సాక్షి, ఇంద్రకీలాద్రి: శరన్నవరాత్రి అలంకరణల్లో ఐదవ రోజైన పంచమి తిథినాడు నేడు బెజవాడ కనకదుర్గమ్మ సరస్వతీదేవిగా దర్శనమిస్తే శ్రీశైల భ్రమరాంబ స్కందమాతగా దర్శనమిస్తుంది. సకల విద్యలకు, కళలకు, సకల ఙ్ఞానానికి సరస్వతీ మాత చిహ్నం. హంసవాహినిగా, వీణాపాణిగా ఈమెను కొలుస్తుంటారు. ఇక స్కందుడు అంటే కుమారస్వామి తల్లిగా పద్మాసనంలో విరాజిల్లే రూపంగా దర్శనమిచ్చే అవతారం స్కందమాత. ఈ తల్లి కమలాసనంపై శ్వేతపద్మంతో విరాజ్లిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా కాపాడు తుంది. చేతులలో చెరకు గడ, విల్లు, పాశాంకుశాలు ధరించి, కుడి, ఎడమ వైపులలో లక్ష్మీ, సరస్వతీ దేవిలను కలిగి ఉండి సకల లోకాలకు మాతృస్వరూపం తో దర్శనమిచ్చే రూపం స్కందమాతది.
స్కందమాతను నీలం రంగు వస్త్రంతో అలంకరించి గోధుమ రవ్వతో చేసిన కేసరి, మిరియాల పొంగలి నివేదన చేయాలి. సరస్వతీదేవికి తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలు సమర్పించి, బెల్లం అన్నం, ముద్దపప్పు నైవేద్యంగా సమర్పించాలి.
స్కందమాత శ్లోకం:
సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కర్వయా!
శుభదాస్తు సదాదేవి స్కందమాతా యశస్వినీ !!
దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలలో ఐదో రోజున అమ్మవారిని శ్రీ సరస్వతీ దేవిగా అలంకరిస్తారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతీ శక్తి స్వరూపాలలో దుష్టసంహారం చేసిన శ్రీదుర్గాదేవి, తన నిజ స్వరూపంతో సాక్షాత్కరింపచేయడమే మూలా నక్షత్రం విశిష్టత. విద్యార్థిని, విద్యార్థులకు సరస్వతి అమ్మవారంటే అమితమైన ఇష్టం. అమ్మవారి అనుగ్రహం కోరుతున్న వారికి నిర్మలమైన దరహాసంతో సద్విద్యను శ్రీ సరస్వతీ దేవి ప్రసాదిస్తుంది. మూలా నక్షత్రం నాటి నుంచి విజయదశమి విశేష పర్వదినాలుగా భావించి శ్రీ దుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల ఆజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయినీ శ్రీ సరస్వతీదేవి.
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసరవర్ణినీ
నిత్యం పద్మాలయాందేవి సామాం పాతు సరస్వతీ
శ్రీసరస్వతీ స్తోత్రం
సరస్వతీ త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణీ
హంస వాహన సమాయుక్తా విద్యాదాన కరీమమ
సర్వసిద్ధి కరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ
సామేవసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ
Comments
Please login to add a commentAdd a comment