ్రాద్ధం కూడా జరిపితే పితృ ఋణ విముక్తులు కావచ్చు. అర్ఘ్యప్రదానం చేసేవారు ఈ శ్లోకాలు చదవాలి. భీష్మశ్శాంతనవో వీరః సత్యవాదీ జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతి పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్ర పద్మగోత్రాయ సాంకృత్య ప్రవరాయచ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయవర్మిణే వసూనామావతారాయ శంతనోరాత్మజాయచ అర్ఘ్యం దదామి భీష్మాయాబాలబ్రహ్మచారిణే (25, గురువారం భీష్మాష్టమి) -
సరస్వతీ దేవిగా దుర్గామాత
దుబ్బాక: దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు మండలంలో ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామాత గురువారం సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భక్తి శ్రద్ధలతో చేస్తున్న విశేష పూజలు అమ్మవారు అందుకుంటున్నారు. దుర్గామాత సేవలో భక్తులు నిమగ్నమయ్యారు. నగర పంచాయతీ పరిధిలోని దుంపలపల్లి హిందూ రక్ష సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాతకు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు అధికం మల్లీశ్వరి, వెంకటస్వామిగౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక వ్రతాలు చేశారు. చెల్లాపూర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారికి పీఏసీఎస్ చైర్మన్ అమ్మన రవీందర్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులకు అన్న ప్రసాదాలు అందించారు. వైధిక క్రతువులను ప్రముఖ పురోహితులు లక్ష్మణ శర్మ, సంగమేశ్వర్లు నిర్వహించారు. ప్రజలు పాడి పంటలు, సుఖ సంతోషాలతో తులతూగాలని, సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆయా యూత్ సభ్యులు పాల్గొన్నారు.