T Minister
-
జంగంపల్లిలో కాకతీయ పనులు ప్రారంభించిన హరీశ్
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో మిషన్ కాకతీయ పనులను తెలంగాణ భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ ప్రాజెక్టును కాంగ్రెస్, టీడీపీ, జేఏసీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణాను తాము సస్యశ్యామలం చేద్దామనుకుంటుంటే వారు అడుగడుగునా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. గోదావరి నీళ్లు తెచ్చి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మారుద్దామని ప్రయత్నిస్తుంటే... విపక్షాలు మాత్రం ఎక్కడ కేసీఆర్‌కు మంచిపేరు వస్తుందోనని ఆటంకాలు కలిగిస్తున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్, జేఏసీ నేతలను ఎక్కడికక్కడే నిలదీసి ప్రశ్నించాలని.. ప్రజలుకు హరీశ్‌రావు సూచించారు. -
మంత్రి పోచారం శ్రమదానం
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం శ్రమదానంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలం దుర్కి గ్రామంలోని పీర్ల చెరువులో మిషన్ కాకతీయ పథకం కింద పూడికతీత పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం పూడిక మట్టి లోడుతో ఉన్న ట్రాక్టర్‌ను మంత్రి పోచారం స్వయంగా నడిపారు. చెరువు మట్టిని రైతులు తమ పొలాలలకు తరలించుకుని భూసారం పెంచుకోవాలని సూచించారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు నారుమళ్లను సిద్ధం చేసుకోవాలని రైతులకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. -
మర్రి శశిధర్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించను
హైదరాబాద్ : తన శాఖ మార్పుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ శుక్రవారం హైదరాబాద్‌లో నిరాకరించారు. మర్రి శశిధర్రెడ్డివి గాలి మాటలు అని ఆయన అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యాలపై తాను స్పందించను అని తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. వెటర్నరీ శాఖలోని ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. -
రాములోరి పెళ్లికి ఏర్పాట్లు ఇలాగేనా..!
దేవస్థానం ఈఓకు మంత్రి తుమ్మల క్లాస్ సరెండర్ చేయాలంటూ ఆదేశం భద్రాచలం : భద్రాచలం దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. శ్రీరామనవమికి చేస్తున్న ఏర్పాట్లపై మంగళవారం ఆయన జిల్లా అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి వారి పెళ్లి వేడుక జరిగే మిథిలా ప్రాంగణాన్ని పరిశీలించారు. కల్యాణ మండపం వద్ద పందిళ్లను సరిగా వేయకపోవడాన్ని గుర్తించారు. ఆయన దీనిపై ఈఓ జ్యోతిని వివరణ కోరారు. ఆ పనులు చేసే కాంట్రాక్టర్ ఎవరంటూ పిలిపించి అతడిని మందలించారు. ‘‘ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రాములోరి పెళ్లికి ఏర్పాట్లు చేసేది ఇలాగేనా..? నీకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవా..? నువ్వు ఉద్యోగం చేయడానికేవచ్చావా తల్లీ... పుష్కరాల నుంచీ చెబుతున్నా... నీ పద్ధతి మార్చుకోవా..నీకు చెప్పిందేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి అంటూ ఈఓ జ్యోతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది మిథిలా ప్రాంగణమా అనుకున్నారా..? పందుల గుడిసెలు అనుకున్నావా..? రామయ్యకు ఎంత ప్రతిష్ట ఉందో తెలిసి కూడా ఇలా ఏర్పాట్లు చేయటం సరైంది కాదన్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేదానిపై మీరు అసలు తిరుగుతున్నారా..అంటూ’’ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ గారూ వీరిద్దరినీ సరెండర్ చేయండి అంటూ దేవస్థానం ఈఓ జ్యోతితో పాటు డీఈపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరి వల్ల కాదుకానీ,ఈ రెండు రోజులు భద్రాచలంలోనే ఉండి మీరే ఏర్పాట్లన్నీ చూసుకోవాలని కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు సూచించారు. మిథిలా స్టేడియం ప్రాంగణంలో పందిళ్లు సరిగా వేయలేదని, గాలీ,వెలుతురు వచ్చేలా తగిన రీతిలో అమర్చాలన్నారు. శ్రీసీతారాముల వారి పెళ్లి వేడుకల ఏర్పాట్లు చూసేందుకని వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవస్థానం అధికారులను, అందులోనూ ఈఓ జ్యోతిపైనే తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలను వ్యక్తం చేయటం సర్వత్రా చర్చకు దారితీసింది. ఉత్సవాలకు మరో రెండు రోజులు గడువు ఉందనగా, ఈ పరిణామాలు చోటుచేసుకోవటంతో జిల్లా అధికారుల్లో దీనిపైనే చర్చసాగుతోంది. -
