సంస్కరణల పర్వం
‘సాక్షి’తో రామాలయం ఈవో కూరాకుల జ్యోతి
భద్రాద్రి శ్రీ సీతారామ చంద్రస్వామివారి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. దీన్ని కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. ఆలయ ఈవోగా అభివృద్ధే నా తొలి కర్తవ్యం. ఆలయాభివృద్ధిలో భాగంగా అనేక సంస్కరణలను చేపట్టాలని నిర్ణయించాం. ఇవి ఎక్కడా భక్తులకు ఇబ్బంది కలిగించకుండా చూస్తాం. ఆలయాభివృద్ధిలో భాగంగా రూ.50 వేలకు పైగా విరాళం ఇచ్చిన దాతలను సన్మానించాలని నిర్ణయించాం. లడ్డూ ప్రసాదాల ద్వారా ఆలయానికి ఏటా రూ.కోటికి పైగా నష్టం వస్తున్నా సామాన్యభక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వీటి ధరలను పెంచొద్దని నిర్ణయించుకు న్నాం. ఆలయాభివృద్ధి, దేవుని సేవల విషయంలో రాజీపడొద్దనేది నా ధ్యేయం.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి రామాలయంలో సంస్కరణల పర్వానికి తెరదీయనున్నట్లు శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (ఈవో) కూరాకుల జ్యోతి వెల్లడించారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆలయ విశిష్టతను చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాభివృద్ధికి తగిన కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ‘సాక్షి’ ప్రతినిధితో మంగళవారం ఆమె మాట్లాడారు.
ఆలయాభివృద్ధే ధ్యేయం
‘ఆలయాభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. దాతలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నాం. రూ.50వేలకు పైగా విరాళం ఇచ్చిన దాతలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం. వారిని ప్రత్యేకంగా సన్మానిస్తాం. ఎంతో ప్రాశ్యస్తి ఉన్న రామాలయం తెలంగాణలోని ఇతర దేవాలయాలతో పోలిస్తే ఆదాయపరంగా కొంత వెనుకబడి ఉంది. దేవాలయంలో మరిన్ని సేవలందించడం కోసం కార్యాచరణ రూపొందిస్తున్నాం.
సామాన్య భక్తులపై భారం పడకుండా చూస్తాం. దేవాలయంలో ప్రతిరోజు నిర్వహించే అభిషేకం టికెట్ ధరలను పెంచాలని భావిస్తున్నాం. ప్రస్తుతం రూ.500 ఉన్న అభిషేకం టికెట్ ధరను రూ.1,100లకు పెంచే యోచనలో ఉన్నాం. త్వరలో దీన్ని కార్యరూపంలోకి తీసుకొస్తాం. అంతరాలయంలో సేవా టికెట్ ధరలనూ పెంచాలని భావిస్తున్నాం. దీన్ని రూ.50 నుంచి రూ.100కు పెంచాలని భావిస్తున్నాం.
నదీ హరతిని ఘనంగా నిర్వహిస్తాం..
కార్తీకమాసాన్ని పురస్కరించుకొని వచ్చేనెల 6, 13 తేదీల్లో గోదావరి నదీ హరతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తాం. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. డిసెంబర్‌లో వైకుంఠ ఏకాదశి, వచ్చే ఏడాది జూలైలో గోదావరి గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాం. ఈ ఉత్సవాల సందర్భంలో భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. పుష్కరాలకు వచ్చే భక్తులకు వసతులు కల్పించేందుకు ఇప్పటికే రూ.15 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రణాళికలు పంపించాం.
నష్టం వస్తున్నప్పటికీ ప్రసాదం ధరలు పెంచం..
దేవాలయం సమకూరుస్తున్న లడ్డూ ప్రసాదాలతో నష్టం వస్తున్నప్పటికీ భక్తుల మనోభావాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో వీటి ధరలను పెంచొద్దని నిర్ణయించాం. ప్రస్తుతం రూ.10కి లడ్డూ విక్రయిస్తున్నాం. దీనివల్ల ఆలయానికి ఏడాదికి రూ.కోటికి పైగా నష్టం వస్తుంది. అయినప్పటికీ భక్తులకు అందుబాటులో ఉంచేందుకు ప్రసాదం ధరలు పెంచొద్దని నిర్ణయించాం. ఈ ప్రసాదం తయారీ, విక్రయం ద్వారా వచ్చే నష్టాన్ని పూడ్చుకోవడానికి వేములవాడ తరహాలో లడ్డూ పరిమాణాన్ని 100 గ్రాముల నుంచి 80 గ్రాములకు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. దీనిపై ఉన్నతాధికారులతోనూ చర్చించాం.
రామాలయ విశిష్టతను కాపాడుకుందాం..
ఎంతో ప్రాశ్యస్తి, చరిత్ర ఉన్న రామాలయ విశిష్టతను కాపాడుకుందాం. నా తొలి ప్రాధాన్యం దేవునికే. స్వయంగా వెలిసిన రాముడికి, భద్రాద్రి గుడికి విశిష్ట నేపథ్యం ఉంది. దీన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉంది. దీనికోసం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తాం. రామాలయ ప్రాశ్యస్తిని భక్తులకు అందుబాటులో ఉంచేందుకు శ్రీ రాముని చరిత్రను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో పుస్తకరూపంలో తీసుకొస్తాం. ఆలయ పవిత్రత, విశిష్టతను కాపాడేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికే చేపడుతున్నాం.