సాక్షి, హైదరాబాద్: దసరా రోజున హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి పాకిస్తాన్ కేంద్రంగా జరిగిన ఉగ్ర కుట్రను కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో నగర పోలీసులు భగ్నం చేశా రు. లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఫర్హాతుల్లా ఘోరీ ఆదేశాలతో నగరంలో దసరా ఉత్సవాలు, ఊరేగింపుల్లో విధ్వంసాలు సృష్టించడంతోపాటు నగరానికి చెందిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతల్ని హతమార్చాలనుకున్న ముగ్గురు ముష్కరులను అరెస్టు చేశారు.
ఫర్హాతుల్లా ఘోరీ ప్రధా న అనుచరుడైన ముసారాంబాగ్‌వాసి మహ్మద్ అబ్దుల్ జాహెద్, ఐసిస్ ఉగ్రవాది, హుమాయున్‌నగర్‌లోని రాయల్ కాలనీకి చెందిన మాజ్ హసన్ ఫారూఖ్, సైదాబాద్ పరిధిలోని అక్బర్‌బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సమీదుద్దీన్ అలియాస్ అబ్దుల్ సమీలను అరెస్టు చేశారు. వారి నుంచి 4 హ్యాండ్ గ్రెనేడ్లు, 5.41 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టంలోని 18, 18 (బీ), 20 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ప్రధాన అనుచరుడి ద్వారా కుట్ర...
అబ్దుల్ జాహెద్ 2004లో ఘోరీ ఆదేశాలతో బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు జరిగిన కుట్రలో పాలుపంచుకున్నాడు. అప్పట్లో పేలుడు పదార్థాలను దాచి ఉంచిన కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అలాగే 2005 అక్టోబర్ 12న సరిగ్గా దసరా రోజునే హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు (బంగ్లాదేశీ డాలిన్) దాడి కేసులోనూ అరెస్టయి 2017 వరకు జైల్లో ఉన్నాడు.
అయితే ఈ రెండు కేసులూ సరైన సాక్షా«ధారాలు లేక కోర్టులో వీగిపోవడంతో విడుదలైన జాహెద్.. సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఘోరీతో నిరంతరం టచ్‌లోనే ఉన్నాడు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతోపాటు నగరంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మరోసారి హైదరాబాద్‌లో ఉగ్రదాడులు జరపాలన్న లష్కరే తోయిబా ఆదేశాలతో ఘోరీ జాహెద్‌ను రంగంలోకి దించాడు.
జైల్లో పరిచయమైన మాజ్‌తో కలిసి...
నగరంలో దాడుల కోసం జాహెద్ తన స్నేహితుడైన మహ్మద్ సమీయుద్దీన్‌తోపాటు గతంలో ఐసిస్ కేసులో అరెస్టయిన మాజ్ హుస్సేన్ ఫారూఖ్‌ను ఎంచుకున్నాడు. 2015లో ‘ఐసిస్’ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సిరియా వెళ్తూ నాగ్‌పూర్ విమానాశ్రయంలో అబ్దుల్లా బాసిత్ సహా చిక్కిన ముగ్గురు యువకుల్లో మాజ్ హుస్సేన్ ఒకడు. 2016 వరకు జైల్లో ఉన్న అతనికి అక్కడే జావేద్‌తో పరిచయమైంది. ఘోరీ చెప్పిన ఆపరేషన్ పూర్తి చేయడానికి సహకరించాలంటూ జావేద్ కోరడంతో మాజ్ అంగీకరించాడు.
ఆరు చోట్ల రెక్కీలు...
ఈ ఆపరేషన్‌కు అవసరమైన నగదును ఘోరీ హవాలా రూపంలో పంపాడు. పాక్‌లో తయారైన నాలుగు హ్యాండ్ గ్రెనేడ్స్‌ను తన నెట్‌వర్క్ సాయంతో హైదరాబాద్‌కు చేర్చాడు. ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ 6 చోట్ల రెక్కీలు కూడా చేయించాడు. దసరా ఉత్సవాల ఊరేగింపు జరిగే మార్గాలతోపాటు ముగ్గురు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకుల ఇళ్లు, కార్యాలయాలు వాటిలో ఉన్నాయి.
ఈ ముగ్గురూ దసరా రోజున ఎవరికి వారుగా విడిపోయి గ్రెనేడ్స్‌తో దాడులు చేయాలని పథకం వేశారు. నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతంలో ట్రయల్ రన్ కోసం ఓ గ్రెనేడ్ వాడాలని భావించారు. ఈ సన్నాహాల్లో ఉండగా కేంద్ర నిఘా వర్గాలకు ఉప్పందింది. వాళ్లు అప్రమత్తం చేయడంతో శనివారం రాత్రి సిటీ సీసీఎస్ అధీనంలోని సిట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
రంగంలోకి దిగిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఈ ముగ్గురితోపాటు సైదాబాద్, మాదన్నపేట, పాతబస్తీకి చెందిన మరో నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ప్రమేయం లేని వారిని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురినీ అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.
24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఘోరీ...
హైదరాబాద్ మాదన్నపేట సమీపంలోని కూర్మగూడకు చెందిన ఫర్హాతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్ 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లి అ/ê్ఞతంలోకి వెళ్లిపోయాడు.
2002లో గుజరాత్‌లోని అక్షర్‌ధామ్ ఆలయంపై జరిగిన ఉగ్ర దాడితోపాటు దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా దేవాలయం వద్ద పేలుడు, అదే ఏడాది ముంబైలోని ఘట్కోపర్ వద్ద జరిగిన బస్సులో పేలుడు, 2004లో సికింద్రాబాద్‌లోని గణేశ్ టెంపుల్ పేల్చివేతకు కుట్ర, అదే ఏడాది బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర, 2005లో నగర కమిషనర్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి కేసుల్లోనూ అతను నిందితుడు.
చాలాకాలం దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన అతను ప్రస్తుతం పాక్‌లోని అబోటాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తూ నగర యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నాడు. అతనిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment