మహానంది క్షేత్రం
కార్తీకం..శుభప్రదం
Published Sat, Oct 29 2016 9:45 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM
– రేపటి నుంచి కార్తీకమాసం
– సోమవారంతో మొదలు
- సోమవారమే వచ్చిన పౌర్ణమి, అమావాస్య
// న కార్తీకసమో మాసో న కృతేన
సమం యుగమ్/న వేదసదృశం శాస్త్రం న తీర్థం
గంగయా సమమ్//
కార్తీకమాసంతో సమానమైన మాసము, కృతయుగముతో సరిౖయెన యుగము, వేద సదృశమైన శాస్త్రము, గంగా సమానమైన తీర్థము లేవు. కార్తీకమాసంలో చేసిన జప, హోమ, దానములు, శివాభిషేకములు, విష్ణుపూజలు, విశేష ఫలప్రదములు.
కార్తీకమాసం పాడ్యమి(31–10–2016) నుంచి పాడ్యమి(29–11–2016) వరకు నెలరోజులు అత్యంత విశేషమైనది. శివకేశవులకు ఈ నెల ప్రీతికర. సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల కన్నా ఈ కార్తీకమాసం అత్యంత అధిక ఫలదాయకమైనదని పురాణాల్లో చెప్పబడింది.
ఈ సారి ప్రత్యేకం..
ఈ ఏడాది కార్తీకమాసం సోమవారంతో మొదలవడం విశేషం. అలాగే కార్తీకపౌర్ణమి, అమావాస్య కూడా సోమవారం రావడం చాలా అరుదు. ఇలాంటి అరుదుగా వచ్చే కార్తీక మాసం సహస్రాధికమైన ఫలాన్ని ఇస్తుందని మహానంది దేవస్థానం వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం అత్యంత శక్తిదాయకమన్నారు. మహానంది క్షేత్రంలో గంగాదేవి(రుద్రగుండం కోనేరు), ఈశ్వరుడు ఇద్దరూ ఉన్నారని, యధాశక్తి దీపారాధన చేయడం ద్వారా అనంతమైన ఫలం లభిస్తుందని చెప్పారు.
నియమాలివి..
కార్తీక సోమవారం పగలు అంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తూ ఆ రోజంతా భగవధ్యానంలో గడిపేవాళ్లు శివసాయుజ్యం పొందుతారని సూత ఉవాచ. ఈ మాసంలో ఏకభుక్తం, నక్తభోజనం చేస్తారు. అయితే నక్తం ఉండలేనివారు ఒక కార్తీక పౌర్ణమి రోజు అయినా ఉన్నా ఎంతో పుణ్యం. కార్తీకమాసం అంతా తెల్లవారుఝామునే స్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది. ఈ మాసంలో ఉదయం, సాయంత్ర వేళల్లో ఆవునేతితో లేదా నువ్వులనూనెతో దీపారాధన చేసి అభిషేక ప్రియుడైన ఈశ్వరుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అర్చనలు చేయడం వలన మహాపుణ్యం లభిస్తుంది. ఈ నెలలో ఎక్కడైతే మహావిష్ణువును పూజిస్తారో అక్కడ భూత, పిశాచ, గ్రహగణాలు దూరంగా ఉంటాయి. శివుడికి ప్రీతికరమైన జిల్లేడు పూలతో పూజిస్తే దీర్ఘాయులై మోక్షాన్ని పొందుతారు.
వనభోజనం ..
కార్తీకమాసంలో వనభోజనాలది ప్రత్యేకత. ఉసిరిచెట్టు క్రింద శ్రీ మహావిష్ణువు ఫోటో పెట్టి పూజించడంతో పాటు అదే చెట్టు క్రింద సహపంక్తి భోజనాలు చేయాలి. గోమాతను పూజించాలి. తులసీదళాలతో శ్రీ మహావిష్ణువును కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసీ చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణుసహస్రనామ పారాయణం, కార్తీకపురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం. గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసీకోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు.
Advertisement
Advertisement