'టీటీడీపీ నేతలు తోక ముడిచారు'
హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టుపై చర్చకు రాకుండ టీడీపీ నేతలు తోక ముడిచారని తెలంగాణ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీపీ నేతల రాకకోసం జూపల్లి కృష్ణారావు బుధవారం దాదాపు గంటపాటు నిరీక్షించారు. అయినా టీటీడీపీ నేతలు రాకపోవడంతో జూపల్లి కృష్ణారావు స్పందించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆపాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసిన మాట వాస్తమని ఆయన స్పష్టం చేశారు. పాలమూరులోని నాలుగు ప్రాజెక్టులకు చంద్రబాబు హయాంలో రూ. 10 కోట్లకు మించి ఖర్చు చేయలేదన్నారు. టీడీపీ నేతలు బహిరంగ చర్చకు వస్తే ఈ అంశాలు నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
అసెంబ్లీ కమిటీ హాలులో లేదా హైదరాబాద్లోని ఏ ఫంక్షన్ హాల్లోనైనా మీడియా సమక్షంలో టీటీడీపీ నేతలతో బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కలసి రాని టీడీపీ నేతలు ఇప్పుడు రాష్ట్రాభివృద్ధిలో అడ్డుపడుతున్నారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వేళ టీడీపీ నేతలు బహిరంగ చర్చకు రాకపోతే పాలమూరు ఎత్తిపోతల పథకానికి అభ్యంతరం లేదని చంద్రబాబుతో లేఖ రాయించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఖరీఫ్ నాటికి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.