ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల పనుల్లో నిబంధనల ఉల్లంఘన
రూ. 1,842 కోట్లకు పిలిచిన టెండర్లలో రూ. 1,074 కోట్ల పనులకు అనుమతుల్లేని వైనం
వివాదాస్పదంగా ప్రాజెక్టు అధికారుల తీరు.. సమీక్షలో మంత్రి ఉత్తమ్ ఆగ్రహం?
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పరిపాలనా అనుమతుల్లేకుండానే సుమారు రూ. 1,074 కోట్ల అంచనా వ్యయంతో డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు ప్రాజెక్టు అధికారులు టెండర్లను ఆహ్వానించడం నీటిపారుదల శాఖలో వివాదస్పదంగా మారింది. సెపె్టంబర్ 28 నుంచి అక్టోబర్ 5 మధ్య ఏడు పనులకు రూ. 1,842 కోట్ల అంచనాతో నీటిపారుదల శాఖ టెండర్లను ఆహ్వానించింది. అయితే వాటిలో సుమారు రూ. 768 కోట్లు విలువ చేసే పనులకే ఆర్థిక శాఖ ఆమోదం తెలపగా ఆ మేరకు నీటిపారుదల శాఖ పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
మిగిలిన రూ. 1,074 కోట్ల పనులకు ఆమోదం తెలపడంపై నిర్ణయాన్ని ఆర్థిక శాఖ పెండింగ్‌లో ఉంచింది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులకు ప్రాజెక్టు అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు శనివారం చేపట్టిన సమీక్షలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. పరిపాలనా అనుమతుల్లేకుండానే టెండర్లు పిలిచి ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టించారని సంబంధిత చీఫ్ ఇంజనీర్‌పై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
గతంలో మంత్రులు నిర్వహించిన ఓ సమీక్షలో వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించగా.. ప్రాజెక్టు అధికారులు అనుమతులు పొందకుండానే తొందరపాటుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రభుత్వం సత్వరమే టెండర్లు పిలవాలని ఆదేశిస్తే దానర్థం అనుమతుల్లేకుండానే టెండర్లు ఆహ్వానించాలని కాదని, అనుమతులన్నీ తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని ఉన్నతాధికారులు అంటున్నారు.
అనుమతులు రాకుంటే ఏం చేస్తారు?
అన్ని ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖల ఈఎన్‌సీలు/చీఫ్ ఇంజనీర్లతో కూడిన కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) కమిటీ ఆమోదించాకే రూ. 10 కోట్లు, ఆపై విలువగల పనుల టెండర్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. పనులకు అన్ని రకాల అనుమతులు ఉంటేనే సీఓటీ కమిటీ టెండర్లను ఆమోదిస్తుంది. అనుమతుల ఉత్తర్వుల్లో పేర్కొన్న పదాల్లో స్వల్ప తేడాలున్నా మళ్లీ కొత్త ఉత్తర్వులతో వస్తేనే ఆమోదముద్ర వేస్తుంది.
ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టు డి్రస్టిబ్యూటరీలకు సంబంధించిన ఆరు టెండర్లకు బిడ్ల దాఖలు గడువు ఈ నెల 8తో ముగియనుండగా మరో టెండర్ గడువు 4తో ముగియనుంది. ఆ తర్వాత ఈ బిడ్లను సీఓటీ కమిటీ పరిశీలించి ఆమోదించాల్సి ఉంది. అయితే అనుమతుల్లేకుండానే టెండర్లు జారీ కావడంతో సీఓటీ కమిటీ నుంచి వాటికి ఆమోదం లభించే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఒకవేళ అనుమతులు లభించకపోతే టెండర్లను రద్దు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. కాగా, టెండర్లను ఆహ్వానించిన తర్వాత అనుమతుల్లేని పనులకు ర్యాటిఫికేషన్ (క్రమబద్ధీకరణ అనుమతులు) జారీ చేయాలని కోరుతూ నీటిపారుదల శాఖకు ప్రాజెక్టు అధికారులు విజ్ఞప్తి చేయగా అంచనాలను సమర్పించాలని నీటిపారుదల శాఖ ఆదేశించింది.
ఇప్పటికే సీతారామపై వివాదాలు...
సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ. 7,926.14 కోట్ల అంచనాతో 2016 ఫిబ్రవరి 18న ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చిoది. ఆ తర్వాత 2018 ఆగస్టులో రూ. 13,057 కోట్లకు అంచనాలను పెంచింది. ఈ ప్రాజెక్టు కింద 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పంప్‌హౌస్‌ల పనులు పూర్తవగా డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులు జరగాల్సి ఉంది.
గత ప్రభుత్వ హయాంలో ఈ పనుల అంచనాలను భారీగా పెంచారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే సమయంలో పరిపాలనా అనుమతుల్లేకుండానే అధికారులు టెండర్లను నిర్వహిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ అంశంపై ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment