అసెంబ్లీ కమిటీ హాల్లోనే ఉంటా ... నేతలెవరొచ్చినా...
హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టుపై తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నానని తెలంగాణ భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. ఉదయం 11.00 గంటల నుంచి అసెంబ్లీ కమిటీ హాల్లో ఉంటానన్నారు. టీడీపీ నేతలెవరొచ్చినా తాను చర్చకు సిద్ధమని జూపల్లి వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై చర్చకు రావాలని తెలంగాణ టీడీపీ నేతలు విసిరిన సవాలుకు తాను కట్టుబడి ఉంటానని గతంలో తాను పేర్కొన్న విషయాన్ని జూపల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నిధులు వెచ్చించినట్లు చెప్పుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలను ఎండగట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జూపల్లి కృష్ణారావు ఆదివారం బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ కమిటీ హాలులో జులై 13, 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సిద్ధంగా ఉంటానని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ తేదీలు, ఈ సమయం ఓ వేళ మీకు అసౌకర్యంగా ఉంటే మీరు నిర్ణయించే సమయానికి ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధంగా ఉంటామని జూపల్లి తెలిపారు. కాగా పాలమూరు ప్రాజెక్టుల విషయంలో మంత్రి జూపల్లి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డిల మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే.