ఎంతో మంది చూపు...
- భద్రాద్రి దేవస్థానం పాలక మండలిపై కసరత్తు
- దరఖాస్తుదారుల జాబితాపై పరిశీలన పూర్తి
- భద్రాచలం నుంచి తలపడుతున్న 27 మంది..
- బయటి జిల్లాల నుంచీ పోటీ..
- మంత్రి తుమ్మల ఆశీస్సుల కోసం యత్నాలు
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పాలక మండలి ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాలక మండలిలో చోటు కల్పించాలని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సమగ్ర వివరాలపై ఇప్పటికే పరిశీలన పూర్తయింది. దేవాదాయశాఖకు చెందిన ఓ ప్రత్యేక అధికారి అభ్యర్థుల వివరాలను సేకరించి, ఉన్నతాధికారులకు అందజేశారు. భద్రాచలం దేవస్థానం పాలక మండలి సభ్యులుగా ఎంపికయ్యేందుకు ఇలా రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలతో కూడిన జాబితా దేవాదాయశాఖ కమిషనర్‌కు చేరింది. విచారణ అనంతరం సిద్ధం చేసిన జాబితా నేడో రేపో దేవాదాయశాఖ నుంచి ప్రభుత్వానికి అందనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటారు. దసరాకు ముందే ప్రభుత్వం పాలక మండళ్లను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఆశావాహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
లోకల్ డిమాండ్
దేవస్థానం పాలకమండలిలో చోటు కల్పించాలని కోరుతూ భద్రాచలం నుంచి 27 దరఖాస్తులు అందారుు. గతంలో ట్రస్టుబోర్డు సభ్యులుగా పనిచేసిన వారితో పాటు వివిధ రంగాలకు చెందిన వారు, టీఆర్‌ఎస్ నేతలు దరఖాస్తు చేశారు. దేవస్థానం పాలక మండలిలో 9 మంది సభ్యులు ఉంటారు. ఇందులో ఒకరు చైర్మన్‌గా నియమితులవుతారు. వీరిలో దేవస్థానం ప్రధానార్చకుల్లో ఒకరిని నామినేటెడ్‌గా ఎంపిక చేయటం ఆనవారుుతీ. ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2011 నవంబర్‌లో భద్రాద్రి పాలక మండలిని నియమించారు. ఇది రెండేళ్ల పాటు కొనసాగింది. రాష్ట్ర విభజన జరిగాక ఇప్పటి వరకు పాలకమండలిని నియమించలేదు.
ఎవరిని వరించేనో..!
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో భద్రాచలం దేవస్థానం పాలకమండలిలో చోటు కోసం గట్టి పోటీనే ఉంది. చైర్మన్ పదవి కోసం భద్రాద్రి వాసులే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల పందేరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కు తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పాలక మండలి చైర్మన్ రేసులో భద్రాచలానికి చెందిన ఓ విద్యాసంస్థల అధినేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మంత్రి తుమ్మలకు నమ్మినబంటు కావడంతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఆయనకు ఒకింత ఎక్కువే కావడంతో అతని వైపు మొగ్గుచూపే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీనే ఉంది.
ఆదాయం పెరుగుతున్నా అభివృద్ధి లేదు..
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి ఏటేటా ఆదాయం పెరుగుతున్నా ఆ స్థారుులో అభివృద్ధి మాత్రం జరగటం లేదు. భక్తులిచ్చే కానుకులు, హుండీల ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆలయంలో ఉత్సవాల నిర్వహణ, ఉద్యోగులు, సిబ్బంది జీతాలకు చెల్లించాలి. దీనివల్ల ఆశించిన స్థాయిలో ఆలయాభివృద్ధి జరుగటం లేదు. దేవస్థానానికి పాలక మండలి ఉంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రాబట్టే అవకాశం ఉంది. దాతల నుంచి వివిధ రూపాల్లో పనులు చేయించుకునేందుకు ప్రయత్నాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. పాలకమండలి ఉంటే ప్రయోజనాలనేకమనే వాదన భక్తుల నుంచి వినిపిస్తోంది.