భద్రాద్రికి ఏడువేల మంది భక్తుల పాదయాత్ర
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు ఒక రోజు ముందే వేలమంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ కనిపించింది. వీరు ముందుగా పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఆ తరువాత స్వామి వారి దర్శనానికి బారులుతీరారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏపీలోని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, రాజమండ్రి నుంచి పాదయాత్రగా దాదాపు 7000 మంది భక్తులు భద్రాచలం చేరుకున్నారు. స్వామి వారి దర్శనానంతరం బేడా మండపంలో స్వామి వారి భజనలు చేశారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.