'ప్రతిపక్షానికి ఇష్టం లేనట్లుంది'
హైదరాబాద్ : అసెంబ్లీలో ఏ అంశంపై అయినా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే స్పందించిన హరీశ్‌రావు మాట్లాడుతూ... సభ సజావుగా సాగటం ప్రతిపక్షానికి ఇష్టం లేనట్లు ఉందని అన్నారు. ప్రశ్నోత్తరాలు కొనసాగించేందుకు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ సభ్యులకు హరీశ్ రావు సూచించారు. -
'దారి తప్పి దరిద్రాన్ని కొని తెచ్చుకోవద్దు'
కరీంనగర్ : వీణవంక మండలం చల్లూరులో యువతి గ్యాంగ్ రేప్ తీవ్రమైన సంఘటన అని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అభివర్ణించారు. ఈ ఘటనలో దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.శుక్రవారం కరీంనగర్లో పోలీస్ కానిస్టేబుళ్ల ఉచిత శిక్షణను ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ... బాధితురాలిని అన్ని విధాల ఆదుకుంటామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండ చర్యలు చేపడతామన్నారు. సుప్రీంకోర్టు కొత్త చట్టం ప్రకారం 16 సంవత్సరాలు పైబడిన ముగ్గురికి శిక్ష పడుతుందని చెప్పారు. ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మూడు నెలల్లోగా నిందితులను శిక్షిస్తామన్నారు. అలాగే అన్ని సమస్యలకు పరిష్కారం చూపే సత్తా తమ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. సెల్ ఫోన్, టీవీలతో మానవ సంబంధాలకు విఘాతం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో దారి తప్పి దరిద్రాన్ని కొని తెచ్చుకోవద్దు అంటూ ఉచిత శిక్షణకు వచ్చిన పోలీస్ కానిస్టేబుళ్లకు సూచించారు. అలాగే తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం పాటు పడాలని వారికి ఈటల హితవు పలికారు. -
'అసెంబ్లీలో ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధం'
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మంచి పనుల వల్లే నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లో హరీశ్‌రావు మాట్లాడుతూ... జల విధానాన్ని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటిస్తారని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమని హరీశ్ తెలిపారు. వరుస ఓటముల పాలైన మారడం లేదంటూ విపక్షాలకు హరీశ్ ఈ సందర్భంగా చురకలు అంటించారు. -
రాంరెడ్డి వెంకటరెడ్డికి తుమ్మల పరామర్శ
హైదరాబాద్ : తీవ్ర అనారోగ్యానికి గురైన ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డిని తెలంగాణ రోడ్డు భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. శనివారం నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాంరెడ్డి వెంకట్‌రెడ్డిని తుమ్మల పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రి వైద్యులతో కూడా వెంకట్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై తుమ్మల వాకబు చేశారు. వెంకట్‌రెడ్డి తొందరగా కోలుకోవాలంటూ తుమ్మల ఆకాంక్షించారు. రాంరెడ్డి వెంకటరెడ్డి గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. నేపథ్యంలో ఆయన ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. -
'హైదరాబాద్ తరహాలో ఖమ్మం అభివృద్ధి'
ఖమ్మం : హైదరాబాద్, వరంగల్ నగరాల స్థాయిలో ఖమ్మంను అభివృద్ధి చేస్తామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు విలేకర్లతో మాట్లాడుతూ... ఈ నెల 16వ తేదీన భక్తి రామదాసు, శ్రీరామ నీటి పథకానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు తరహాలో ఖమ్మంలో 500 ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
'గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్ వైపే చూస్తున్నారు'
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక వార్డులను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలకు పట్టిన గతే గ్రేటర్ ఎన్నికల్లో కూడా పునరావృతమవుతుందని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్ వైపే చూస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీదని ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. -
ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం : కేటీఆర్
