భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిర్వహించిన తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శనం వేడుకల్లో ఎప్పటిలాగే రెవెన్యూ అధికారులు పెత్తనం చెలాయించారు. వీవీఐపీ టికెట్లను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆలయ అధికారులకు కేవలం రూ.500, రూ.250 టికెట్లను మాత్రమే అమ్మకానికి ఇచ్చారు. ఈ వీవీఐపీ టికెట్లు కూడా సామాన్య భక్తులకు కాకుండా కేవలం పైరవీలు చేసిన వారికే దక్కాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉత్సవ ఖర్చులు మాత్రం కేవలం ఆలయానివే కాగా పెత్తనం రెవెన్యూ అధికారులు చెలాయించడం గమనార్హం.
శనివారం నిర్వహించిన ఉత్తర ద్వార దర్శనానికి పూర్తిగా టికెట్లు అమ్ముడుపోవడంతో రెవెన్యూ అధికారులు మరో అడుగు ముందుకేసి ఆలయ అధికారులకు సమాచారం లేకుండానే పాత టికెట్లపై సంతకాలు చేసి విక్రయించినట్లుగా తెలిసింది. వీవీఐపీ టికెట్లపై దేవస్థానానికి చెందిన హోలోగ్రాం ఉంటుంది. కానీ శనివారం ఇచ్చిన వీవీఐపీ టికెట్లపై మాత్రం ఈ హోలోగ్రాం లేకపోవడంతో విషయం బయటపడింది. దీనిపై ఆర్‌డీవో వెంకటేశ్వర్లును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా వీవీఐపి టికెట్లు అయిపోవడంతో పై అధికారుల అనుమతితో పాత టికెట్లపై సంతకం చేసి.. 20 టికెట్లను అమ్మినట్లుగా తెలిపారు.
రామాలయానికి ఆదాయం తెచ్చే క్రమంలోనే ఈ టికెట్లను విక్రయించామన్నారు. ఇదే విషయమై ఆలయ ఈవో ఎం.రఘునాథ్‌ను ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా... ఏ టికెట్లు విక్రయించాలన్నా, ముద్రించాలన్నా దేవస్థాన అధికారుల అనుమతి తప్పని సరని పేర్కొన్నారు. హోలోగ్రాం లేకుండా ఉన్న టికెట్లు చెల్లవన్నారు. హోలోగ్రాం లేకుండా టికెట్ల ఇచ్చిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. దీనిపై పూర్తివివరాలు తెలుసుకుంటానన్నారు.
భారమైన ‘ద్వార’ దర్శనం..
ఉత్తర ద్వార దర్శనం కోసం వచ్చిన వీవీఐపీలను రెండు సెక్టార్లగా విభజించారు. మొదటి సెక్టార్‌లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు 250 సీటింగ్ ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. వారి వెనుక భాగాన రూ.800 విలువ గల టికెట్లను 350 మంది వీవీఐపీల కోసం కేటాయించారు. కేవలం 350 మంది భక్తులకు మాత్రమే సరిపోయే ఈ సెక్టార్‌లో అదనంగా టికెట్లు విక్రయించడం వల్ల శనివారం ఉత్తరద్వార దర్శనానికి వచ్చిన వీవీఐపీ భక్తులు పలు ఇబ్బందులు పడ్డారు.
ఉత్తరద్వార దర్శనం తలుపులు తెరవక ముందే ఈ సెక్టార్ భక్తులతో నిండిపోయింది. వీవీఐపీల సెక్టార్‌లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన దారిలో పలువురు కూర్చుండి పోయారు. అధికారులు ముందస్తు ఆలోచన లేకుండా ఇలా అదనంగా టికెట్లను విక్రయించడం వల్లనే వీవీఐపీ భక్తులు ప్రశాంత దర్శనానికి నోచుకోలేదనే విమర్శలు వచ్చాయి.
ఉత్సవాల చరిత్రలో తొలిసారి
దేవస్థాన ఉత్సవాల చరిత్రలోనే ఇలా అదనంగా టికెట్లను ముద్రించి అమ్మటం ఈ ఏడాదే చోటుచేసుకుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. దేవస్థానం అధికారుల అనుమతి లేకుండా టికెట్లను అదనంగా ముద్రించి విక్రయించడం వివాదాస్పదమైంది. కేవలం ఉన్నతాధికారుల మెప్పు, ప్రజా ప్రతినిధుల ఆశీస్సులను పొందటం కోసమే రెవెన్యూ అధికారులు భక్తుల సౌకర్యాలను గాలికొదిలేశారనే విమర్శలు వచ్చాయి. కష్టం మాది..పెత్తనం రెవెన్యూ శాఖ వారిది అని ఇప్పటికే లోలోపల మదన పడుతున్న ఆలయ అధికారులకు...రెవెన్యూ అధికారుల పెత్తనం ‘పుండుమీద కారం చల్లినట్టయింది.’
‘రెవెన్యూ’ పెత్తనం
Published Sun, Jan 12 2014 4:27 AM | Last Updated on Tue, Nov 6 2018 6:01 PM
Advertisement
Advertisement