'దారి తప్పి దరిద్రాన్ని కొని తెచ్చుకోవద్దు'
కరీంనగర్ : వీణవంక మండలం చల్లూరులో యువతి గ్యాంగ్ రేప్ తీవ్రమైన సంఘటన అని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అభివర్ణించారు. ఈ ఘటనలో దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.శుక్రవారం కరీంనగర్లో పోలీస్ కానిస్టేబుళ్ల ఉచిత శిక్షణను ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ... బాధితురాలిని అన్ని విధాల ఆదుకుంటామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండ చర్యలు చేపడతామన్నారు.
సుప్రీంకోర్టు కొత్త చట్టం ప్రకారం 16 సంవత్సరాలు పైబడిన ముగ్గురికి శిక్ష పడుతుందని చెప్పారు. ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మూడు నెలల్లోగా నిందితులను శిక్షిస్తామన్నారు. అలాగే అన్ని సమస్యలకు పరిష్కారం చూపే సత్తా తమ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. సెల్ ఫోన్, టీవీలతో మానవ సంబంధాలకు విఘాతం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో దారి తప్పి దరిద్రాన్ని కొని తెచ్చుకోవద్దు అంటూ ఉచిత శిక్షణకు వచ్చిన పోలీస్ కానిస్టేబుళ్లకు సూచించారు. అలాగే తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం పాటు పడాలని వారికి ఈటల హితవు పలికారు.