విద్యాధిదేవత ఉద్భవించిన వేళ...
విద్య, బుద్ధి, జ్ఞానం, వాక్కులకు అధినేత్రి సరస్వతీదేవి ఆవిర్భవించిన పర్వదినం మాఘపంచమి లేదా శ్రీపంచమి. ఈ దినాన ఆమెను పుస్తకాది రూపాలలో, విగ్రహంలో ఆవాహన చేసి విశేష అర్చన, పూజ, వ్రతోత్సవాలు చేస్తే ఆమె అనుగ్రహం కలుగుతుంది.
సరస్వతీ దేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమెను తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రంతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్లనువ్వుల ఉండలు, చెరకు రసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగుపండు వంటి వాటిని నివేదిస్తే ఆమె ప్రసన్నురాలవుతుందని శాస్త్రోక్తి. (రేపు శ్రీపంచమి)
లోకబాంధవుని పుట్టినరోజు
ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుని జన్మతిథి మాఘశుద్ధ సప్తమి. దీనికే రథసప్తమి అని పేరు. రథసప్తమినాటి బ్రాహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని తారకలన్నీ రథాకారం దాల్చి, సూర్యరథాన్ని తలపింప చేస్తాయని ప్రతీతి. ఈవేళ్టి నుంచి భానుడి కిరణాలు భూమికి పుష్కలంగా అందడం ఆరంభమవుతుంది.
నేత్రవ్యాధులు, శత్రుబాధలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శుచిగా ఉండి, మండలం రోజులపాటు నిష్ఠగా ఆదిత్యహృదయాన్ని పారాయణ చేస్తే ఆయా బాధలు పటాపంచలవుతాయని ప్రతీతి.
రథసప్తమినాడు ఏమి చేయాలి?
స్నానం చేసేటప్పుడు సూర్యభగవానుని మనసారా స్మరిస్తూ తలపై జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతోంది. గురువు నుంచి మంత్రదీక్ష తీసుకోవడానికి, నోములు పట్టడానికి అనుకూలమైన రోజు రథసప్తమి. ఉపదేశం ఉన్న మంత్రాలను ఈ వేళ జపం చేయడం సత్ఫలితాలను ప్రాప్తింప చేస్తుంది.
రథసప్తమినాడు సూర్యాష్టకం లేదా ఆదిత్యహృదయాన్ని 9 మార్లు పఠించి, ఆవుపేడ పిడకలను కాల్చిన నిప్పు సెగపై ఆవుపాలతో పరమాన్నం వండి, దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదించాలి. అదేవిధంగా జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనం కలిపిన నీటిని లేదా పాలను రాగిపాత్రలో ఉంచి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఇహలోకంలో సకల సంపదలు, పరంలో మోక్షప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. (24, బుధవారం రథసప్తమి)
పితృరుణ విముక్తికి మంచి మార్గం
మాఘశుక్ల అష్టమినాడు భీష్మునికి తర్పణ, జలదానాలు చేసిన వారి పాపాలు నశించడంతోపాటు సంతాన ప్రాప్తి కలుగుతుంది. మాఘ శుద్ధ అష్టమినాడు భీష్ముడు అంపశయ్యపై దేహాన్ని చాలించాడు కనుక ఆనాడు ఆయనను తల్చుకొని తర్పణాలు ఇవ్వాలి.
ఎన్నో ధర్మాలను, విధులను, జీవన మార్గాలను, విష్ణు సహస్రనామాల వంటి వాటిని అందించిన భీష్ముడు బ్రహ్మచారి కనుక ఆయన మరణించిన తిథినాడు తర్పణాలు ఇవ్వవలసిన బాధ్యత అందరిదీ. దీనికి పురుషులు, స్త్రీలు, తల్లిదండ్రులు ఉన్నవారు, లేనివారు అందరూ అర్హులే. భీష్మునికి తర్పణాలు విడిచిన వారికి ఆ సంవత్సరంలో చేసిన పాపాలు నశిస్తాయి. తిలోదకాలు, అన్నశ్రాద్ధం కూడా జరిపితే పితృ ఋణ విముక్తులు కావచ్చు. అర్ఘ్యప్రదానం చేసేవారు ఈ శ్లోకాలు చదవాలి.
భీష్మశ్శాంతనవో వీరః సత్యవాదీ జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతి పుత్రపౌత్రోచితాం క్రియాం వైయాఘ్ర పద్మగోత్రాయ సాంకృత్య ప్రవరాయచ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయవర్మిణే వసూనామావతారాయ శంతనోరాత్మజాయచ అర్ఘ్యం దదామి భీష్మాయాబాలబ్రహ్మచారిణే (25, గురువారం భీష్మాష్టమి)
Comments
Please login to add a commentAdd a comment