Kurakula Jyothi
-
రాములోరి పెళ్లికి ఏర్పాట్లు ఇలాగేనా..!
దేవస్థానం ఈఓకు మంత్రి తుమ్మల క్లాస్ సరెండర్ చేయాలంటూ ఆదేశం భద్రాచలం : భద్రాచలం దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. శ్రీరామనవమికి చేస్తున్న ఏర్పాట్లపై మంగళవారం ఆయన జిల్లా అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి వారి పెళ్లి వేడుక జరిగే మిథిలా ప్రాంగణాన్ని పరిశీలించారు. కల్యాణ మండపం వద్ద పందిళ్లను సరిగా వేయకపోవడాన్ని గుర్తించారు. ఆయన దీనిపై ఈఓ జ్యోతిని వివరణ కోరారు. ఆ పనులు చేసే కాంట్రాక్టర్ ఎవరంటూ పిలిపించి అతడిని మందలించారు. ‘‘ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రాములోరి పెళ్లికి ఏర్పాట్లు చేసేది ఇలాగేనా..? నీకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవా..? నువ్వు ఉద్యోగం చేయడానికేవచ్చావా తల్లీ... పుష్కరాల నుంచీ చెబుతున్నా... నీ పద్ధతి మార్చుకోవా..నీకు చెప్పిందేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి అంటూ ఈఓ జ్యోతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది మిథిలా ప్రాంగణమా అనుకున్నారా..? పందుల గుడిసెలు అనుకున్నావా..? రామయ్యకు ఎంత ప్రతిష్ట ఉందో తెలిసి కూడా ఇలా ఏర్పాట్లు చేయటం సరైంది కాదన్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేదానిపై మీరు అసలు తిరుగుతున్నారా..అంటూ’’ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ గారూ వీరిద్దరినీ సరెండర్ చేయండి అంటూ దేవస్థానం ఈఓ జ్యోతితో పాటు డీఈపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరి వల్ల కాదుకానీ,ఈ రెండు రోజులు భద్రాచలంలోనే ఉండి మీరే ఏర్పాట్లన్నీ చూసుకోవాలని కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు సూచించారు. మిథిలా స్టేడియం ప్రాంగణంలో పందిళ్లు సరిగా వేయలేదని, గాలీ,వెలుతురు వచ్చేలా తగిన రీతిలో అమర్చాలన్నారు. శ్రీసీతారాముల వారి పెళ్లి వేడుకల ఏర్పాట్లు చూసేందుకని వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవస్థానం అధికారులను, అందులోనూ ఈఓ జ్యోతిపైనే తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలను వ్యక్తం చేయటం సర్వత్రా చర్చకు దారితీసింది. ఉత్సవాలకు మరో రెండు రోజులు గడువు ఉందనగా, ఈ పరిణామాలు చోటుచేసుకోవటంతో జిల్లా అధికారుల్లో దీనిపైనే చర్చసాగుతోంది. -
ముక్కోటి ఆదాయం 41.42 లక్షలు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి ఈ నెల 1న జరిగిన వైకుంఠ ఏకాదశి(ఉత్తర ద్వారదర్శనం) సందర్భంగా రూ.41,42,925 ఆదాయం వచ్చినట్లు ఈవో కూరాకుల జ్యోతి తెలిపారు. టికెట్ల ద్వారా రూ.21,56,500, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.4,33,400, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.15,53,025 వచ్చాయని వివరించారు. -
సంస్కరణల పర్వం
‘సాక్షి’తో రామాలయం ఈవో కూరాకుల జ్యోతి భద్రాద్రి శ్రీ సీతారామ చంద్రస్వామివారి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. దీన్ని కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. ఆలయ ఈవోగా అభివృద్ధే నా తొలి కర్తవ్యం. ఆలయాభివృద్ధిలో భాగంగా అనేక సంస్కరణలను చేపట్టాలని నిర్ణయించాం. ఇవి ఎక్కడా భక్తులకు ఇబ్బంది కలిగించకుండా చూస్తాం. ఆలయాభివృద్ధిలో భాగంగా రూ.50 వేలకు పైగా విరాళం ఇచ్చిన దాతలను సన్మానించాలని నిర్ణయించాం. లడ్డూ ప్రసాదాల ద్వారా ఆలయానికి ఏటా రూ.కోటికి పైగా నష్టం వస్తున్నా సామాన్యభక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వీటి ధరలను పెంచొద్దని నిర్ణయించుకు న్నాం. ఆలయాభివృద్ధి, దేవుని సేవల విషయంలో రాజీపడొద్దనేది నా ధ్యేయం. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి రామాలయంలో సంస్కరణల పర్వానికి తెరదీయనున్నట్లు శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (ఈవో) కూరాకుల జ్యోతి వెల్లడించారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆలయ విశిష్టతను చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాభివృద్ధికి తగిన కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ‘సాక్షి’ ప్రతినిధితో మంగళవారం ఆమె మాట్లాడారు. ఆలయాభివృద్ధే ధ్యేయం ‘ఆలయాభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. దాతలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నాం. రూ.50వేలకు పైగా విరాళం ఇచ్చిన దాతలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం. వారిని ప్రత్యేకంగా సన్మానిస్తాం. ఎంతో ప్రాశ్యస్తి ఉన్న రామాలయం తెలంగాణలోని ఇతర దేవాలయాలతో పోలిస్తే ఆదాయపరంగా కొంత వెనుకబడి ఉంది. దేవాలయంలో మరిన్ని సేవలందించడం కోసం కార్యాచరణ రూపొందిస్తున్నాం. సామాన్య భక్తులపై భారం పడకుండా చూస్తాం. దేవాలయంలో ప్రతిరోజు నిర్వహించే అభిషేకం టికెట్ ధరలను పెంచాలని భావిస్తున్నాం. ప్రస్తుతం రూ.500 ఉన్న అభిషేకం టికెట్ ధరను రూ.1,100లకు పెంచే యోచనలో ఉన్నాం. త్వరలో దీన్ని కార్యరూపంలోకి తీసుకొస్తాం. అంతరాలయంలో సేవా టికెట్ ధరలనూ పెంచాలని భావిస్తున్నాం. దీన్ని రూ.50 నుంచి రూ.100కు పెంచాలని భావిస్తున్నాం. నదీ హరతిని ఘనంగా నిర్వహిస్తాం.. కార్తీకమాసాన్ని పురస్కరించుకొని వచ్చేనెల 6, 13 తేదీల్లో గోదావరి నదీ హరతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తాం. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. డిసెంబర్లో వైకుంఠ ఏకాదశి, వచ్చే ఏడాది జూలైలో గోదావరి గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాం. ఈ ఉత్సవాల సందర్భంలో భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. పుష్కరాలకు వచ్చే భక్తులకు వసతులు కల్పించేందుకు ఇప్పటికే రూ.15 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రణాళికలు పంపించాం. నష్టం వస్తున్నప్పటికీ ప్రసాదం ధరలు పెంచం.. దేవాలయం సమకూరుస్తున్న లడ్డూ ప్రసాదాలతో నష్టం వస్తున్నప్పటికీ భక్తుల మనోభావాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో వీటి ధరలను పెంచొద్దని నిర్ణయించాం. ప్రస్తుతం రూ.10కి లడ్డూ విక్రయిస్తున్నాం. దీనివల్ల ఆలయానికి ఏడాదికి రూ.కోటికి పైగా నష్టం వస్తుంది. అయినప్పటికీ భక్తులకు అందుబాటులో ఉంచేందుకు ప్రసాదం ధరలు పెంచొద్దని నిర్ణయించాం. ఈ ప్రసాదం తయారీ, విక్రయం ద్వారా వచ్చే నష్టాన్ని పూడ్చుకోవడానికి వేములవాడ తరహాలో లడ్డూ పరిమాణాన్ని 100 గ్రాముల నుంచి 80 గ్రాములకు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. దీనిపై ఉన్నతాధికారులతోనూ చర్చించాం. రామాలయ విశిష్టతను కాపాడుకుందాం.. ఎంతో ప్రాశ్యస్తి, చరిత్ర ఉన్న రామాలయ విశిష్టతను కాపాడుకుందాం. నా తొలి ప్రాధాన్యం దేవునికే. స్వయంగా వెలిసిన రాముడికి, భద్రాద్రి గుడికి విశిష్ట నేపథ్యం ఉంది. దీన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉంది. దీనికోసం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తాం. రామాలయ ప్రాశ్యస్తిని భక్తులకు అందుబాటులో ఉంచేందుకు శ్రీ రాముని చరిత్రను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో పుస్తకరూపంలో తీసుకొస్తాం. ఆలయ పవిత్రత, విశిష్టతను కాపాడేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికే చేపడుతున్నాం. -
పాలన గాడిలో పడేనా..?
భద్రాచలం టౌన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పాలనా విభాగాలపై నూతన ఈఓ కూరాకుల జ్యోతి ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా అన్ని విభాగాల్లో నెలకొన్న వివాదాలు, ఆలయ అధికారుల నిర్లక్ష్యం తదితర సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ మూడు రోజులుగా ఆయా విభాగాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బకాయిదారులపై కఠిన వైఖరి.... ఆలయ అభివృద్ధిపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా రాముడి ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. ఈ మేరకు దేవస్థానానికి బకాయిలు ఉన్న వారి వివరాలు తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. విస్తా కాంప్లెక్స్, కొబ్చరి కాయలు దుకాణాలు, కొబ్బరి చిప్పలు, కళ్యాణకట్ట, ఫొటోగ్రాఫర్స్ వద్ద నుంచి మూడు సంవత్సరాలుగా సుమారు రూ. 1.20 కోట్లు రావాల్సి ఉన్నట్లు ఆమె గుర్తించారు. ఈ మేరకు ఆమె సోమవారం వారందరిని పిలిచి తక్షణమే ఆ బకాయిలను చెల్లించాలని, లేకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు వారిపై కఠిన వైఖరి అనుసరిస్తూనే బకాయిల వసూలు ద్వారా ఆలయ అభివృద్ధి సాధ్యం అవుతుందని వారికి వివరిస్తున్నారు. అలాగే దేవస్థాన ఉపాలయాలను ఆదివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సందర్భంలో అక్కడ విధుల్లో ఉండాల్సిన అర్చకులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు అర్చకులు, ఉద్యోగులు సకాలంలో హాజరై తమ విధులను నిర్వర్తించాల్సిందేనని, విధుల్లో ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా, అమర్యాదగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సిబ్బంది విధులకు తప్పకుండా తెల్లని వస్త్రాలతో రావాల్సిందేనని, డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. కమిషనర్ ఆర్డర్లు లేకుండా పనులా...? దేవస్థానం పరిధిలో నిర్వహించే పలు పనులకు కమిషనర్ ఆర్డర్లు కూడా లేవని ఆమె పరిశీలనలో తేలింది. దీంతో ఆమె సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం టెండర్లు జరిగి కమిషనర్ నుంచి ఆర్డర్లు అందిన తర్వాతే చేపట్టాల్సిన పనులు ఇమేమీ లేకుండానే చేయడం పట్ల ఈఓ జ్యోతి విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆమె ఉన్నతాధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది. అదేవిధంగా సీఆర్వో కార్యాలయంలో భక్తుల కోసం వసతి గృహాల ఖాళీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని, ఆ మేరకు బోర్డును సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇలా ఆలయంలోని పలు విభాగాలపై విడివిడిగా చర్చిస్తునే ఆలయ అభివృద్ధికు తీసుకోవల్సిన సూచనలను అందచేస్తూ ఈఓ జ్యోతి తనదైన మార్కును చూపించటానికి ప్రయత్నిస్తున్నారు. -
జ్యోతి పట్టు వీడేనా..?
భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన ఈఓగా కూరాకుల జ్యోతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా నేటి వరకు ఆమె బాధ్యతలు స్వీకరించలేదు. భద్రాచలం వచ్చేందుకు ఆమె సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ‘పట్టు విడవకుండా’ ఆమె హైదరాబాద్‌లోనే ఉండేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో దేవాదాయశాఖలో మొన్నటి వరకు ఇన్చార్జ్ కమిషనర్‌గా, విజిలెన్స్ అధికారిణిగా ఉన్నతస్థాయి విధులు నిర్వహించిన ఆమెను ఆర్జేసీ కేడర్‌లో ఉన్న భద్రాచలం దేవస్థానం ఈఓగా బదిలీ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. అదీకాక అవినీతి ఆరోపణలతో పనిస్మెంట్గా ఆమెను భద్రాచలం బదిలీ చేసినట్లు ప్రచారం జరుగున్న నేపథ్యంలో ఇక్కడ విధుల్లో చేరేందుకు ఆమె సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. భద్రాచలం ఈఓగా బాధ్యతలు స్వీకరిస్తే ఆ తప్పులు ఒప్పుకున్నట్లు ఉంటుందని భావించిన ఆమె ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడడం లేదని, అవసరమైతే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరోపక్క తాను పని చేసిన ఇన్చార్జ్ కమిషనర్ పోస్టులో తెలంగాణకు చెందిన తనను కాదని ఆంధ్రకు చెందిన మహిళా అధికారిణిని నియమించడంతో ఆమె మరింత పట్టు పట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం, ఉన్నతాధికారులు భద్రాచలం వెళ్లేలా జ్యోతిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఆలయంలో పట్టు తప్పిన పాలన.. కొద్ది సంవత్సరాలుగా దేవస్థాన పరిపాలన అస్తవ్యస్తంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆలయ బాధ్యతలు స్వీకరించిన ఈఓలు కుటుంబాలతో ఇక్కడ ఉండకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో వారంలో కొద్ది రోజులు మాత్రమే సిబ్బందికి, భక్తులకు అందుబాటులో ఉంటున్నారు. దీనిని అలుసుగా తీసుకున్న కొంతమంది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆజాద్ ఈఓగా పనిచేసి వెళ్లిన తర్వాత వచ్చిన రామచంద్రమోహన్, బద్రినారాయణాచార్యులు, రఘునాథ్, ప్రస్తుతం ఇన్చార్జ్ ఈఓగా పని చేస్తున్న రమేష్‌బాబులు కూడా ఇక్కడ నివసించడం లేదు. ప్రస్తుతం ఇన్చార్జ్ ఈఓగా పని చేస్తున్న రమేష్‌బాబు వరంగల్ దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తూ ఉండడంతో రామాలయంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదు. భక్తులకు, వీఐపీలకు, సిబ్బందికి అందుబాటులో లేకపోవడంతో దాని ప్రభావం పాలనపై పడుతోంది. దీనికి తోడు వచ్చిన ప్రతీ ఈఓ కూడా తనకు అనుకూలంగా ఉండేలా సిబ్బందిని మారుస్తున్నారు. దీంతో ఏ ఒక్క ఉద్యోగి కూడా ఒక్కో శాఖలో పూర్తిగా నాలుగు నెలలు కూడా పని చేయడం లేదు. దీని వల్ల సిబ్బంది కూడా ఏ శాఖపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పుష్కర ఏర్పాట్లపై ప్రభావం.. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూలై నెలలో జరుగనున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగనున్న ఈ పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుంభమేళాస్థాయిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పుష్కరాలకు ఇతర ప్రాంతాల కంటే భద్రాచలానికి అత్యధికంగా కోటిన్నర మంది వరకు వస్తారనే అంచనాతో అధికారులు ఉన్నారు. ఈ మేరకు కలెర్టర్ శ్రీనివాస శ్రీనరేష్, జేసీ సురేంద్రమోహన్‌లు ఇటీవల భద్రాచలంలో సమీక్ష ఏర్పాటు చేసి ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధం చేసి అందజేయాలని ఆదేశించారు. ఈ పనులలో సింహభాగం బాధ్యత దేవస్థాన అధికారుల మీదే ఉంటుంది. అయితే ఈ ప్రణాళికలు, తదితర పనులను రామాలయ ఈఓ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఈఓ రమేష్‌బాబు దేవాదాయ శాఖ డీసీగా బాధ్యతలు నిర్వహిస్తుండడంతో పూర్తిస్థాయిలో ఇటు దృష్టిసారించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు, అధికారులను పర్యవేక్షిస్తూ ఆలయ పాలనను గాడిలో పెట్టేందుకు పూర్తిస్థాయిలో విధులు నిర్వహించేందుకు ఈఓ అవసరం. అందుకు ఆర్జేసీ క్యాడర్లో ఉన్న అధికారి ఈఓగా రాకపోతే ఆ ప్రభావం పుష్కరాలపై పడుతుందని పలువురు పేర్కొంటున్నారు.