హైదరాబాద్ : విపక్ష పార్టీలపై తెలంగాణ పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ విపక్షాలు ఏనాడూ ఏకంకాలేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటయ్యాయని విమర్శించారు. రుణమాఫీ హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తమతో ప్రతిపక్షాలు కలసి రాకపోయినా... ప్రజల భాగస్వామ్యంతో బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. -
వారిది అనవసర రాద్ధాంతం
ఆదిలాబాద్: ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు ఆరోపించారు. శుక్రవారం ఆదిలాబాద్‌లో విలేకరుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. పెండింగ్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాకు అదనంగా లక్ష ఎకరాలకు సాగునీటిని అందజేస్తామని చెప్పారు. ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ రైతులకు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. -
మంత్రి హరీశ్ రావు దిష్టిబొమ్మ దహనం
ఆదిలాబాద్ : భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు దిష్టిబొమ్మకు ఆశా కార్యకర్తలు ఆదివారం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో శవయాత్ర నిర్వహించారు. అనంతరం ఆ దిష్టిబొమ్మను బస్టాండ్ సెంటర్లో దహనం చేశారు. తమ వేతానాలు పెంచాలని ఆశా కార్యకర్తలు శనివారం హరీశ్‌రావును కలసి విజ్ఞప్తి చేశారు. వేతనాలు పెంచడం కుదరదని ఆయన వారికి నిక్కచ్చిగా చెప్పారు. దాంతో ఆశా కార్యకర్తలు ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి... దహనం చేశారు. అనంతరం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. -
అందుకే గోదావరి ఎడారిలా మారింది
నిజామాబాద్ : కర్ణాటక, మహరాష్ట్రలో అక్రమ ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణంతో ఎగువ నుంచి నీటి ప్రవాహం లేక తెలంగాణలోని గోదావరి నది ఎడారిగా మారిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహరాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు... కర్ణాటకలోని 30 అక్రమ చెక్‌డ్యాంలతో సింగూరు జలాశయం, నిజాంసాగర్ ప్రాజెక్టు వట్టిపోయాయన్నారు. బుధవారం నిజాంసాగర్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులు, చెక్ డ్యాంలను ముఖ్యమంత్రి కేసీఆర్ గూగుల్ సెర్చ్ ద్వారా వీక్షించారని చెప్పారు. తెలంగాణలోని 10 జిల్లాల రైతులు, ప్రజల భవిష్యత్తు అవసరాల దృష్ట్య్టా సీఎం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి నదులను అనుసంధానం చేస్తూ కాళేశ్వరం వద్ద ఎత్తిపోతల పథకంతో ఎల్లంపల్లి, మిడ్‌మానేరుకు గోదావరి నీరు అందిస్తామని, అలాగే అదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద చెక్‌డ్యాం నిర్మించి సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోని 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తామని వివరించారు. మిడ్‌మానేరు, ఎల్లంపల్లి నుంచి కామారెడ్డి నియోజకవర్గానికి గోదావరి నీళ్లు తెస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పనుల ప్రణాళికలు 10 రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు తీసుకొస్తే నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు పంటలకు సాగు నీరందుతుందన్నారు. వచ్చే మార్చి నుంచి వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ అందిస్తామని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. -
మంత్రి, ఎంపీకి చేదు అనుభవం
బెంగళూరు: తెలంగాణ - కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డికి మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సదరు ప్రజా ప్రతినిధులతోపాటు పలువురు నాయకులు బృందంగా మంగళవారం ఆ ప్రాజెక్టులను పరిశీలించేందుకు బయలుదేరింది. ఆ విషయం తెలిసిన కర్ణాటక పోలీసులు సరిహద్దుల్లో వారిని అడ్డుకున్నారు. మీ పర్యటనకు తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ అక్కడి పోలీసులు జూపల్లి, జితేందర్‌రెడ్డికి తేల్చి చెప్పారు. ఆ క్రమంలో వారు కర్ణాటక పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. ప్రాజెక్టులు పరిశీలించేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ వారు కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి.. అక్కడే భీష్మించుకుని కుర్చున్నారు. -
అమరుల త్యాగాలను మరవొద్దు: ఈటల
కరీంనగర్ : దేశం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను ఎన్నటికీ మరువరాదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో అమరవీరుల స్మారక జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... గాంధీజీ చూపిన మార్గంలో శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, పెద్దపల్లి నగర ఛైర్మన్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
'టీటీడీపీ నేతలు తోక ముడిచారు'
హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టుపై చర్చకు రాకుండ టీడీపీ నేతలు తోక ముడిచారని తెలంగాణ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీపీ నేతల రాకకోసం జూపల్లి కృష్ణారావు బుధవారం దాదాపు గంటపాటు నిరీక్షించారు. అయినా టీటీడీపీ నేతలు రాకపోవడంతో జూపల్లి కృష్ణారావు స్పందించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆపాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసిన మాట వాస్తమని ఆయన స్పష్టం చేశారు. పాలమూరులోని నాలుగు ప్రాజెక్టులకు చంద్రబాబు హయాంలో రూ. 10 కోట్లకు మించి ఖర్చు చేయలేదన్నారు. టీడీపీ నేతలు బహిరంగ చర్చకు వస్తే ఈ అంశాలు నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాలులో లేదా హైదరాబాద్‌లోని ఏ ఫంక్షన్ హాల్లోనైనా మీడియా సమక్షంలో టీటీడీపీ నేతలతో బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కలసి రాని టీడీపీ నేతలు ఇప్పుడు రాష్ట్రాభివృద్ధిలో అడ్డుపడుతున్నారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వేళ టీడీపీ నేతలు బహిరంగ చర్చకు రాకపోతే పాలమూరు ఎత్తిపోతల పథకానికి అభ్యంతరం లేదని చంద్రబాబుతో లేఖ రాయించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఖరీఫ్ నాటికి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. -
అసెంబ్లీ కమిటీ హాల్లోనే ఉంటా ... నేతలెవరొచ్చినా...
హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టుపై తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నానని తెలంగాణ భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఉదయం 11.00 గంటల నుంచి అసెంబ్లీ కమిటీ హాల్లో ఉంటానన్నారు. టీడీపీ నేతలెవరొచ్చినా తాను చర్చకు సిద్ధమని జూపల్లి వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై చర్చకు రావాలని తెలంగాణ టీడీపీ నేతలు విసిరిన సవాలుకు తాను కట్టుబడి ఉంటానని గతంలో తాను పేర్కొన్న విషయాన్ని జూపల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నిధులు వెచ్చించినట్లు చెప్పుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలను ఎండగట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జూపల్లి కృష్ణారావు ఆదివారం బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ కమిటీ హాలులో జులై 13, 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సిద్ధంగా ఉంటానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ తేదీలు, ఈ సమయం ఓ వేళ మీకు అసౌకర్యంగా ఉంటే మీరు నిర్ణయించే సమయానికి ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధంగా ఉంటామని జూపల్లి తెలిపారు. కాగా పాలమూరు ప్రాజెక్టుల విషయంలో మంత్రి జూపల్లి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డిల మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. -
'పుష్కరాలకు ప్రతి ఘాట్ వద్ద 108, 104 వాహనాలు'
హైదరాబాద్: తెలంగాణలో పుష్కరాల కోసం వైద్య, ఆరోగ్య శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. పుష్కరాల నేపథ్యంలో ప్రతి ఘాట్ వద్ద 108, 104 వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 17 ఘాట్లలో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా వైద్య సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. పాలమూరు జిల్లాను గతంలో దత్తత తీసుకున్న ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు అన్యాయమే చేశారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్ట్‌పై చంద్రబాబు వైఖరికి నిరసనగానే టీఆర్ఎస్ బంద్‌కు పిలుపు నిచ్చిందని లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. పాలమూరు ప్రాజెక్ట్ అంశంపై కేంద్రం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.