వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళిక
పదిహేను రోజుల్లో సీతారామ ఎత్తిపోతలకు అన్ని అనుమతులు
15వ తేదీన సీఎం చేతుల మీదుగా ‘సీతారామ’ పంప్‌హౌజ్‌ల ప్రారంభం
ట్రయల్‌రన్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హాజరైన మంత్రులు తుమ్మల, పొంగులేటి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రానున్న ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల నుంచి 35 లక్షల ఎకరాల వరకు కొత్త ఆయకట్టును అందుబాటులోకి తీసుకొస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం పూసుగూడెం వద్ద నిర్మించిన రెండో పంప్‌హౌజ్‌లో ఆదివారం ఆయన మోటార్ల ట్రయల్ రన్‌ను ప్రారంభించారు.
మోటారు స్విచ్ వేయగానే గోదావరి నీళ్లు గ్రావిటీ కెనాల్‌లోకి చేరి పంప్‌హౌజ్ –3 దిశగా పరుగులు పెట్టాయి. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి ఉత్తమ్ గోదావరి జలాలకు పూజలు చేశారు. కాగా, ఇదేరోజు జరగాల్సిన మూడో పంప్‌హౌజ్ ట్రయల్‌రన్‌ను వాయిదా వేశారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు..
రెండో పంప్‌హౌజ్‌లో ట్రయల్‌రన్‌ను ప్రారంభించాక మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం సాగునీటి రంగంపై రూ.1.80 లక్షల కోట్లను వెచ్చించినా నామమాత్రంగానే కొత్త ఆయకట్టును అందుబాటులోకి తెచ్చిందని విమర్శించారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును అందుబాటులోకి తేవాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కాగా, గోదావరి నుంచి సీతారామ ప్రాజెక్టు ద్వారా 67 టీఎంసీల నీటిని వాడుకునేందుకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఉత్తమ్ ఆరోపించారు. కానీ ఈ అంశంపై తాము దృష్టి సారించి, కేంద్రంతో చర్చించామని.. మరో పది, పదిహేను రోజుల్లో కేంద్రం నుంచి అన్ని అనుమతులు వస్తాయనే నమ్మకం ఉందని తెలిపారు. ఈనెల 15వ తేదీన ప్రాజెక్టు పంప్‌హౌజ్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని, అదేరోజు వైరాలో జరిగే సభలో రూ.2 లక్షల రుణమాఫీ చెక్కులను పంపిణీ చేస్తామని వెల్లడించారు.
పీవీ హయాం నుంచి
గోదావరి నీటిని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అందించాలని పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయం నుంచి ప్రయత్నాలు జరగ్గా.. అవి ఇన్నాళ్లకు నెరవేరుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రధాన కాల్వ వెంట డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు వెంటనే ప్రారంభించేలా అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి కనీసం రెండు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందే విధంగా పనులు జరగాలని ఆదేశించారు.
తలాతోక లేకుండా
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జల యజ్ఞం ద్వారా రూ.3,500 కోట్ల వ్యయంతో మొదలుపెట్టిన ప్రాజెక్టులను తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన ఓ మహానుభావుడు (మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి) తలాతోక లేకుండా రీ డిజైన్ పేరుతో ఆ వ్యయాన్ని రూ.18 వేల కోట్లకు పెంచారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
ఆ ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో పొంతన లేకుండా అక్కడో పని, ఇక్కడో పని చేయడంతో రూ.8వేల కోట్లు వెచ్చించినా ఎకరాకు కూడా నీరు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లోపాలు సవరిస్తూ, పరిస్థితులను చక్కదిద్దుతున్నామని తెలిపారు. రాబోయే ఖరీఫ్ సీజన్ నాటికి టన్నెళ్లు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం పూర్తి చేసి పొలాల్లోకి గోదావరి నీరు పారిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment