నేడు వసంత పంచమి: దేశంలోని ప్రముఖ సరస్వతి ఆలయాలివే! | Vasant Panchami Special Temple of Mata Saraswati | Sakshi
Sakshi News home page

Vasant Panchami: నేడు వసంత పంచమి: దేశంలోని ప్రముఖ సరస్వతి ఆలయాలివే!

Published Wed, Feb 14 2024 8:17 AM | Last Updated on Wed, Feb 14 2024 11:07 AM

Vasant Panchami Special Temple of Mata Saraswati - Sakshi

ఈరోజు (ఫిబ్రవరి 14).. వసంత పంచమి.. అంటే చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినోత్సవం. దేశవ్యాప్తంగా ఈరోజు సరస్వతీమాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ రోజున చిన్నారులకు అక్షరాభ్యసాలు కూడా చేయిస్తుంటారు. అయితే దేశంలోని సరస్వతి ఆలయాల విషయానికొస్తే తక్కువగానే ఉన్నాయి. దేశంలోని ప్రముఖ సరస్వతీ దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

భీమపుల్ సరస్వతి ఆలయం (ఉత్తరాఖండ్‌) 
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో భీమపుల్ సరస్వతి ఆలయం ఉంది . ఇక్కడ సరస్వతీ మాత  స్వయంగా వెలిశారని చెబుతారు. ఇక్కడ సరస్వతీమాత భీమా నది సమీపంలో ఉద్భవించారు.


 
బాసర సరస్వతి ఆలయం (తెలంగాణ) 
బాసర గ్రామం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ముధోల్ పరిధిలో ఉంది. ఇక్కడ గోదావరి ఒడ్డున సరస్వతీమాత ఆలయం ఉంది.  దీనిని మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు  నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలో వాల్మీకి  సమాధి స్థలం కూడా ఉంది. ఆలయంలో లక్ష్మీదేవి కూడా దర్శనమిస్తుంది. ఆలయంలో సరస్వతీమాత విగ్రహం పద్మాసన భంగిమలో నాలుగు అడుగుల ఎత్తుతో కూడి ఉంటుంది. ఆలయానికి తూర్పున మహంకాళి ఆలయం కూడా ఉంది. 

పుష్కర్ సరస్వతి ఆలయం (రాజస్థాన్‌) 
రాజస్థాన్‌లోని పుష్కర్‌ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బ్రహ్మదేవుని ఆలయం, జ్ఞాన సరస్వతి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ సావిత్రిమాత ఆలయం కూడా ఉంది. సరస్వతీ మాత ఇక్కడ నది రూపంలో కొలువుదీరిందని విశ్వసిస్తారు. 

శృంగేరి శారదా ఆలయం(కర్నాటక)
జగద్గురు శంకరాచార్యులు నెలకొల్పిన నాలుగు పీఠాలలో కర్నాటకలోని శృంగేరి పీఠం ఒకటి. శృంగేరిలో శారదాంబ ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ శారదాంబ ఆలయాన్ని, దక్షిణామ్నాయ పీఠాన్ని ఏడవ శతాబ్దంలో ఆచార్య శ్రీ శంకర్ భగవత్పాదులవారు నిర్మించారు.


 
మూకాంబిక ఆలయం(కేరళ) 
కేరళలోని ఎర్నాకులం జిల్లాలో మూకాంబిక ఆలయంగా పేరొందిన సరస్వతి మాత ఆలయం ఉంది. చరిత్రలోని వివరాల ప్రకారం ఇక్కడి రాజులు మూకాంబిక దేవిని పూజించేవారు. ప్రతి సంవత్సరం మంగళూరులో ఉత్సవాలు నిర్వహించేవారు. అయితే భక్తులు అక్కడికి వచ్చేందుకు పలు ఇబ్బందులు పడేవారట. ఒకరోజు అక్కడి రాజుకు కలలో అమ్మవారు కనిపించి, తనకు ఆలయాన్ని నిర్మించాలని కోరారట. ఇక్కడ కొలువైన సరస్వతీ దేవి విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు.
 
మైహార్ శారదా ఆలయం (మధ్యప్రదేశ్‌)
మైహార్ శారదా ఆలయం.. మాతా కాళికా ఆలయంగానూ, సరస్వతీ ఆలయంగానూ పేరొందింది. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని సత్నా నగరానికి సమీపంలో త్రికూట కొండపై ఉంది. సరస్వతీమాత.. శారదాదేవి రూపంలో ఇక్కడ దర్శనమిస్తుంది. 
 
భోజశాల (మధ్యప్రదేశ్‌) 
మధ్యప్రదేశ్‌లోని ధార్ నగరంలో భోజశాల ఆలయం ఉంది. ఇక్కడ ప్రతీ సంవత్సరం వసంత పంచమి నాడు సరస్వతీ దేవి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ రోజున సరస్వతి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. భోజరాజు సరస్వతీ దేవి భక్తుడు. ఆయనే ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.


 
విద్యా సరస్వతీ ఆలయం (తెలంగాణ) 
విద్యా సరస్వతి ఆలయం తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో ఉంది. కంచి శంకర మఠం ఈ ఆలయాన్ని పర్యవేక్షిస్తుంటుంది. ఈ ఆలయంలో లక్ష్మీ గణపతి ఆలయం, శనీశ్వరుని ఆలయం, శివాలయం ఇతర దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement