మే నెలాఖరుకల్లా ‘సీతారామ’ పనులు పూర్తవ్వాలి | Tummala Nageswara Rao: speed up sitarama project works | Sakshi
Sakshi News home page

మే నెలాఖరుకల్లా ‘సీతారామ’ పనులు పూర్తవ్వాలి

Published Mon, Jan 8 2024 2:57 AM | Last Updated on Mon, Jan 8 2024 2:57 AM

Tummala Nageswara Rao: speed up sitarama project works - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీతారామ ప్రాజెకు కింద కాలువల పనులను మే నాటికి పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఆదివారం మంత్రి ఉత్తమ్‌ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో సీతారామ ప్రాజెక్టు పురోగతి, చేపట్టాల్సిన పనులపై మంత్రి తుమ్మల పలు సూచనలు చేశారు.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సాగునీరు అందించడానికి చేపట్టిన సీతారామ ప్రాజెక్టుపై సుదీర్ఘంగా ఉత్తమ్‌తో కలిసి సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న సీతారామ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. పనుల్లో వేగం పెంచితే ఈ ఏడాదిలోనే వైరా ప్రాజెక్టు, లంకా సాగర్, ఎన్నెస్పీ ఆయకట్టులోని సుమారు 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. ప్రాజెక్టుపై సుమారు రూ. 7,500 కోట్లు ఖర్చు చేశారని, మూడు పంప్‌హౌస్‌లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు.

టెండర్లు పూర్తి చేయాలి..
రూ. 70 కోట్లతో ఏన్కూరు వద్ద లింకు కెనాల్‌ పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు వేగంగా చేపట్టాలని మంత్రి తుమ్మల సూచించారు. ఈ పనులు పూర్తి చేస్తే వచ్చే సీజన్‌లోనే వైరా ప్రాజెక్టు, లంకసాగర్, బేతుపల్లి పరిధిలో ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. ఇటీవల గండుగులపల్లిలో జరిగిన సమావేశంలో సమీక్షించిన అంశాలను ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌ దృష్టికి మంత్రి తుమ్మల తీసుకెళ్లగా సంబంధిత పనులను దశలవారీగా ప్రాధాన్యతను బట్టి పూర్తిచేసి మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఉత్తమ్‌ అధికారులను ఆదేశించారు.

యాతాలకుంట భూసేకరణ త్వరగా తేలిస్తే కెనాల్‌ కింద నీరు ఇవ్వొచ్చన్నారు. ఈ పనులు పూర్తయితే సీతారామ ద్వారా ఎన్నెస్పీ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. సత్తుపల్లి ట్రంకు కెనాల్‌కు సంబంధించి భూసేకరణకు చెల్లించాల్సిన రూ. 12 కోట్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పాలేరు టన్నెల్‌ నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పై పనులన్నీ పూర్తి చేస్తే వైరా రిజర్వాయర్‌ కింద 1.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement