కల్యాణం.. కమనీయం
♦ వైభవంగా శ్రీసీతారాములవారి కల్యాణం
♦ లక్షలాది మంది భక్తులతో పులకరించిన భద్రాద్రి
♦ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఇంద్రకరణ్‌రెడ్డి
సాక్షి, భద్రాచలం/కొత్తగూడెం: జై శ్రీరాం.. జై శ్రీరాం అంటూ భక్తుల జయజయ ధ్వానాలు.. వేద పండితుల మంత్రోచ్చారణలు, విద్వాంసుల మంగళ వాయిద్యాల నడుమ భద్రాచల శ్రీసీతారాముల వారి కల్యాణం బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు జరిగిన కల్యాణానికి వేదికైన మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది. ఈ మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన అశేష భక్తజనంతో భద్రాద్రి పులకించింది. రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించే వారు, తలనీలాల మొక్కు తీర్చుకునేవారితో గోదావరి తీరం నిండిపోయింది.
పట్టువస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్
స్వల్ప అనారోగ్యం కారణంగా సీఎం కేసీఆర్ ఈ కల్యాణానికి హాజరుకాలేకపోయారు. దాంతో ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కేసీఆర్ కుటుంబం తరఫున ఆయన మనవడు, కేటీఆర్ కుమారుడైన హిమాన్షు.. రామచంద్రస్వామికి, సీతమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఇక భద్రాద్రి ఆలయ విశిష్టతను, వైకుంఠ రాముడి ప్రాశస్త్యాన్ని, భక్తరామదాసు సేవలను, ఆయన సీతారాములకు చేయించిన బంగారు ఆభరణాల ప్రాశస్త్యాన్ని ఆలయ వేద పండితులు వివరించడం భక్తులను ఆకట్టుకుంది.
గోత్రం, ప్రవరలపై దుష్ప్రచారం వద్దు
కల్యాణ సమయంలో సీతమ్మ, రామచంద్రస్వామి గోత్రం, ప్రవరలు చెçబుతున్న తీరుపై జరుగుతున్న ప్రచారాన్ని వేద పండితులు ఖండించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం ప్రాధాన్యతను, ప్రతిష్టను దెబ్బతీసేందుకే కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని, అది వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. రామచంద్రస్వామిని నారాయణుడిగా, సీతమ్మ తల్లిని లక్ష్మీదేవిగా భావించి భగవంతుడి గోత్రాలను చదువుతుంటామని, రాముడికి అచ్యుత గోత్రం, సీతమ్మ తల్లికి సౌభాగ్య గోత్రం చదివి లోక కల్యాణం జరిపిస్తామని వివరించారు.
నేడు మహా పట్టాభిషేకం
భద్రాచలంలోని మిథిలా స్టేడియం ప్రాంగణంలో కల్యాణోత్సవం జరిగిన మండపంలోనే గురువారం శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ వేడుక జరగనుంది. పట్టాభిషేక మహోత్సవానికి ప్రభుత్వం తరఫున గవర్నర్ నరసింహన్ విచ్చేసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాగా ఈ సీతారాముల కల్యాణ మహోత్సవానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జైశ్వాల్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల, ఎంపీ సీతారాంనాయక్, డీజీపీ అనురాగ్ శర్మ, టీటీడీ ఈవో సాంబశివరావు, దేవాదాయ కమిషనర్ శివశంకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.