వేధింపుల ఈఓ మాకొద్దు
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిపై ఉద్యోగులు తిరుగుబావుటా ఎగురవేశారు. ఏడాదికాలంగా ఉద్యోగులు, అర్చకులను ఈఓ రఘునాథ్ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.
ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపానికి ఎదురుగా ఉద్యోగులు, అర్చకులు ధర్నాకు దిగారు. ఈఓ గో బ్యాక్, సంపాదిత సెలవులు మంజూరు చేయాలి, ఈఓ నిరంకుశత్వ వైఖరి నశించాలి, వేధింపులు ఆపాలి, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలి అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ దేవస్థాన ఉద్యోగులు, వేదపండితులు, అర్చకులు, నాల్గవ తరగతి ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. టీజేఏసీ కూడా రంగంలోకి దిగి ఉద్యోగులకు మద్దతుగా నిలిచింది.
ఈ సందర్భంగా దేవస్థానం స్థానాచార్యులు కెఈ స్థలశాయి మాట్లాడుతూ ఈఓ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఆలయ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మతపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కనీసం వేదపండితులు, అర్చకులతో చర్చించాలనే ఆలోచన చేయకపోవటంతో ఆలయ సంప్రదాయాలు కనుమరుగైపోయాయన్నారు.
ఆలయ సంప్రదాయాలు తెలియని కొంతమంది మాటలు విని ఎంతో కాలంగా రాముని సేవలో తరిస్తున్న తమను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘భద్రాద్రి రాముడిని రామనారాయణుడి’గానే ఇప్పటి వరకూ కొలుస్తూ వచ్చామని, అయితే ప్రస్తుత ఈఓ రఘునాథ్, ఎవరో ఫిర్యాదు ఇచ్చారనే కారణంతో తగిన పరిశీలన లేకుండానే తమకు చార్జిమెమోలు ఇవ్వటం ఎంత వరకూ సమంజసమన్నారు. ఆయన తీవ్రంగా అవమానపరిచారన్నారు. గతేడాది జరిగిన శ్రీరామనవమి వేడుకలలో మహాపట్టాభిషేక వేదిక మార్చాలంటూ తమ ఒత్తిడి తీసుకొచ్చారని, దీనిని వ్యతిరేకించినందుకు వేదపండితులపై, ఉద్యోగులపై కక్ష కట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
కొంతమంది సంప్రదాయ వ్యతిరేకుల మాట విని, వారి ప్రలోభాలకు గురై తమను వేధింపులకు గురిచేస్తున్నందున ఇక సహించలేక రోడ్డుకెక్కామని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మాడవీధుల విస్తరణలో ఇల్లు కోల్పోయిన రామభద్రాచార్యులు అనే పరిచారికకు కలెక్టర్ హామీతో ఉద్యోగం ఇచ్చినప్పటికీ, నేటి వరకు ఆయనకు సర్వీసు రిజిస్టర్‌ను ప్రారంభించలేదని, అతనికంటే వెనుక వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగికి అన్ని సౌకర్యాలను కల్పిస్తూ పక్షపాత బుద్ధిని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యాలయానికి చెందిన విషయాలలో సైతం అనవసరంగా ఉద్యోగులకు మెమోలు జారీ చేస్తూ వారిని మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆలయ ఏఈవో శ్రవణ్‌కుమార్ ఆరోపించారు.
ఈఓతో వాగ్వాదం
ఉదయం నుంచి ఆలయ ఉద్యోగులు ఆందోళన చేస్తుండగా...సాయంత్రానికి ఈఓ కార్యాలయానికి చేరుకున్నారు. టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు ఈఓతో చర్చించి.. ఉద్యోగులపై పనిభారం పెంచుతూ, ప్రశ్నించిన వారికి అక్రమంగా మెమోలను జారీ చేయటం సరైంది కాదన్నారు. వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరగా దీనిపై ఈవో ససేమిరా అన్నారు. అర్చకులకు జారీ చేసిన మెమోలను వెనక్కి తీసుకునేది లేదని, వాటికి వివరణ ఇవ్వాల్సిందేనన్నారు.
ఈ సమయంలో ఈఓ, వేదపండితుల మధ్య కొంతసేపు మాటల యుద్ధం కొనసాగింది. సహనం కోల్పోయిన ఈఓ రఘునాథ్ తనతో వాదనకు దిగిన వేదపండితులను నోరు మూసుకోవాలని హెచ్చరించారు. దీంతో వేదపండితులు సైతం ఘాటుగానే స్పందించారు. ఇరు పక్షాల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి చేయిదాటుతోందని గమనించిన టీజేఏసీ నాయకులు చల్లగుళ్ల నాగేశ్వరరావు కల్పించుకున్నారు. ఈఓ పంథాను మార్చుకోకపోతే ఉద్యోగులు ఇక్కడ పనిచేసే పరిస్థితి లేదని, దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
సహాయ నిరాకరణకు పిలుపు :
ఈఓ తీరుతో విసుగుచెందిన ఆలయ ఉద్యోగులు, వేదపండితులు సహాయ నిరాకరణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం కల్పించుకొని ఈఓపై తగిన చర్యలు తీసుకునేంత వరకూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని, పరిపాలన పరమైన పనులపై కూడా తగిన విచారణ జరిపించాలని ఆలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కె.నరసింహారాజు అన్నారు. ఆందోళన కార్యక్రమంలో ఆలయ వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, శ్రీనివాసరెడ్డి, నిరంజన్‌కుమార్, పోతుల శ్రీను, కత్తి శ్రీను, వెంకటప్పయ్య, కనకదుర్గ, నాగమణి, రామారావు, స్వర్ణ కుమారి, భాస్కర్, ఏఈ రవీందర్, టీజేఏసి నాయకులు వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, పూసం రవికమారి, ఐటీడీఏ రాంబాబు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.