భద్రాచలం టౌన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పాలనా విభాగాలపై నూతన ఈఓ కూరాకుల జ్యోతి ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా అన్ని విభాగాల్లో నెలకొన్న వివాదాలు, ఆలయ అధికారుల నిర్లక్ష్యం తదితర సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ మూడు రోజులుగా ఆయా విభాగాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బకాయిదారులపై కఠిన వైఖరి....
ఆలయ అభివృద్ధిపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా రాముడి ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. ఈ మేరకు దేవస్థానానికి బకాయిలు ఉన్న వారి వివరాలు తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. విస్తా కాంప్లెక్స్, కొబ్చరి కాయలు దుకాణాలు, కొబ్బరి చిప్పలు, కళ్యాణకట్ట, ఫొటోగ్రాఫర్స్ వద్ద నుంచి మూడు సంవత్సరాలుగా సుమారు రూ. 1.20 కోట్లు రావాల్సి ఉన్నట్లు ఆమె గుర్తించారు. ఈ మేరకు ఆమె సోమవారం వారందరిని పిలిచి తక్షణమే ఆ బకాయిలను చెల్లించాలని, లేకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఈ మేరకు వారిపై కఠిన వైఖరి అనుసరిస్తూనే బకాయిల వసూలు ద్వారా ఆలయ అభివృద్ధి సాధ్యం అవుతుందని వారికి వివరిస్తున్నారు. అలాగే దేవస్థాన ఉపాలయాలను ఆదివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సందర్భంలో అక్కడ విధుల్లో ఉండాల్సిన అర్చకులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు అర్చకులు, ఉద్యోగులు సకాలంలో హాజరై తమ విధులను నిర్వర్తించాల్సిందేనని, విధుల్లో ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా, అమర్యాదగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సిబ్బంది విధులకు తప్పకుండా తెల్లని వస్త్రాలతో రావాల్సిందేనని, డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు.
కమిషనర్ ఆర్డర్లు లేకుండా పనులా...?
దేవస్థానం పరిధిలో నిర్వహించే పలు పనులకు కమిషనర్ ఆర్డర్లు కూడా లేవని ఆమె పరిశీలనలో తేలింది. దీంతో ఆమె సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం టెండర్లు జరిగి కమిషనర్ నుంచి ఆర్డర్లు అందిన తర్వాతే చేపట్టాల్సిన పనులు ఇమేమీ లేకుండానే చేయడం పట్ల ఈఓ జ్యోతి విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆమె ఉన్నతాధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది.
అదేవిధంగా సీఆర్‌వో కార్యాలయంలో భక్తుల కోసం వసతి గృహాల ఖాళీ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలని, ఆ మేరకు బోర్డును సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇలా ఆలయంలోని పలు విభాగాలపై విడివిడిగా చర్చిస్తునే ఆలయ అభివృద్ధికు తీసుకోవల్సిన సూచనలను అందచేస్తూ ఈఓ జ్యోతి తనదైన మార్కును చూపించటానికి ప్రయత్నిస్తున్నారు.
పాలన గాడిలో పడేనా..?
Published Tue, Sep 30 2014 2:08 AM | Last Updated on Tue, Nov 6 2018 6:01 PM
Advertisement