15న సీఎం చేతుల మీదుగా మూడు పంపుహౌస్‌ల ప్రారంభం
అదే రోజు వైరాలో బహిరంగ సభ
ప్రాజెక్టుపై సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టు డీపీఆర్‌కు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులతో పాటు పర్యావరణ అనుమతులను సాధించే పనులను వేగిరం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 67 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి అనుమతి కోరుతూ గతంలో సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ను సమర్పించగా, ఇటీవల గోదావరి బోర్డు ఆమోదం కోసం ఆ డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ పంపించిందని గుర్తు చేశారు.
ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియ చివరి దశకు చేరుకుందన్నారు. పర్యావరణ అనుమతుల విషయంలో సుప్రీంకోర్టులో పెండింగ్ కేసును సత్వరంగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, పర్యావరణ అనుమతులు పొందడానికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టుపై శనివారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన మూడు పంప్‌హౌస్‌లను సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలో మూడు పంప్‌హౌస్‌లకు ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించనున్నామని వెల్లడించారు. అనంతరం ఖమ్మం జిల్లా వైరాలో భారీ బహింగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు మిగులు పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని కోరారు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద కాల్వల నిర్మాణం ఆగి పోకుండా రైల్వే శాఖతో చర్చించి అనుమతులు పొందాలని ఆదేశించారు. ప్యాకేజ్– 1,2 పనులకు అవసరమైన 3,000 ఎకరాల భూసేకరణను సత్వరంగా పూర్తి చేస్తే నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయవచ్చు అన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా 2.60 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్‌సీ (జనరల్) అనిల్‌కుమార్, డిప్యూటీ ఈఎన్‌సీ కె.శ్రీనివాస్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment