రాములోరి పెళ్లికి ఏర్పాట్లు ఇలాగేనా..!
దేవస్థానం ఈఓకు మంత్రి తుమ్మల క్లాస్
సరెండర్ చేయాలంటూ ఆదేశం
భద్రాచలం : భద్రాచలం దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. శ్రీరామనవమికి చేస్తున్న ఏర్పాట్లపై మంగళవారం ఆయన జిల్లా అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి వారి పెళ్లి వేడుక జరిగే మిథిలా ప్రాంగణాన్ని పరిశీలించారు. కల్యాణ మండపం వద్ద పందిళ్లను సరిగా వేయకపోవడాన్ని గుర్తించారు. ఆయన దీనిపై ఈఓ జ్యోతిని వివరణ కోరారు.
ఆ పనులు చేసే కాంట్రాక్టర్ ఎవరంటూ పిలిపించి అతడిని మందలించారు. ‘‘ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రాములోరి పెళ్లికి ఏర్పాట్లు చేసేది ఇలాగేనా..? నీకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవా..? నువ్వు ఉద్యోగం చేయడానికేవచ్చావా తల్లీ... పుష్కరాల నుంచీ చెబుతున్నా... నీ పద్ధతి మార్చుకోవా..నీకు చెప్పిందేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి అంటూ ఈఓ జ్యోతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది మిథిలా ప్రాంగణమా అనుకున్నారా..? పందుల గుడిసెలు అనుకున్నావా..? రామయ్యకు ఎంత ప్రతిష్ట ఉందో తెలిసి కూడా ఇలా ఏర్పాట్లు చేయటం సరైంది కాదన్నారు.
ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేదానిపై మీరు అసలు తిరుగుతున్నారా..అంటూ’’ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ గారూ వీరిద్దరినీ సరెండర్ చేయండి అంటూ దేవస్థానం ఈఓ జ్యోతితో పాటు డీఈపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరి వల్ల కాదుకానీ,ఈ రెండు రోజులు భద్రాచలంలోనే ఉండి మీరే ఏర్పాట్లన్నీ చూసుకోవాలని కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు సూచించారు. మిథిలా స్టేడియం ప్రాంగణంలో పందిళ్లు సరిగా వేయలేదని, గాలీ,వెలుతురు వచ్చేలా తగిన రీతిలో అమర్చాలన్నారు.
శ్రీసీతారాముల వారి పెళ్లి వేడుకల ఏర్పాట్లు చూసేందుకని వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవస్థానం అధికారులను, అందులోనూ ఈఓ జ్యోతిపైనే తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలను వ్యక్తం చేయటం సర్వత్రా చర్చకు దారితీసింది. ఉత్సవాలకు మరో రెండు రోజులు గడువు ఉందనగా, ఈ పరిణామాలు చోటుచేసుకోవటంతో జిల్లా అధికారుల్లో దీనిపైనే చర్చసాగుతోంది.